logo

చుక్.. చుక్ రైలు.. చిక్కులు దాటేనా..!

కోనసీమ జిల్లా కోటిపల్లి - నరసాపురం రైల్వేలైను నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Updated : 27 Jan 2023 05:23 IST

కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్‌ పనులపై నీలినీడలు
చేతులెత్తేసిన రాష్ట్ర సర్కారు

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: కోనసీమ జిల్లా కోటిపల్లి - నరసాపురం రైల్వేలైను నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని తీరప్రాంత గ్రామాలను అనుసంధానం చేస్తూ కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ రైల్వేలైను ఏర్పాటు చేయాలని ప్రజలు సుమారు మూడు దశాబ్దాల నుంచి ప్రభుత్వాలను కోరుతున్నారు. రైల్వే లైను నిర్మాణ దశలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల విడుదలలో అలసత్వం వహించటంతో కేంద్రం కూడా మిన్నకుండి పోయింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రాజ్యసభలో ఇటీవల వెల్లడించారు. నిధుల సాధన కోసం ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు కూడా నోరు విప్పింది లేదు. దీంతో దీని నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.

రూ.2,120 కోట్ల అంచనాలతో...

ఈ ప్రాంత ప్రజల ఆశయాలకు అనుగుణంగా దివంగత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి ఈ ప్రాజెక్టు మంజూరుకు చొరవ చూపారు. కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ57 కి.మీ. మేర రైల్వే లైను ఏర్పాటు, గౌతమి, వైనతేయ, వశిష్ఠలపై మూడు వంతెనల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 2000-01లో ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది.అంచనా వ్యయంగా రూ.2,120 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 25, కేంద్ర ప్రభుత్వం 75 శాతం చొప్పున భరించాల్సి ఉంది. ఇప్పటివరకూ ప్రాజెక్టుకు రూ.1,091 కోట్లు వెచ్చించారు. దీనికి రాష్ట్ర వాటా రూ.354 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.2.69 కోట్లు మాత్రమే డిపాజిట్‌  చేయడంతో కేంద్రం నిర్మాణ పనులను నిలిపివేసింది. 369 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా 163 హెక్టార్లు మాత్రమే సేకరించారు. నరసాపురం నుంచి చించినాడ వరకూ భూసేకరణ పూర్తయ్యింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూసేకరణ పూర్తికాలేదని, దీనికి రూ.178.8 కోట్లు అమలాపురం రెవెన్యూ డివిజన్‌ ఖాతాలో మూలుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

చెల్లించేందుకు చర్యలు..

కోటిపల్లి- నరసాపురం రైల్వేలైను నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కొంతమేర చెల్లించాం. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మిగిలిన నిధులు చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

 ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్‌విప్‌


గోదావరి జిల్లాలకు కీలకం..

అసంపూర్తిగా  నిలిచిన రైల్వే వంతెన నిర్మాణ పనులు

తీర ప్రాంత ప్రజలు విశాఖ, పక్కనే ఉన్న కాకినాడకు రైలులో వెళ్లాలంటే భీమవరం వెళ్లి అక్కడ నుంచి నిడదవోలు మీదుగా చుట్టూతిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. నరసాపురం నుంచి వెళ్లే 11 రైళ్లలో రోజుకు సగటున 2,600 మంది వరకూ ప్రయాణిస్తుంటారు. వీరిలో అత్యధిక శాతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే వస్తుంటారు. పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల నడుమ నిత్యం మూడు వేల మందికిపైగా ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు వాహనాల్లో తిరిగే ప్రయాణికుల సంఖ్య దీనికి అదనంగా ఉంటుంది. ఈ రైల్వే లైన్‌ పూర్తయితే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల వాసులకు దూరాభారం తగ్గుతుంది. వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఉపయుక్తంగా ఉంటుంది. ‘కోటిపల్లి- నరసాపురం రైల్వేలైను ఏర్పాటు చేయాలనేది ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం. దానిని సాకారం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చి చర్యలు చేపట్టిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆశలపై నీళ్లు చల్లేలా వ్యవహరించడం దారుణం. ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి’ అని రైతు సంఘ నాయకుడు అందె ఫణీంద్రనాథ్‌ తెలిపారు.

కేంద్ర మంత్రి దృష్టికి

నరసాపురం- కోటిపల్లి రైల్వేలైను ఏర్పాటు ఆవశ్యకతను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లా. రాష్ట్ర వాటా చెల్లిస్తేనే ఈ పనులు ముందుకెళ్లేందుకు అవకాశం ఉందని, ఆ ప్రక్రియ పూర్తయితే జాప్యం లేకుండా పనులు పూర్తిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయాలి. 

 కనుమూరి రఘురామకృష్ణరాజు, లోక్‌సభ సభ్యుడు, నరసాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని