logo

అపూర్వ గ్రంథం.. సోదర బంధం

అనంతమైన ఈ సృష్టిలో రక్త సంబంధానికి మించిన బంధం మరొకటి లేదు. ‘అమ్మానాన్న-సోదర-సోదరీమణులు’ ఇదంతా ఓ కుటుంబం. అపార్థాలు.. అభిప్రాయాల భేదాలు.. తగాదాలు ఇవేమీ ఆ బంధాలను బీటలు వారనీయవు.

Published : 24 May 2024 03:54 IST

నేడు అంతర్జాతీయ సోదర దినోత్సవం

కలిదిండి, ఆగిరిపల్లి, ముదినేపల్లి, న్యూస్‌టుడే: అనంతమైన ఈ సృష్టిలో రక్త సంబంధానికి మించిన బంధం మరొకటి లేదు. ‘అమ్మానాన్న-సోదర-సోదరీమణులు’ ఇదంతా ఓ కుటుంబం. అపార్థాలు.. అభిప్రాయాల భేదాలు.. తగాదాలు ఇవేమీ ఆ బంధాలను బీటలు వారనీయవు. వీళ్లలో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా.. మిగిలిన వాళ్ల కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. అప్పటి వరకు ఎంత పంతం పట్టినా.. ఇంకెంత దూరాన ఉన్నా.. ఓదార్పు నిచ్చేందుకు ఇట్టే వాలిపోతారు. నేనున్నానంటూ కొండంత భరోసా ఇస్తారు. అమ్మా-నాన్న స్థానంలో ఒకరికొకరు నిలుస్తారు. బంధాలకు.. బాధ్యతలకు బందీలవుతారు. ఓ అక్క కోసం తమ్ముడు.. ఓ తమ్ముడి కోసం అన్నలు.. ఓ చెల్లెలు కోసం అన్న.. త్యాగాల గుడి కడతారు. అంతా తామై అనురాగాలకు దాసోహం అంటారు. వాళ్ల ఉన్నతికి పాటు పడతారు. శుక్రవారం అంతర్జాతీయ సోదర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గుండెల్లో స్ఫూర్తి నింపే సోదర బంధాలను ఓసారి గుర్తు చేసుకుందామా..

నా కోసం ఆసుపత్రి కట్టిచ్చాడు..

నన్ను, మా తమ్ముడు శ్రీనివాస్‌ను వైద్యులుగా చూడాలన్నది నాన్న కల. నేను ఎంబీబీఎస్‌ పూర్తి చేశా. న్యూరోసర్జన్‌ మొదటి ఏడాది చదువుతుండగా నాన్న గుండెపోటుతో మరణించారు. అప్పుడు తమ్ముడు ఎంబీబీఎస్‌ ఆఖరి ఏడాది చదువుతున్నాడు. ఎవరో ఒకరే చదువు కొనసాగించాల్సిన పరిస్థితి. తమ్ముడు ఎంబీబీఎస్‌తో చదువు ఆపేసి.. నన్ను కొనసాగించమని చెప్పాడు. చెరువులు, వ్యాపారాలు బాధ్యత తమ్ముడే తీసుకుని.. నా ఆశయాల కోసం శ్రమించాడు. సొంత ఆసుపత్రి ఏర్పాటు చేసుకోవాలన్న నా ఆశకు ఊపిరిపోశాడు. నాన్న పేరున ‘ఈవీఆర్‌ సూపర్‌ స్పెషాలిటీ’ ఆసుపత్రిని గుడివాడలో నిర్మించి నాకు కనుకగా ఇచ్చాడు. నా తమ్ముడు నాన్న లేని లోటు తీర్చాడు‘ అంటూ భావోద్వేగానికి గురవుతున్నారు ముదినేపల్లికి చెందిన వైద్యురాలు ఈడుపుగంటి రాజ్యలక్ష్మి.

మనోధైర్యం నింపాడు..

అమ్మ.. నాన్నలో సగం ‘అన్న’ అనే మాటకు మా అన్నయ్య తాండవకృష్ణ నిలువెత్తు నిదర్శనం. నా కంట ఓ చుక్క కన్నీరొస్తే.. వాడి గుండె చెరువుగా మారిపోతుంది. కష్టం రాకుండా చూడ్డానికి నా అన్న దేవుడు కాకపోవచ్చు కానీ.. ఎంతటి పెద్ద కష్టం వచ్చినా.. ఆ గండం నుంచి గట్టెక్కించేందుకు నాకు తోడుగా నిలుస్తాడు. ఓ ప్రమాదంలో నడవలేని స్థితిలో నేను మంచాన పడ్డా. అలాంటి క్లిష్ట సమయంలో నాన్నలా అండగా నిలిచాడు. అమ్మగా సపర్యలు చేశాడు. వైద్యులు ఇచ్చిన మందులు సమయానికి వేస్తూ.. వ్యాయామాలు చేయిస్తూ.. నా కాళ్లలో కదలిక తెచ్చాడు. నాలో మనోధైర్యాన్ని నింపి.. పసిపాప మాదిరిగా కొత్తగా అడుగులు నేర్పించారు. నా మునిపటి జీవితాన్ని నాకు బహుమతిగా అందించాడంటూ జ్ఞాపకాల జడిలో తడిచి ముద్దయ్యింది కలిదిండి మండలం కోరుకొల్లుకు చెందిన కె.సరస్వతి.

సోదరులే  తోడయ్యారు..

మేము ముగ్గురు అన్నదమ్ములం. మాకొక సోదరి. అమ్మానాన్న ఆకు కూరలు విక్రయిస్తూ మమ్మల్ని చదివించారు. నేను ఇంటర్‌ పూర్తి చేసే సమయానికి నాన్నకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం సహకరించని స్థితి ఏర్పడింది. అప్పటికే ఉద్యోగాల్లో స్థిరపడిన పెద్దన్నయ్య చిట్టిబాబు, చిన్నన్నయ్య రత్తయ్య నా బాధ్యతను భుజాన వేసుకున్నారు. బీఈడీ పూర్తి చేయించి, డీఎస్సీ కోచింగ్‌ ఇప్పించారు. 2008 డీఎస్సీ ద్వారా ఎస్జీటీ ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధించా. ప్రస్తుతం నేను ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నా. నాన్న మంచాన పడిన క్షణమే.. నా జీవితం అంధకారమైందని ఆందోళన చెందా. నా భవితను తీర్చిదిద్దిన నా సోదరులకు రుణపడి ఉంటానంటున్నారు ఆగిరిపల్లికి చెందిన అంకం వెంకటేశ్వరరావు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని