logo

మురుగులో పురం.. కలవరం

పట్టణాలను మురుగు సమస్య వెంటాడుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, ఆక్రమణలు, ప్రణాళిక లేమి, అసంపూర్తి పనులే దీనికి ప్రధాన కారణాలు. వర్షం పడినప్పుడు దాదాపు అన్ని పట్టణాల్లో  ప్రధాన కూడళ్లలోని  రోడ్లపై మురుగు ప్రవహిస్తోంది.

Updated : 24 May 2024 05:05 IST

అస్తవ్యస్తంగా డ్రెయినేజీ వ్యవస్థ
ప్రణాళికా లోపాలతో కొత్త ఇబ్బందులు

పట్టణాలను మురుగు సమస్య వెంటాడుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, ఆక్రమణలు, ప్రణాళిక లేమి, అసంపూర్తి పనులే దీనికి ప్రధాన కారణాలు. వర్షం పడినప్పుడు దాదాపు అన్ని పట్టణాల్లో  ప్రధాన కూడళ్లలోని  రోడ్లపై మురుగు ప్రవహిస్తోంది. వీధుల్లో, ఖాళీ స్థలాల్లో మురుగు నిలిచిపోయి దోమల బెడద పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. 

భీమవరం పట్టణ పరిధిలో విస్సాకోడేరు వంతెన సమీపాన జాతీయ రహదారి పక్కన ఇలా మురుగు నిలిచింది. చినరంగనిపాలెం, కంకరదొడ్డి తదితర ప్రాంతాల్లో మురుగును ప్రధాన కాలువలోకి మళ్లించేలా డ్రెయిన్‌ నిర్మాణానికి గతంలో ప్రణాళిక తయారు చేసినా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఏటా వర్షాకాలంలో ఈ ప్రాంతాల్లో నివాసితులు ముంపు బెడద ఎదుర్కొంటున్నారు. చినరంగనిపాలెం, బ్యాంకుకాలనీ, మున్సిపల్‌ ఎంప్లాయీస్‌కాలనీ, వంశీకృష్ణానగర్, ప్రకాశ్‌నగర్, నర్సయ్యఅగ్రహారం, మారుతీనగర్‌ తదితర ప్రాంతాల్లో డ్రెయిన్లు నిర్మించాల్సి ఉంది ఉమ్మడి జిల్లాల్లోని పట్టణాల్లో అయిదేళ్ల కాలంలో దాదాపు రూ. 100 కోట్ల విలువైన 130కిపైగా డ్రెయిన్ల నిర్మాణాలు  అర్ధాంతరంగా నిలిచాయి. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో కొన్ని డ్రెయిన్ల నిర్మాణానికి అయిదారు సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ఆసక్తి చూప లేదు.

ఆకివీడు, భీమవరం పట్టణం, నరసాపురం, పాలకొల్లు పట్టణం, తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే 

ఆకివీడు శాంతినగర్‌ ప్రాంతంలో డ్రెయినేజీని ఇలా రహదారి కంటే ఎత్తులో నిర్మించారు. వర్షం కురిసినా, డ్రెయిన్‌ పొంగినా మురుగంతా రహదారిపై నిలిచిపోతోంది. స్టేషన్‌రోడ్డు, సమతానగర్, శాలిపేట, సంతమార్కెట్, జానకీనగర్‌ తదితర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే క్యాబిన్‌ వైపు వెళ్లే రహదారి వెంబడి డ్రెయిన్‌ పూడిపోయింది. సమతానగర్‌లో కచ్చా డ్రెయిన్లు కూడా లేవు.

నరసాపురం పట్టణంలో మురుగు వేములదీవి వద్ద పంట కాలువలోకి చేరుతోంది. ఈ పట్టణంలోని 31 వార్డుల్లో చాలాచోట్ల డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. మురుగును బయటకు తరలించే మార్గం లేక నేరుగా గోదావరిలోకి మళ్లిస్తున్నారు. 149 కిలోమీటర్ల మేర రూ.237 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ నిర్మిస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ  అమలుకు నోచుకోలేదు.

ఆక్రమణలతో అవస్థ

డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నచోట కూడా నిర్వహణ లోపాలతో ఇక్కట్లు తప్పడం లేదు. అన్ని పట్టణాల్లో డ్రెయిన్లపై 670కిపైగా ఆక్రమణలు ఉన్నట్లు కొన్నేళ్ల క్రితమే గుర్తించారు. వీటి తొలగింపు ప్రక్రియ పట్టాలెక్కకపోవడంతో పూడిక, వ్యర్థాల తొలగింపు పనులు మొక్కుబడి తంతుగా మారిపోతున్నాయి. 

పాలకొల్లు లక్ష్మీనగర్‌ ప్రాంతంలో డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగు నిలిచి మడుగులా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ సీసీ రోడ్డు నిర్మించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు డ్రెయినేజీ మాత్రం నిర్మించలేదు. ఈ పట్టణంలో 90 కిలోమీటర్ల మేర డ్రెయిన్లు ఉండగా మురుగు సకాలంలో బయటకు లాగే మార్గం లేక చిన్నపాటి వర్షానికి సైతం పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. 

తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలో డ్రెయిన్లు లేకపోవడంతో మురుగంతా రహదారుల పక్కన నిలిచిపోతోంది. డ్రెయిన్ల నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలేదు. ఒకటో పట్టణ పరిధిలో మురుగు నేరుగా ఏలూరు కాలువలో కలుస్తోంది. రామచంద్రరావుపేట, బోదె గట్టు, భాగ్యలక్ష్మిపేట ప్రాంతాల్లో చాలా వరకు కచ్చాడ్రెయిన్లే దిక్కు. 

అరకొర సొమ్ములిస్తే ఎలా?

ఉమ్మడి జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతో పాటు మిగిలిన పురపాలక సంఘాల్లో దాదాపు 1562.67 కిలోమీటర్ల పొడవున పక్కా డ్రెయిన్లున్నాయి. గత కొన్నేళ్లలో ప్రతి పట్టణ పరిధిలో ఉన్న కాలనీలు విస్తరించడంతో పాటు శివార్లలో కొత్తగా 3 నుంచి 5 వరకు ఆవాస ప్రాంతాలు ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని చోట్ల సీసీ లేదా బీటీ రహదారులు ఉండగా డ్రెయినేజీ నిర్మాణాలు మాత్రం చేపట్టలేదు. పలు ప్రాంతాల్లో డ్రెయిన్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసి టెండర్లు పిలిచినా వ్యయ అంచనాల్లో లోపాలతో గుత్తేదారులు ముందుకు రావడం లేదు. అలాగని పాత ప్రతిపాదనలు రద్దుచేసి కొత్త ధరలతో మళ్లీ టెండర్లు పిలుస్తారా అంటే.. అదీ లేదు. పట్టణాల్లో డ్రెయిన్ల నిర్మాణంతో పాటు పారిశుద్ధ నిర్వహణపై దృష్టిసారించేలా అధికారులకు సూచనలిస్తామని పురపాలక ఆర్డీ (రాజమహేంద్రవరం) ఎన్‌వీవీ సత్యనారాయణ చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు