logo

తిరగవు.. వెలగవు!

విద్యుత్తు పరివర్తకాల వద్ద ఎర్త్‌ పైపులు సక్రమంగా లేకపోవడంతో సరఫరాలో హెచ్చుతగ్గులకు కారణమవుతోంది. ఇక తీగలు మార్పు, పాడైన, వాలిన స్తంభాల తొలగింపులో నిర్లక్ష్యం కనిపిస్తోంది.

Updated : 22 May 2024 06:35 IST

గ్రామాల్లో జటిలంగా లోవోల్టేజీ సమస్య
నిర్వహణ పనులు, సిబ్బంది నియామకాల్లో నిర్లక్ష్యం

మార్టేరు, పెనుగొండ, న్యూస్‌టుడే : వ్యయం తగ్గించుకునే క్రమంలో విద్యుత్తు సంస్థ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. గతంలో 11కేవీ విద్యుత్తు తీగలను ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి కేవలం నివాస గృహాలకు దూరమైన ప్రాంతం నుంచి ఏర్పాటు చేసేవారు. కాని కొన్నేళ్లుగా ఈ విధానానికి స్వస్తి పలికి ఎల్‌టీ విద్యుత్తు లైనుకు పైభాగంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో కొబ్బరి ఆకులు వంటివి పడిన సందర్భంలో ఈ రెండు లైన్లు కలిసి 230 విద్యుత్తు లైను పరిధిలో ఉన్న ఇళ్లపై ప్రభావం పడుతోంది. ఈ సందర్భంలో హైవోల్టేజీ రావడంతో విద్యుత్తు ఉపకరణాల కాలిపోయి వినియోగదారులకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లుతోంది. 


ఈ చిత్రంలోని ప్రాంతం పెనుమంట్ర మండలం ఆలమూరు పంచాయతీ  పరిధిలోని కోమటిచెర్వు. ఇక్కడ సుమారు 50 ఇళ్లకు పైగా ఉండగా వీటిన్నటికీ విద్యుత్తు సర్వీసులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తరచూ లోవోల్టేజీ సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. కేవలం చిన్న పరివర్తకంతో నెట్టుకొస్తున్నారు.

ఆ మధ్యలో చెడితే ఇక అంతే!

మార్టేరు, ఆలమూరు, పెనుమంట్ర  ఉపకేంద్రాలకు పెనుగొండ నుంచి 33 కేవీ లైను ద్వారా సరఫరా అవుతోంది. పెనుగొండ-మార్టేరు లైనులో ఏదైనా సమస్య ఏర్పడితే మూడు ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాలన్నీ అంధకారంలోకి వెళ్తున్నాయి. గతంలో పెనుమంట్ర ఉపకేంద్రానికి భీమవరం నుంచి సరఫరా వచ్చేది.  పెనుగొండ నుంచి తీసుకోవడంతో తరచూ సమస్య ఏర్పడుతోంది. ఇటీవల 5 గంటల పాటు సరఫరా ఆగిపోయింది.
నిత్యం అవస్థలే.. నిత్యం చినకరణం గారి వీధిలో లో-ఓల్టేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం.   రాత్రి అయితే లైట్లు సరిగా వెలగవు, పంకాలు తిరగవు. ఉక్కబోత ఎక్కువగా ఉంటే ఇక మా తిప్పలు చెప్పనవసరం లేదు.

అత్యం నాగఉషాకుమారి, చెరుకువాడ


నిర్వహణ అంతంత మాత్రమే!

విద్యుత్తు పరివర్తకాల వద్ద ఎర్త్‌ పైపులు సక్రమంగా లేకపోవడంతో సరఫరాలో హెచ్చుతగ్గులకు కారణమవుతోంది. ఇక తీగలు మార్పు, పాడైన, వాలిన స్తంభాల తొలగింపులో నిర్లక్ష్యం కనిపిస్తోంది.

గ్రామాల్లో సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా ఉంది. రెండు మూడు గ్రామాలకు ఒక్కొక్క జూనియర్‌ లైన్‌మ్యాన్‌ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో సచివాలయాల ద్వారా నియమితులైన ఎనర్జీ అసిస్టెంట్లపై తీవ్రమైన పనిభారం పడుతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని