logo

నకిలీ శీతల పానీయాల కేంద్రంపై విజిలెన్స్‌ దాడి

 మండవల్లి మండలంలో నకిలీ శీతలపానీయాల తయారీ కేంద్రంపై విజిలెన్స్‌ అధికారులు మంగళవారం రాత్రి దాడి చేశారు.

Published : 22 May 2024 06:18 IST

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలంలో నకిలీ శీతలపానీయాల తయారీ కేంద్రంపై విజిలెన్స్‌ అధికారులు మంగళవారం రాత్రి దాడి చేశారు. విజిలెన్స్‌ డీఎస్పీ సింగలూరి వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లోకుమూడిలో గ్రామానికి చెందిన కాగిత రామకృష్ణ అనధికారికంగా కొన్ని పెద్ద కంపెనీల బ్రాండ్లతో నకిలీ శీతల పానీయాల(కూల్‌డ్రింక్స్‌) తయారు చేస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు ఏలూరు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఏకకాలంలో కేంద్రంపై దాడులు నిర్వహించి సోదాలు చేశారు. కూల్‌డ్రింక్స్‌ తయారీకి కావాల్సిన రసాయన పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గడువు తీరిన శీతలపానీయాల సీసాలను గుర్తించి నమూనాలు సేకరించి ఆహార భద్రతా పరీక్షా కేంద్రాలకు పంపారు. ఈ కేంద్రానికి తూనికలు, కొలతల శాఖ అనుమతులు సైతం లేనట్లు గుర్తించారు. దీనిపై పలు సెక్షన్ల కింద యజమాని రామకృష్ణపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ ఎస్సై జి.విల్సన్, ఫుడ్‌సేఫ్టీ అధికారి రామరాజు, తూనికలు కొలతల శాఖాధికారి ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇనుప రాడ్లతో దాడి.. నలుగురికి తీవ్ర గాయాలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా చేసిన వేడుకల్లో బాణసంచా పేలుళ్లు, బ్యానర్‌ కట్టడంపై ఏర్పడిన ఘర్షణ పెరిగి పెద్దదై ఇనుపరాడ్లతో దాడికి దారి తీసింది. ఈ ఘటన ముదినేపల్లి మండలం ఊటుకూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఊటుకూరుకు చెందిన జి.శ్రీనుబాబు తన స్నేహితులతో కలిసి ఈనెల 19 అర్ధరాత్రి జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా బాణసంచా పేల్చారు. ఆ సమయంలో ఎదురుగా నివాసముంటున్న పోసిన బాలకోటయ్య బాణసంచా పేలుళ్లు, బ్యానర్‌ ఏర్పాటుపై ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది. స్థానికులు సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి పోసిన బాలకోటయ్య మరో ఆరుగురిని తీసుకుని శ్రీనుబాబు ఇంటికి వెళ్లాడు. ఇంటిలో నిద్రిస్తున్న శ్రీనుబాబుతో పాటు కుటుంబసభ్యులు శివాజీ, శ్రీనివాసరావు, మాణిక్యాలరావులపై కారం జల్లి ఇనుపరాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని గుడివాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనుబాబు ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ పద్మజ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కైకలూరు రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌ సంఘటన స్థలంలో వివరాలు సేకరించారు.


సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లపై కేసు 

ఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడే: పోలీసుస్టేషన్‌లో ఓ వ్యక్తిని కొట్టారనే అభియోగంపై కోర్టు ఆదేశాల మేరకు సీఐ, ఇద్దరు ఎస్సైలు, అయిదుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు సత్రంపాడుకు చెందిన అవుటుపల్లి సీతయ్య 2021లో ఏలూరు పాత బస్టాండులోని అప్పలరాజు హోటల్‌కు వెళ్లి భోజనం చేశారు. బిల్లు చెల్లించే  విషయంలో ఇతనికి, హోటల్‌ నిర్వాహకులకు గొడవ జరిగింది. సీతయ్య టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చి హోటల్‌ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు గురించి స్టేషన్‌కు వెళ్లిన సమయంలో తనతో అప్పటి సీఐ ఆదిప్రసాద్, ఎస్సైలు నాగబాబు, కిషోర్‌బాబు దురుసుగా ప్రవర్తించారని, కానిస్టేబుళ్లతో కలిసి కొట్టారని సీతయ్య మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని విన్నవించారు. కమిషన్‌ సూచనల మేరకు కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. విచారించిన మొబైల్‌ కోర్టు బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో త్రీటౌన్‌ సీఐ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎస్సై ప్రసాద్‌ అప్పట్లో టూటౌన్‌ సీఐగా పని చేసిన ఆదిప్రసాద్, ఎస్సైలు నాగబాబు, కిషోర్‌బాబు, కానిస్టేబుళ్లు వెంకట సత్యనారాయణ, రవికుమార్, శ్రీనివాసరావు, జీవరత్నం, రాజేష్‌లపై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని