logo

బాబోయ్‌.. ఇంతలా తవ్వేశారా?

పోలవరం ప్రధానకాలువ అంత వెడల్పు, లోతులో కందకాలు.. దాదాపు తాటిచెట్టంత ఎత్తులో నిల్వ చేసిన ఇసుక గుట్టలు..  జిల్లాలో ఎక్కడా లేనంతగా..

Updated : 21 May 2024 06:06 IST

అవాక్కయిన అధికారులు
ఇబ్రహీంపేట ర్యాంపును చూసి ఆశ్చర్యం 

గోదావరి నదిలో ఇబ్రహీంపేట వద్ద  తవ్విన ఆనవాళ్లు  

కుక్కునూరు, న్యూస్‌టుడే: పోలవరం ప్రధానకాలువ అంత వెడల్పు, లోతులో కందకాలు.. దాదాపు తాటిచెట్టంత ఎత్తులో నిల్వ చేసిన ఇసుక గుట్టలు..  జిల్లాలో ఎక్కడా లేనంతగా.. తవ్వకాలు ఇక్కడ జరిగిన ఆనవాళ్లు చూసి అధికారులే ఆశ్చర్యపోయారు.

క్రమ తవ్వకాలు నిలిపివేతకు కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కమిటీలు ఏర్పాటుచేసి నియంత్రణ చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కలెక్టర్‌ ప్రసన్నవెంకటేశ్, ఎస్పీ మేరీ ప్రశాంతి, జేసీ లావణ్యవేణి, ఐటీడీఏ పీవో సూర్యతేజలతో కూడిన అధికారుల బృందం సోమవారం కుక్కునూరు మండలంలోని ఇసుక రీచ్‌లను పరిశీలించింది. దాచారం, వింజరం, ఇబ్రహీంపేట ర్యాంపులను తనిఖీ చేసింది. ప్రస్తుతం ఇసుక తవ్వకాలు నిలిచిపోయినా ఎన్నికల కోడ్‌ ముందు వరకూ జరిగిన తవ్వకాలు, ఇప్పటికీ నిల్వ ఉన్న ఇసుక గుట్టలను చూసి అధికారుల బృందం అవాక్కయింది. 

అక్కడి పరిస్థితులను చూసి, భారీఎత్తున తవ్వకాలు జరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. వింజరం, ఇబ్రహీంపేటలలో తవ్వకాలు జరిగాయి. దాచారం ర్యాంపు ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో  తవ్వకాలు జరగలేదు. వింజరం, ఇబ్రహీంపేట ర్యాంపుల నుంచి లక్షల టన్నుల్లో రవాణా జరిగిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇబ్రహీంపేట ర్యాంపులో ఈ పరిస్థితి ఇంకాస్త అధికం. ఇప్పటికీ అక్కడ నిల్వ ఉన్న గుట్టలు చూసినా... గోదావరిలో తవ్వకాలు జరిగిన కందకాలను పరిశీలించినా, ఈ స్థాయిలో తవ్వకాలు ఎలా జరిగాయన్న అనుమానాలు తలెత్తుతాయి.

చివరిలో వివాదం.. ఇబ్రహీంపేటలో పెద్దఎత్తున ఇసుక నిల్వలు ఇప్పటికీ అలాగే ఉండిపోవటం వెనుక, జేపీ సంస్థకు స్థానిక సొసైటీకి మధ్య తేడాలు రావటమే కారణం. జేపీ తమకు లాభం చేసేలా వ్యవహరించకపోవటంతో, ఆ నిల్వలను తామే అమ్ముకునేందుకు అనుమతి కోరుతూ సొసైటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ఆ నిల్వలు అలా మిగిలిపోయాయి. ఆ నిల్వలను అలాగే ఉంచి గోదావరిలో తవ్వకాల ద్వారా నేరుగా లారీలతో తెలంగాణకు రవాణా చేసేవారు. దీంతో కందకాలు కూడా భారీ స్థాయిలో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి.

అన్నీ తానై వ్యవహరించిన జేపీ సంస్థ.. కుక్కునూరు మండలం ఏజెన్సీ ప్రాంతం. ప్రత్యేక గిరిజన చట్టాల కారణంగా ఇక్కడ ఏ పని అయినా, గిరిజనులే చేపట్టాలి. ఇసుక తవ్వకాలు కూడా గిరిజన సొసైటీలే నడిపించాలి. పేరుకు గిరిజన సొసైటీలను ఏర్పాటుచేసి తవ్వకాలు, రవాణాలో స్థానికంగా ఉండే నాయకులతో కలిసి జేసీ సంస్థ చక్కబెట్టింది. ఇబ్రహీంపేట, వింజరంలతో పాటు బూరుగువాయి వద్ద పాములేరు నది నుంచి కూడా పెద్దఎత్తున తవ్వకాలు, రవాణా కొనసాగించింది. ఆ సంస్థ పేరుతో రవాణా పర్మిట్లు ఉంటే చాలు ఎక్కడా ఆ లారీలను ఆపే సాహసం చేసేవారు కాదు. అయితే ఆ పర్మిట్లు కూడా చేతిరాతతో పూరించినవి కావటం గమనార్హం. 


అనుమతికి.. రవాణాకు పొంతనే లేదు.. 

ఇక్కడ ఇసుక తవ్వకాలకు అసలు అనుమతులే లేవు. పునరావాస కాలనీల నిర్మాణాలకు, స్థానిక ప్రజల అవసరాలకు మాత్రమే తవ్వకాలు సాగించాలి. కానీ తవ్వకందారులు తెలంగాణకు రవాణా చేసేశారు. స్థానికంగా ఉండే అధికారులకు ఈ విషయం తెలిసినా ఎవరూ అడ్డుచెప్పే పరిస్థితి కనిపించలేదు. అప్పుడప్పుడూ స్థానికులు రవాణాను అడ్డుకున్న సమయాల్లో స్థానిక అధికారులు మధ్యవర్తిత్వం నెరపి, రవాణాకు ఆటంకం లేకుండా చూసేవారు. దాంతో తవ్వకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. ఆ ఫలితమే ఇబ్రహీంపేట, వింజరం ర్యాంపులలో  భారీ తవ్వకాలు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని