logo

ఎల్లలు దాటిన విజయాలు

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విద్యా శాఖ ‘ప్రేరణ ఉత్సవ్‌’ పేరుతో ఏటా పోటీలు నిర్వహిస్తోంది. వందలాది మంది చిన్నారులు ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు

Updated : 22 May 2024 06:26 IST

 జాతీయ, అంతర్జాతీయ వేదికపైకి అడుగులు
ప్రతిభకు సాన పెడుతున్న విద్యార్థులు

కలిదిండి, భీమవరం పట్టణం, ఆగిరిపల్లి, న్యూస్‌టుడే : చిన్నారులకు అమ్మ ఒడిలోనే తొలి ఆటలు. నాన్న కదలికలే భవితకు బాటలు. గురువులే స్ఫూర్తి ప్రదాతలు. బడి వయసులోనే ఓ లక్ష్యం నిర్దేశించుకుని.. ఆ దిశగా కఠోర సాధన చేస్తూ.. బాల్యంలోనే తమ ప్రతిభను ఎల్లలు దాటిస్తున్నారు. మెదడుకు పదును పెట్టే ఆటైనా.. ఆట విడుపుగా వేసే అందమైన బొమ్మలైనా.. కరాటే కసరత్తులైనా తమదే పైచేయి అంటున్నారు. బడి మైదానం దాటి.. జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు. చదువుకు ఆటంకం లేకుండా.. విరామ సమయంలో శ్రమిస్తూ.. లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నారు.

 ‘భవిష్య’త్తుకు బంగారు బాటలు వేసేందుకు..

చదరంగం అంటే నాన్నకు చాలా ఇష్టం. నాన్న ఎవరితో చెస్‌ ఆడిగా నిశితంగా గమనించడం అలవాటుగా మారింది భీమవరానికి చెందిన దాట్ల భవిష్యకు. ఆట పేరేంటో తెలియని వయసులోనే.. దానిపై ఆసక్తి పెంచుకుంది. బడిలో మిత్రులతో కలిసి సాధన చేస్తూ.. ఇంటి వద్ద నాన్నతోనే తలపడటం మొదలుపెట్టింది. విజేతగా నిలవడానికి అవసరమైన మెలకువలన్నీ క్రమంగా పట్టేసింది. ఒక్కో పావు కదుపుతూ.. ఒక్కో గెలుపు సాధిస్తూ.. తన భవితకు బంగారు బాటలు వేసుకుంది. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న భవిష్య అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య విడుదల చేసిన చదరంగం రేటింగ్‌ జాబితాలో 1410వ ర్యాంకు క్రీడాకారిణిగా నిలిచింది. ‘చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌’ కావాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. 

మెరిసిన ‘భరత్‌’..

ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన ‘దేవరపల్లి భరత్‌ రాయ్‌’ అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.  ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న భరత్‌ ఇంటి వద్ద నాన్నతో కలిసి సరదాగా కరాటే సాధన మొదలుపెట్టాడు. తరువాత ఈ అంశంలో తల్లిదండ్రులు అతడిని ప్రోత్సహించి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. పాఠశాలల్లో శిక్షకుడు జాస్తి విద్యాధర్‌ పర్యవేక్షణలో సాధన కొనసాగించాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయికి చేరాలన్న భరత్‌ లక్ష్యానికి బాటలు పడ్డాయి. ఇటీవల బాపట్లలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి.. అంతర్జాతీయ స్థాయి టోర్నీకి ఎంపికయ్యాడు. ఈ నెల 21న నేపాల్‌లో ప్రారంభమైన పోటీల కోసం కఠోర సాధన చేశాడు. 

 గెలుపు ‘అన్వేష’ణపై దృష్టి 

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విద్యా శాఖ ‘ప్రేరణ ఉత్సవ్‌’ పేరుతో ఏటా పోటీలు నిర్వహిస్తోంది. వందలాది మంది చిన్నారులు ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. కలిదిండి మండలం ఆరుతెగలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కత్తుల అన్వేష్‌ చిత్రకళలో సత్తాచాటి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఖాళీ సమయంలో కాగితాలపై బొమ్మలు గీస్తూ సాధన చేసే అన్వేష్‌ను గణిత ఉపాధ్యాయుడు రమేశ్‌ ప్రోత్సహించారు. ఈ పోటీలను సవాలుగా స్వీకరించిన అన్వేష్‌ చిత్ర విభాగాన్ని ఎంచుకొని న్యాయ నిర్ణేతలను మెప్పించాడు. ఈ ఏడాది జులైలో గుజరాత్‌లో జరగనున్న జాతీయ స్థాయి ప్రేరణ పోటీలకు ఎంపికయ్యాడు. బొమ్మలకు జీవం పోసి.. అంతర్జాతీయ స్థాయిలో చిత్రకళాకారుడిగా గుర్తింపు పొందడమే తన లక్ష్యమని అన్వేష్‌ చెబుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని