logo

క్షణమొక యుగం!

ప్రస్తుతం రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గడియారం నెమ్మదించినట్లు, రోజులో 24 గంటలు గడవటానికి 72 గంటలు పడుతున్నట్లు.. వారం నెలలా సాగిపోతున్నట్లు అనిపిస్తోందట.

Updated : 24 May 2024 05:17 IST

అభ్యర్థులు, నాయకుల ఎదురుచూపులు

ప్రస్తుతం రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గడియారం నెమ్మదించినట్లు, రోజులో 24 గంటలు గడవటానికి 72 గంటలు పడుతున్నట్లు.. వారం నెలలా సాగిపోతున్నట్లు అనిపిస్తోందట. పగలు కాలక్షేపం కాదు.. రాత్రుళ్లు నిద్రపట్టదు.. ఇలా అదో రకమైన రుగ్మత ఆవహించినట్లు చెబుతున్నారు. రాజకీయ పిచ్చి ఉన్న నలుగురు కలిస్తే చాలు జూన్‌ 4కు ఇంకెన్ని రోజులున్నాయో లెక్కేసుకుంటూ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 

కుక్కునూరు, న్యూస్‌టుడే

ఎవరో ఒకరు వచ్చి.. 

ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ తేదీ నాటికి గిర్రున తిరిగిన గడియారం ముల్లు.. అదేమిటో ఇప్పుడు గట్టిగా ముందుకు తోసినా కదలలేనంటోందంటూ భారంగా మారిన తమ దినచర్యపై నిట్టూర్చుతున్నారు. పోలింగ్‌కు, ఫలితాలకు మధ్య దాదాపు 22 రోజుల వ్యవధి ఉండటం అందరిని నిరాశకు గురిచేస్తోంది. ఏదో ఒక వ్యాపకంతో రోజు వెళ్లదీద్దామంటే.. ఎవరో ఒకరు వచ్చి ఎన్నికలకు సంబంధించిన తాజా వార్తలు, పోలింగ్‌ పరిణామాలు, అనంతర ఘటనలు, వాటి వెనుక జరిగిన వ్యవహారాలు గుర్తు చేసి, ఆలోచనలన్నీ అటువైపే మళ్లేలా చేస్తున్నారు. 

రోజూ వాకబులే.. 

ఎవరు ఏమనుకుంటున్నారు.. ఈ సారి ఎన్నికల్లో ఏ వర్గం ఎటువైపు మళ్లింది..మహిళల ఓట్లు మనకు వరమేనా? యువ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు. బూత్‌ల వారీగా పోలైన ఓట్లు ముందు పెట్టుకొని, అక్కడున్న బలాబలాలను బేరీజు వేస్తూ, లాభనష్టాలపై అంచనాలు వేస్తున్నారు. ప్రసార మాధ్యమాల్లో నిపుణుల విశ్లేషణలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇస్తున్న మనోబలంతో గెలుపుపై ఒకింత ధైర్యం తెచ్చుకుంటూ రోజులు గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రోజుకో సంస్థ సర్వేలు విడుదల చేస్తున్నాయి. వాటిలో ఉన్న వివరాలు చూసి గందరగోళానికి గురికావాల్సి వస్తోంది. బరిలో ఉన్న వారిలో కొందరు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చే ఫోన్‌ కాల్స్‌కు రాజకీయ ఆసక్తి ఉన్నా వారు మాత్రమే స్పందిస్తున్నారు. సామాన్య ఓటరు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో దానిపై కూడా నమ్మకం కుదరక ఉత్కంఠకు లోనవుతున్నారు.

యువ, మహిళా ఓటర్లదే హవా

జిల్లాలో 16,37,430 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 13,70,153 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ శాతం 83.68 కాగా, పోస్టల్‌ బ్యాలట్‌ 1.15 శాతంగా ఉంది. మొత్తంగా 84.83 శాతం నమోదైంది. ఇందులో 6,93,045 మంది మహిళలు, పురుషులు 6,77,056 మంది ఓటేశారు. అంటే 15,989 మంది మహిళల ఓట్లు అదనం. ఈ అంశం తమకు లాభదాయకం అంటోంది ఎన్డీయే వర్గం. మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, రూ.1500 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం, రూ.4 వేల పింఛను వంటి అంశాలు ప్రభావితం చేశాయంటున్నారు. ఇక యువత ఓట్లు కూడా కీలకం కానున్నాయి. వారి సంఖ్య 7,67,587గా ఉంది. ఈ దఫా ఎక్కువగా కూటమినే బలపరిచినట్లు తెలుస్తోంది. వైకాపా పాలన అయిదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకపోవడం, నిరుద్యోగులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సి రావడం, విదేశీ విద్య సాయం నిలిపివేయడం వంటి అనేక అంశాలు ఆ వర్గాన్ని ప్రభావితం చేశాయంటున్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌ ఆకర్షణ కూడా తోడైందంటున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు