logo

అందని రాయితీ విత్తనం.. తప్పని భారం

బీపీటీ 5204, ఎంటీయూ 1061, 1318 వంటి రకాల వరి విత్తనాల ధర క్వింటాలుకు రూ.3250 నుంచి రూ.3800 వరకు నిర్ణయించారు. వరి విత్తనాల ధర ఎంత ఉన్నా కిలోకు రూ.5 చొప్పున బస్తాకు రూ.150 రాయితీ అందిస్తామని ప్రకటించారు.

Published : 24 May 2024 04:01 IST

ప్రైవేటు వ్యాపారులే దిక్కు

తణుకు మండలంలో నారుమళ్లు (పాతచిత్రం) 

బీపీటీ 5204, ఎంటీయూ 1061, 1318 వంటి రకాల వరి విత్తనాల ధర క్వింటాలుకు రూ.3250 నుంచి రూ.3800 వరకు నిర్ణయించారు. వరి విత్తనాల ధర ఎంత ఉన్నా కిలోకు రూ.5 చొప్పున బస్తాకు రూ.150 రాయితీ అందిస్తామని ప్రకటించారు. విత్తనాల ధర కిలోకు రూ.32 నుంచి రూ.38 వరకు ఉంది. ప్రైవేటు వ్యాపారులు ఆ ధర మరింత పెంచి విక్రయించే అవకాశం ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 

ఈనాడు డిజిటల్‌ భీమవరం, తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. సకాలంలో వర్షాలు కురిసి వాతావరణం అనుకూలంగా మారితే జూన్‌ రెండోవారంలో నారుమళ్లు పోసేందుకు అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం విత్తనాలు ఎంత మేరకు అందుబాటులో ఉంచుతుందోననే అనుమానంతో పాటు, రాయితీ విత్తనాలు పక్కదారి పడుతున్నాయని అన్నదాతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. చాలా వరకు వరి విత్తనాలకు ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తోందని, అవి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. 

‘‘గత ఖరీఫ్‌ సీజన్‌లో ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేశాం. కోత కోసే సమయానికి పైరు వంగిపోయింది. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. సమయానికి మొలకలు రాక ఇబ్బందులు పడ్డాం’’ అని భీమవరానికి చెందిన రైతులు వాపోయారు.

‘‘కొన్ని ప్రైవేటు దుకాణాల్లో విక్రయిస్తున్న విత్తనాల్లో నాణ్యత ఉండటం లేదు. అందరూ ఇదే వాడుతున్నారని, చాలా బాగుందని చెప్పి గతంలో కొనిపించారు. ఆశించిన స్థాయిలో మాత్రం దిగుబడి రాలేదు.’’ అని తణుకు మండలానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

కొనుగోలు చేయాల్సిందే.. జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు వరి విత్తనాలను సాధారణంగా బయట కొనుగోలు చేసినవే విక్రయిస్తారు. దీనిలో సర్టిఫైడ్, నాన్‌ సర్టిఫైడ్‌ విత్తనాలుంటాయి. సర్టిఫైడ్‌ విత్తనాలైతే రైతులకు క్వింటాకు అసలు ధర కన్నా రూ.200 అధికంగా పెంచి విక్రయిస్తారు. నాన్‌ సర్టిఫైడ్‌ అయితే మామూలు ధరకు  కొనుగోలు చేసినా మొలక శాతం తక్కువగా ఉంటుంది. పాత విత్తనమైతే పంట చేతికొచ్చే సమయంలో పైరు మొదలు కొంతమేర దృఢంగా ఉండి నేలవాలిపోకుండా ఉంటుందని, కొత్తదైతే కోత దశకు ముందు నేలవాలిపోయే గుణం అధికంగా ఉంటుందని రైతులు అంటున్నారు.

ఆంక్షల వలయంలో పంపిణీ

రాయితీపై వరి, వేరుసెనగ విత్తనాల పంపిణీకి ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తోంది. రైతులు ఆర్‌బీకేలకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఆధార్‌ కార్డులు తీసుకెళ్లి పేర్లు ముందుగానే నమోదు చేయించుకుని, ఎంత మేర విత్తనాలు కావాలో తెలియజేస్తూ వివరాలు అందజేయాలి. వారి డిమాండ్‌ బట్టి జిల్లా వ్యాప్తంగా లెక్కగట్టి అప్పుడు ఏపీ సీడ్స్‌కు ఇండెంట్‌ పెడతారు. వ్యవసాయ శాఖకు వరి విత్తనాలు వచ్చినా పెద్ద రైతులు, వ్యాపారుల చేతుల్లోకి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోతాయని అన్నదాతలు విమర్శిస్తున్నారు. నారుమడులు పోసేందుకు సమయం మించిపోతుండటంతో చిన్న, సన్నకారు రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనాలు అధిక ధరలకు కొనుగోలు చేసి పోస్తారు. వ్యవసాయ శాఖ ఎంటీయూ 1318, స్వర్ణ రకాలను మాత్రమే ఇస్తోందని రైతులు వాపోతున్నారు. మిగిలిన వరి వంగడాలు ప్రైవేటు వ్యాపారుల నుంచే కొనుగోలు చేయాల్సి వస్తోందని, వారు సిఫార్సు చేసినవి మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. మొలక రాకున్నా, దిగుబడి రాకున్నా ప్రశ్నించడానికి  అవకాశం లేదని అంటున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారిని వివరణ కోరగా  ప్రైవేటు దుకాణాలపై నిఘా పెడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు