logo

పాడి రైతుల ఆవేదన.. అరణ్య రోదన!

‘మినీ గోకులం షెడ్డు మంజూరైందంటే అప్పు చేసి పనులు మొదలుపెట్టాం. పాక తొలగించి షెడ్డు కోసం పిల్లర్లు వేశాక రూ.30 వేలు ఖాతాలో పడ్డాయి.

Published : 22 May 2024 05:37 IST

 అటకెక్కిన రాయితీ పథకాలు

నష్టపరిహారానికి ఎదురుచూపులు

యర్రంపేటలో పందిరి నీడన మూగజీవాలు..ఆ సమీపంలోనే అసంపూర్తిగా మినీగోకులం షెడ్డు 
ఏలూరు వన్‌టౌన్, కొయ్యలగూడెం గ్రామీణ, ఉంగుటూరు, న్యూస్‌టుడే : ‘మినీ గోకులం షెడ్డు మంజూరైందంటే అప్పు చేసి పనులు మొదలుపెట్టాం. పాక తొలగించి షెడ్డు కోసం పిల్లర్లు వేశాక రూ.30 వేలు ఖాతాలో పడ్డాయి. తర్వాత పడకపోవడంతో పనులు ముందుకు సాగక షెడ్డు పూర్తికాలేదు. మూగజీవాల నీడ కోసం పందిరి వేసి నెట్టుకొస్తున్నాం’ అని చెబుతున్నారు యర్రంపేటకు చెందిన మిద్దే చంద్రమ్మ. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరానికి చెందిన రైతు తమ్మినీడి శ్రీనివాసరావుదీ ఇదే పరిస్థితి. తనకు రూ.1.90 లక్షలు రావాల్సి ఉండగా రూ.90 వేలు మాత్రమే ఖాతాలో పడ్డాయని తెలిపారు.

మినీగోకులంపై చిన్నచూపు.. పోషకులు తమ పశువులను రక్షించుకునేందుకు గత ప్రభుత్వ హయంలో మినీగోకులం షెడ్ల నిర్మాణం చేపట్టింది. ఒక్కో షెడ్డుకు రూ.1.80 లక్షల వరకు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. గతంలో నిర్మించిన వాటికి నగదు చెల్లించలేదు. కొందరు పాడి రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. వారిలో కొంతమందికి నగదు చెల్లించారు. మిగిలిన వారికి చెల్లిస్తామని చెబుతూనే అయిదేళ్లు గడిచిపోయాయి.
ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువ శాతం పాడి పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు మేపుతూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో పాడి రైతులను దృష్టిలో పెట్టుకుని పలు పథకాలు అమలు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ పథకాలకు పాతరేసింది. అలాగని కొత్తగా ప్రవేశపెట్టిందీ లేదు. పాతర గడ్డి, సంపూర్ణ దాణా (టీఎంఆర్‌), క్షీరసాగర, మినరల్‌ మిక్చర్‌ తదితరాలు రాయితీపై అందించడం నిలిపేశారు. గుత్తేదారుకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం నెలకొనడంతో టీఎంఆర్‌ సరఫరా నిలిచి పోయినట్లు తెలిసింది. క్షీరసాగర పథకం స్థానంలో ప్రవేశపెట్టిన సమీకృత దాణా సరఫరా కూడా అంతంతమాత్రమే. ప్రస్తుతం ఇవేమీ అందుబాటులో లేవని రైతులు వాపోతున్నారు. బొబ్బర్లు, సజ్జలు వంటి నాలుగు రకాల పశుగ్రాస విత్తనాల్ని 75 శాతం రాయితీపై అందించి సరిపెడుతున్నారు. లేగదూడల పౌష్టికాహారం నిమిత్తం అమలు చేసిన సునందిని పథకాన్నీ  అటకెక్కించారు. ఒకవైపు తొలకరి వర్షాలు పలకరిస్తున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది పశుగ్రాసం, దాణా సరఫరాకు సంబంధించి ఇంతవరకు ఇండెంట్లు కూడా సేకరించలేదని తెలుస్తోంది.

మూడేళ్లకే చేతులెత్తేశారు.. పశు నష్టపరిహార పథకం ప్రారంభించిన మూడేళ్లకే ప్రభుత్వం చేతులెత్తేసింది. దాని స్థానంలో రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసేలా పశు బీమాను తెరపైకి తెచ్చారు. అదీ అంతంత మాత్రంగానే అమలవుతోంది. ఉదాహరణకు కొయ్యలగూడెం మండలం విషయానికొస్తే గడిచిన మూడున్నరేళ్లలో 293 పశువులు మరణిస్తే 150కి నష్టపరిహారమిచ్చారు. పథకం రద్దయినా సదరు బకాయిలు ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉంది. అసలు ఇస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేక పశు పోషకుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ఈ పథకానికి సంబంధించి 1,715 మంది రైతులకు రూ.4.73 కోట్ల వరకు రావాల్సి ఉంది.  

ఉంగుటూరు మండలం కాగుపాడులోని పశువుల ఆసుపత్రి భవనం శిథిలమైంది. పైకప్పు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. గేదెలకు వైద్యం అందించే షెడ్డు స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొత్త భవన నిర్మాణానికి తెదేపా హయాంలో రూ.40 లక్షలు మంజూరైనా ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఏడాదిగా పశు వైద్యుడి పోస్టు భర్తీ కావడం లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని