logo

వచ్చింది పుస్తకాలే.. అదీ అరకొరే!

వేసవి సెలవుల అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఇతర సామగ్రిని అందజేస్తామంటూ ఏటా అధికారులు చెబుతూ ఉంటారు.

Published : 24 May 2024 03:41 IST

ఇతర వస్తువుల ఊసే లేదు
‘విద్యా కానుక’లు సకాలంలో అందేనా?

పాఠ్య పుస్తకాలు పరిశీలిస్తున్న సమగ్ర శిక్షా ఏపీసీ సోమశేఖర్‌

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: వేసవి సెలవుల అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఇతర సామగ్రిని అందజేస్తామంటూ ఏటా అధికారులు చెబుతూ ఉంటారు. కానీ, పాఠశాలలు తెరిచే నాటికి కాదు కదా రెండు నెలలు ఆలస్యంగానైనా అందజేయలేకపోతుంటారు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నూతన విద్యా సంవత్సరం (2024-25) జూన్‌ 12 నుంచి ప్రారంభం కానుంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ బడుల విద్యార్థులందరికీ ‘విద్యా కానుక’ పథకం ద్వారా 9 రకాల వస్తువులు పంపిణీ చేయాల్సి ఉంది. పాఠ్య, రాత పుస్తకాలు, ఒక జత బూట్లు, మూడు జతల ఏకరూప వస్త్రాలు, ఒక బెల్టు, ఒక స్కూలు బ్యాగు, రెండు జతల సాక్సులు, ఆక్స్‌ఫర్డ్, పిక్టోరియల్‌ నిఘంటువులు, ఒక వర్క్‌ పుస్తకం చొప్పున ప్రతి విద్యార్థికి అందజేయాలి. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు మాత్రమే జిల్లాకు సరఫరా అయ్యాయి. అవీ నామమాత్రంగానే.

ఎప్పుడు వస్తాయో తెలియదు

పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి ఇంకా 18 రోజులే ఉంది. పాఠ్య పుస్తకాలు అరకొరగా సరఫరా కాగా.. మిగతా వస్తువుల్లో ఒక్కటీ జిల్లాకు చేరనే లేదు. ఒకటి నుంచి 7వ తరగతి పాఠ్య పుస్తకాల్ని ఆయా మండల స్టాక్‌ పాయింట్లకు చేర్చి అక్కడి నుంచి పాఠశాలలకు తరలించాల్సి ఉంది. 8, 9, 10 తరగతుల పుస్తకాలను నేరుగా ప్రచురణకర్త నుంచి అందేలా చర్యలు చేపడుతున్నట్లు సమగ్ర శిక్షా అధికారులు చెబుతున్నారు. బూట్లు, ఏకరూప దుస్తులు, బెల్టులు, స్కూలు బ్యాగులు, రాత పుస్తకాలు,  6వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్, 1వ తరగతి వారికి పిక్టోరియల్‌ నిఘంటువులు అందజేయాల్సి ఉంటుంది. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు వర్క్‌ బుక్‌లు పంపిణీ చేయాలి.

నెలాఖరుకల్లా ..

విద్యా కానుకలు ఈ నెలాఖరుకల్లా జిల్లాకు వస్తాయని సమగ్ర శిక్షా సీఎంవో రవీంద్ర తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో రాత పుస్తకాలు వస్తాయని, మిగతా వస్తువులు తర్వాత చేరతాయన్నారు. ఎన్నికల నియమావళి తదితర కారణాలతో ఈ ఏడాది విద్యార్థులకు వస్తువులు పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితి తలెత్తిందన్నారు. పాఠశాలలు తెరిచే నాటికల్లా  అందజేసేందుకు చర్యలు చేపడతామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు