logo

ఊరూరా జూదాల జాతర.. దీపం ఉండగానే చక్కబెట్టేస్తున్నారు

ఉన్నతాధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన వేళ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ జూదాలు జోరందుకున్నాయి. అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం ఈవీఎంల దగ్గర ఉన్నామని.. ఇంటింటా తనిఖీలు చేస్తున్నామని చేతులెత్తేస్తోంది.

Updated : 26 May 2024 10:23 IST

కొన్నిచోట్ల అధికారుల కనుసన్నల్లో..

భీమవరం పట్టణం, ఆకివీడు, నరసాపురం, న్యూస్‌టుడే: ఉన్నతాధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన వేళ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ జూదాలు జోరందుకున్నాయి. అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం ఈవీఎంల దగ్గర ఉన్నామని.. ఇంటింటా తనిఖీలు చేస్తున్నామని చేతులెత్తేస్తోంది. మరోపక్క కొన్ని ప్రాంతాల్లో అధికారుల కనుసన్నల్లోనే జూదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల సందడి మొదలైన నాటి నుంచి జూదాల జోరు మొదలవగా పోలింగ్‌ తర్వాత మరింత పెరిగింది. ఎన్నికల ఫలితాలొచ్చాక ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు.. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • తీర ప్రాంతంలో ఉన్న ఓ సర్కిల్‌ పరిధిలో జూదాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్న ఓ పోలీసు అధికారికి ఇక్కడి జూదరులతో సత్సంబంధాలున్నాయి. దీంతో జూద శిబిరాలకు అనధికార అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. 
  • గోదావరి నది వెంబడి ఉన్న మండలంలో సంక్రాంతి రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి జూదగాళ్లను తీసుకొచ్చి సకల  సదుపాయాల మధ్య జూదాలు ఆడించారు. మధ్యలో కొంత విరామం తరువాత  సాధారణ జూదాలు కొనసాగిస్తున్నారు. 
  • ఏలూరు జిల్లాకు సరిహద్దులో ఆక్వా సాగు ఎక్కువగా ఉన్న ఓ స్టేషన్‌ అధికారికి జూదాల నిర్వాహకులతో పాత పరిచయాలు ఎక్కువే. చెరువు గట్లపై విశ్రాంతి గదుల వద్ద కార్లు, ద్విచక్ర వాహనాలు బారులు తీరి ఉంటాయంటే జూదాలు ఏ స్థాయిలో జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు.
  • జాతీయ రహదారిని ఆనుకొని పారిశ్రామిక కేంద్రంగా వెలుగొందుతున్న ప్రాంతంలో గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కోడిపందేలు, జూదాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.  ఇతర జిల్లాల నుంచి పందెగాళ్లు కార్లలో వస్తున్నారు. వేసవి విడిదికి ప్రత్యేకంగా విశ్రాంత గదులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
  • పశ్చిమలో జిల్లా కేంద్రానికి సమీపాన ఓ స్టేషన్‌ పరిధిలో జూదాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ముడుపుల మత్తులో అధికారులెవరూ ఆ శిబిరాల దరిదాపుల్లోకి వెళ్లరు. మండలాల సరిహద్దు ప్రాంతాలు ఇటీవల జూదాలకు వేదికలయ్యాయి.

వేరే విధుల్లో ఉన్నారులే..

కొన్ని స్టేషన్ల పరిధిలో కొన్ని నెలలుగా జూదాలకు సంబంధించి కేసులు నమోదు అంతంత మాత్రంగా ఉంది. అధికారుల ప్రమేయమే దీనికి కారణం. మా వాళ్లంతా వేరే విధుల్లో ఉంటారు. మీరు ఆడుకునే ప్రాంతాలకు మనోడ్ని విధులకు పంపిస్తా.. ఉన్నతాధికారులు వస్తే సమాచారం ఇస్తాడు.. జాగ్రత్తగా ఆడుకోండి.. అంటూ నిర్వాహకులకు వాట్సప్‌ ద్వారా సమాచారం ఇస్తారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జూద శిబిరాల్లో రోజూ రూ.లక్షలు చేతులు మారుతుంటాయి. అంటే చూసీ చూడనట్లు వ్యవహరించే వారికి పెద్ద మొత్తంలో నజరానా అందిస్తారన్నమాట. 

మొక్కుబడి చర్యలతో సరి..

ఈ స్థాయిలో జూదాలు జరుగుతున్నప్పుడు అసలు కేసులే లేవంటే పైస్థాయి అధికారులకు అనుమానం వస్తుందనే భయంతో అప్పుడప్పుడూ తనిఖీలు చేసి ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని మమ అనిపిస్తారు. అలాంటప్పుడు కూడా నగదు ఎలా అందుకోవాలో తెలిసిన సిద్ధహస్తులున్నారు. జిల్లా కేంద్రానికి సమీపాన ఓ చోట జూదాల్లో పట్టుబడిన వారిలో పెద్దలను ముందే తప్పించేశారు. 15 నుంచి 20 మంది పట్టుబడితే అయిదారుగురి పేర్లు మాత్రమే ఫిర్యాదులో చేర్చారన్న ఆరోపణలున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని