logo

చోద్యం చూస్తామంతే!

పుణ్యక్షేత్రం బలివే రామలింగేశ్వరస్వామి ఆలయ భూములు ఆక్రమణ చెరలో మగ్గిపోతున్నాయి. అన్నదాన సత్రం నిర్వహణకు దాతలు ఇచ్చిన స్థలాలను ఆక్రమించుకున్నారు. రిజిస్ట్రేషన్లు చేయించుకుని రెవెన్యూ రికార్డులు మార్చి మరీ అనుభవిస్తున్నారు.

Updated : 24 May 2024 05:09 IST

రూ.10 కోట్ల ఆస్తి.. 24 ఏళ్లుగా ఆక్రమణలో..
కబ్జా చెరలో బలివే ఆలయ భూములు
పట్టించుకోని దేవాదాయశాఖ అధికారులు

ఆక్రమణ చెరలో ఉన్న దొండపాడు బలివే శివాలయ భూమి

పుణ్యక్షేత్రం బలివే రామలింగేశ్వరస్వామి ఆలయ భూములు ఆక్రమణ చెరలో మగ్గిపోతున్నాయి. అన్నదాన సత్రం నిర్వహణకు దాతలు ఇచ్చిన స్థలాలను ఆక్రమించుకున్నారు. రిజిస్ట్రేషన్లు చేయించుకుని రెవెన్యూ రికార్డులు మార్చి మరీ అనుభవిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు ఉన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా..రూ.కోట్ల విలువైన దేవుడి భూములు స్వాధీనం చేసుకోకుండా తూతూమంత్రంగా నోటీసులిచ్చి మమ అనిపిస్తున్నారు. 

ఈనాడు, ఏలూరు :ముసునూరు మండలం బలివే రామలింగేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా 1928లో కొల్లా గంగరాజు అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశారు. అదే ఏడాది దాని నిర్వహణ నిమిత్తం ప్రస్తుతం కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న చొదిమెళ్ల సమీప దొండపాడులోని 3.63 ఎకరాల భూమిని అన్నదాన సత్రం పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ భూమి ద్వారా వచ్చిన ఆదాయంతోనే అన్నదాన సత్రం నిర్వహణ జరిగేది. అనంతరం వచ్చిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం సత్రం భూములనూ దేవాదాయ భూముల్లో విలీనం చేశారు. 1979లో భూదాత చనిపోవటం..దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోకపోవటంతో ఈ భూములు 2000లో ఆక్రమణ చెరలోకి వెళ్లాయి. రెండు సార్లు అడ్డగోలు అమ్మకాలు చేయడమే కాక అధికారులకు ముడుపులిచ్చి రిజిస్ట్రేషన్లు  కూడా చేసు కున్నారు.

దస్త్రాలు పక్కాగా ఉన్నా..

దేవాలయానికి ఆదాయ వనరుగా ఉండాల్సిన భూమి గత 24 ఏళ్లుగా ఆక్రమణలోనే ఉంది. ఇన్నేళ్లుగా దీని నుంచి వచ్చే ఆదాయంలో పైసా కూడా ఆలయానికి వెళ్లడం లేదు. ఆక్రమణదారులు ఇందులో కొబ్బరి తోట, మొక్కజొన్న పంట వేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోకుండా వారికి ముడుపులిచ్చి మచ్చిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ భూమి కార్పొరేషన్‌ పరిధిలోకి రావటంతో బహిరంగ మార్కెట్‌లో విలువ రూ.10 కోట్ల పైమాటే. ఇంత విలువైన ఆస్తిని కాపాడటంలో అధికారులు చేతులెత్తేశారు. దాత తన భూమిని అన్నదాన సత్రానికి రాసిచ్చిన దస్త్రాలు పక్కాగా ఉన్నా.. దిద్దుబాటు చర్యలు తీసుకోవటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దాదాపు పాతికేళ్లుగా ఆ భూమిని స్వాధీనం చేసుకోకుండా చోద్యం చూస్తున్నారు.

అధికారులు  ఏం చేస్తున్నట్లో..

చొదివెళ్ల గ్రామస్థులు, ప్రజాసంఘాల నుంచి భూములను పరిరక్షించాలని ఫిర్యాదులు వస్తున్నా అవి బుట్టదాఖలవుతూనే వచ్చాయి. ఫిర్యాదులు పెరగటంతో కంటితుడుపు చర్యగా 2017లో ఆక్రమణదారులకు అప్పటి ఆలయ ఈవో నోటీసులు పంపించి మమ అనిపించారు. దీంతో ఈ అంశంపై చొదిమెళ్లకు చెందిన న్యాయవాది రావూరి మురళీకృష్ణ సారథ్యంలో గ్రామస్థులు దేవాదాయశాఖ అధికారులకు 2021లో ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా సర్వే నంబర్లను క్రయవిక్రయాలు జరగకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. ఇది జరిగి ఆరేళ్లు దాటినా పురోగతి శూన్యం. అవన్నీ ఆలయ భూములని నిర్ధారణ అయినా స్వాధీనం చేసుకోలేదు. 

దేవాదాయ భూములకు రిజిస్ట్రేషన్లా.. 

నిబంధనల ప్రకారం దేవాదాయ భూముల క్రయవిక్రయాలకు నిషిద్ధం. ఇక్కడ మాత్రం ఆక్రమణదారులు ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అప్పటి రెవెన్యూ తహసీల్దార్, ఏలూరు గ్రామీణ పరిధిలో పని చేసిన విశ్రాంత ఎస్సై అండతో అన్‌లైన్‌లో వన్‌బీ, అడంగల్‌ వీరి పేరు మీద మార్చేశారు. దీనికి అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని తెలిసింది. 

అబ్బే.. అదెంత పని

ఫిర్యాదు చేసిన గ్రామస్థులు అధికారులను ఆక్రమణల గురించి అడిగితే ‘అబ్బే అదెంత పని వారంలో తేల్చేస్తాం..అదే పనిలో ఉన్నాం’ అంటూ గత ఆరేళ్ల నుంచి అదే అరిగిపోయిన క్యాసెట్‌ వేస్తున్నారు. రంగంలోకి మాత్రం దిగటం లేదు. ఆక్రమణదారులు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ అనుచరులు కావటంతో అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.ఈ అంశంపై సహాయ కమిషనర్‌ సీహెచ్‌ రంగారావును వివరణ కోరగా ఆలయ భూముల ఆక్రమణ విషయం తన దృష్టిలో ఉందని..త్వరలో బాధ్యులకు నోటీసులకు ఇచ్చి తొలగిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని