logo

కోర్టు చెబితే కాని కదలరా?

ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణలో ఉభయ జిల్లాల్లో అధికారుల ఉదాసీనత పరాకాష్ఠకు చేరుకుంది. న్యాయస్థానాలు మొట్టికాయలేస్తేనో.. తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తేనో తప్ప వారిలో కదలిక రావటం లేదు.

Published : 22 May 2024 05:54 IST

ఇసుక అక్రమాలపై అధికారుల ఉదాసీనత
సాధారణ తనిఖీలకు తిలోదకాలు
భారీ యంత్రాలతో తోడేస్తున్నా కనిపించదే
ఉభయ జిల్లాల్లో భారీగా దందా

ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే-ఆచంట, వేలేరుపాడు, కుక్కునూరు : ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణలో ఉభయ జిల్లాల్లో అధికారుల ఉదాసీనత పరాకాష్ఠకు చేరుకుంది. న్యాయస్థానాలు మొట్టికాయలేస్తేనో.. తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తేనో తప్ప వారిలో కదలిక రావటం లేదు. ఇసుక తవ్వకాలను అడ్డుకోవటం.. సాధారణ తనిఖీలు చేయడం దోపిడీదారులపై చర్యలు తీసుకోవటం అధికారులు దాదాపు మర్చిపోయారు. వైకాపా నాయకులు గత అయిదేళ్లలో లక్షల టన్నుల ఇసుక బొక్కేశారు.  ఎన్నికల సమయమైనా, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఇసుక దందా మాత్రం ఆగలేదు. 
‘ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపేయాలి. దోపిడీ జరుగుతున్న చోటుకు అధికారుల బృందాలతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేసి నివేదిక ఇవ్వాలి’ అని సుప్రీంకోర్టు 2023 మార్చి 23న ఆదేశాలిచ్చింది’. ఏలూరు, పశ్చిమ జిల్లాల ఉన్నతాధికారులు హడావుడిగా కొన్ని రీచ్‌లు పరిశీలించి మా పనైపోయింది అన్నట్లు చేతులు దులుపుకొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించటం..వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవటం, ఇసుక అక్రమాలను అరికట్టడం ప్రయత్నాలు చేయలేదు. 

మాకేం పని అన్నట్లు!

మైనింగ్, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, పోలీస్‌ శాఖలు  ఇసుక అక్రమ తవ్వకాలపై నిత్యం నిఘా పెట్టాలి. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. విధుల ప్రకారం తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన దాఖలాలు కూడా ఇప్పటి వరకు కనిపించలేదు. అధికార పార్టీ ఇసుక అక్రమాలపై సామాన్యులు కోర్టు మెట్లెక్కే దాకా అధికారులు తవ్వకాల వైపు కన్నెత్తి చూడటం లేదు. తీరంలో నిరంతరం రెవెన్యూ, పోలీస్‌ శాఖ సిబ్బంది కాపలా ఉండాలి. రీచ్‌ల్లో నిఘా నేత్రాలుండాలి. అక్రమ తవ్వకాలపై సాధారణ ప్రజలు సైతం ఉన్నతాధికారులకు నేరుగా ఫిర్యాదు చేసే వ్యవస్థ ఉండాలి. అధికారులు ఈ చర్యలు చేపట్టకుండా కోర్టు ఆదేశాలిస్తే వెళతాం..లేదంటే కన్నెత్తి చూడం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామస్థులు ప్రాణాలకు తెగించి రవాణాను అడ్డుకుని..వాహనాలను పట్టించినా అధికారులు చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలున్నాయి. 

వైకాపా ఆశీస్సులతో అడ్డగోలుగా.. అధికారుల ఉదాసీనతే అదనుగా ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. కోర్టు ఆదేశాలుంటే మాకేంటి..మాకు అధికార పార్టీ ఆశీస్సులున్నాయంటూ తవ్వకాలు సాగించారు. కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట, వింజరం, ఆచంట మండలం కరుగోరుమిల్లి తదితర రీచ్‌లలో భారీ యంత్రాలతో తవ్వి లక్షల టన్నులు అమ్ముకున్నారు. తవ్వకాలు జరగటంపై ఆగ్రహం వ్యక్తం చేసి కలెక్టర్లతో పాటు అధికారులను క్షేత్ర పర్యటన చేయాలని మళ్లీ మే 16న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయినా దందా ఆగలేదు. కరుగోరుమిల్లిలో భారీ యంత్రాలతో భారీగా తవ్వకాలు చేశారు. అధికారులు వస్తారని గత రెండు రోజుల నుంచి ఆపారు.

గ్రామస్థులు పట్టించినా.. పట్టించుకోరా

ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల భారీ యంత్రాలతో ఇసుక తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. ట్రాక్టర్లలో నింపిన ఇసుక తీరంలోనే దించేసి..ఆధారాలతో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా బాధ్యులపై చర్యలు లేవు. అదే గ్రామంలో కొంత కాలం క్రితం మరో మారు గ్రామస్థులు ట్రాక్టర్లను అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇసుక ర్యాంపునకు గండికొట్టారు. అధికారులు వాహనాలు స్వాధీనం చేసుకుని మైనింగ్‌ శాఖకు ఆదేశాలిచ్చామని చెబుతున్నారు తప్ప ఏం చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు. కుక్కునూరు మండలం ఇబ్రహీంపేటలో అనుమతుల్లేకుండా అడ్డగోలుగా తవ్వకాలు చేసి నిబంధనలు తుంగలో తొక్కి తెలంగాణకు రవాణా చేశారు. ఇదంతా బహిరంగ రహస్యమైనా అధికారులు పట్టించుకోలేదు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని