logo

జగనన్న కాలనీళ్లు

ఆకివీడు మండలం కుప్పనపూడి పరిధి తాళ్లకోడు ప్రాంతంలో 74 ఎకరాల జగనన్న లేఅవుట్‌ ఇది. తుపాను ప్రభావంతో మంగళవారం కురిసిన భారీ వర్షానికి కాలనీ మొత్తం జలమయమైంది. నివాసాల చుట్టూ ముంపు నీరు చేరింది.

Updated : 06 Dec 2023 06:21 IST

ఆకివీడు మండలం కుప్పనపూడి పరిధి తాళ్లకోడు ప్రాంతంలో 74 ఎకరాల జగనన్న లేఅవుట్‌ ఇది. తుపాను ప్రభావంతో మంగళవారం కురిసిన భారీ వర్షానికి కాలనీ మొత్తం జలమయమైంది. నివాసాల చుట్టూ ముంపు నీరు చేరింది. ఇక్కడ సుమారు 3,273 మందికి స్థలాలు కేటాయించగా సుమారు 1,300 మంది నిర్మాణాలు ప్రారంభించారు. 350 ఇళ్ల నిర్మాణం పూర్తవగా ప్రస్తుతం సుమారు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ లేఅవుట్‌ పల్లంగా ఉండటంతో కొద్దిపాటి వర్షం కురిసినా రోజుల తరబడి నీరు నిలిచి బురదమయంగా మారుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు.

ఆకివీడు, పాలకోడేరు, పెనుగొండ గ్రామీణ, తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో జగనన్న కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో శివారు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు చెరువుల్లా మారిపోయాయి. అంతర్గత మార్గాలు పూర్తిగా మునిగిపోవడంతో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న ఇళ్ల పునాదుల్లోకి నీరు చేరింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. పూర్తి స్థాయిలో మట్టిపూడిక పనులు చేయకపోవడం, అంతర్గత రహదారులు, డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు, వాన నీరు బయటకు వెళ్లని దుస్థితి నెలకొంది.

పాలకోడేరు మండలం మోగల్లులో జగనన్న కాలనీలో ఇళ్ల చుట్టూ సుమారు రెండు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. చుట్టుపక్కల పొలాల్లోని నీరు ఈ కాలనీలోకి చేరుతోంది. పాలకోడేరు, విస్సాకోడేరు గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో ముంపు అంచున ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని