logo

ఇస్తారా..చేతులెత్తేస్తారా!

వేసవి సెలవులు మరో 20 రోజుల్లో ముగియనున్నాయి. జూన్‌ 12న బడి తలుపులు తెరుచుకోనున్నాయి. అయినా పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ నేటికీ ఓ కొలిక్కి రాలేదు.

Published : 22 May 2024 05:50 IST

మండలాలకు మూడో వంతు సైతం చేరని పుస్తకాలు
కాలయాపనపై విద్యార్థుల తల్లిదండ్రుల అసంతృప్తి

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: వేసవి సెలవులు మరో 20 రోజుల్లో ముగియనున్నాయి. జూన్‌ 12న బడి తలుపులు తెరుచుకోనున్నాయి. అయినా పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ నేటికీ ఓ కొలిక్కి రాలేదు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో అందజేస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. గతేడాది సైతం కొన్ని తరగతులకు శత శాతం పుస్తకాలు అందజేయలేదు. సార్వత్రిక ఎన్నికల పేరిట ఈ సంవత్సరమూ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తాడేపల్లిగూడెంలోని పుస్తక పంపిణీ కేంద్రం నుంచి ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ఆయా మండలాల్లోని విద్యాశాఖాధికారి కార్యాలయాలకు చేరవేస్తున్నట్లు అక్కడి యంత్రాంగం చెబుతోంది. ఇక 8, 9, 10వ తరగతుల పుస్తకాలు మాత్రం ముద్రణ కేంద్రం నుంచి నేరుగా పాఠశాలలకే చేరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మందకొడిగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాతోపాటు కృష్ణా నుంచి ఏలూరు జిల్లాలో చేరిన కైకలూరు, నూజివీడులోని అన్ని మండలాల పాఠశాలలకు తాడేపల్లిగూడెం పుస్తక పంపిణీ కేంద్రం నుంచే సరఫరా జరుగుతోంది. ఒకటి నుంచి 7వ తరగతుల వరకు ఇంకా 8,47,845 పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉంది. ఇటీవల పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ జిల్లాలో పర్యటించడంతో ఉంగుటూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం, తణుకు మండలాలకు మాత్రం పుస్తకాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయడం గమనార్హం పదో తరగతికి సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తున్నందున పుస్తకాలు అందుబాటులో లేకపోతే గందరగోళ పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  బడులు తెరిచే నాటికి పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని  విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని