logo

ఉన్నదంతా ఊడ్చేసేలా..

మిగ్‌జాం తుపాను ఉమ్మడి పశ్చిమ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటికే కోసిన వరి పనలు పొలాల్లో ఉండటంతో తడిసిపోయాయి. రైతులు ధాన్యం బస్తాలు చుట్టూ బరకాలు కట్టినా చుట్టూ నీరు చేరి నానిపోయాయి.

Updated : 06 Dec 2023 07:26 IST

అన్నదాత ఆశలపై నీళ్లు చల్లిన మిగ్‌జాం
నేలవాలిన చేలు.. కూలిన చెట్లు
చెరువులను తలపిస్తున్న రహదారులు
ఉమ్మడి పశ్చిమలో స్తంభించిన జనజీవనం
ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే బృందం

మిగ్‌జాం తుపాను ఉమ్మడి పశ్చిమ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటికే కోసిన వరి పనలు పొలాల్లో ఉండటంతో తడిసిపోయాయి. రైతులు ధాన్యం బస్తాలు చుట్టూ బరకాలు కట్టినా చుట్టూ నీరు చేరి నానిపోయాయి. ఈదురు గాలుల ప్రభావానికి వరిపైరు నేలవాలింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం నెమ్మదిగా మొదలైన తుపాను ప్రభావం..మంగళవారానికి తీవ్రస్థాయికి చేరుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉండటంతో జనజీవనం స్తంభించింది. రహదారులు జలమయమయ్యాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మ్మడి పశ్చిమలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 20 శాతం ధాన్యం కూడా ఇప్పటి వరకు తరలించలేదు. ధాన్యం మొత్తం కల్లాల్లో ఉండటంతో పోలవరం, దెందులూరు, తణుకు, ఉంగుటూరు, భీమడోలు టి.నరసాపురం, పెదపాడు, పాలకొల్లు తదితర మండలాల్లో రైతులు బరకాలతో కాపాడే ప్రయత్నం చేశారు. వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో బరకాల కిందికి నీరు చేరింది. ధాన్యం కాపాడుకునేందుకు చుట్టూ గాడులు చేసి నీరు మళ్లించేందుకు రైతులు ప్రయాస పడ్డారు. ధాన్యం తరలిస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం తరలింపు ప్రక్రియ జరగడం లేదని వాపోతున్నారు. ముదినేపల్లి, పాలకోడేరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, పోడూరు, ఆకివీడు, ఉండి, కలిదిండి తదితర మండలాల్లో ధాన్యం పనలు నీట మునిగాయి.  


మూడు రోజులు.. 21.56 సెంటీమీటర్లు

పాలకొల్లులో అత్యధిక వర్షపాతం

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి మంగళవారం రాత్రి 10 గంటల వరకు జిల్లాలో 215.6 మిల్లీమీటర్ల (21.56 సెంటీమీటర్లు) సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలకొల్లులో 404.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.


దారులన్నీ ఏరులయ్యాయి

ర్షం ప్రభావానికి ఉమ్మడి పశ్చిమలో రహదారులు ఏరులను తలపిస్తూ ప్రవహించాయి. మండవల్లి, ఉండిలో జాతీయ రహదారి 165పై రెండు అడుగుల మేర నీరు చేరింది. కైకలూరులో ప్రధాన రహదారులన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోకి భారీగా నీరు చేరింది. మొగల్తూరు,  ముదినేపల్లిలో జాతీయ రహదారి 216 మునిగిపోయింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే రహదారులు అధ్వానంగా ఉండటం, తాజాగా వర్షం పడటంతో గుంతలు కనిపించక వాహన చోదకులు నానా అవస్థలు పడ్డారు. పెదవేగి మండలం అంకన్నగూడెం, నారాయణపురం-గణపవరం రహదారిలో నారాయణపురం శివారులో భారీ వృక్షాలు రహదారికి అడ్డంగా కూలిపోయాయి. జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో వాగు పొంగిపొర్లింది. చింతలపూడి సీఎస్‌ఐ చర్చి, ఉండి ఉన్నత పాఠశాలల ప్రాంగణాలు నీట మునిగాయి.


జలదిగ్బంధంలో ఆసుపత్రులు

ర్షంతో ఏలూరు సర్వజన ఆసుపత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. కలిదిండి ప్రభుత్వాసుపత్రి చుట్టూ నీరు చేరింది. రోగులు వచ్చేందుకు కూడా వీలు లేకుండా పోయింది.


రైతులూ ధైర్యం కోల్పోవద్దు

అధికారుల  బృందం భరోసా

ఆచంట, న్యూస్‌టుడే: జిల్లాలో తుపాను  నష్టాలను ప్రభుత్వానికి నివేదించి అన్ని విధాలా ఆదుకుంటామని ప్రత్యేకాధికారి కె.కన్నబాబు, కలెక్టరు పి.ప్రశాంతి రైతులకు భరోసా ఇచ్చారు. మంగళవారం ఆచంట మండలం వేమవరంలో నేలవాలిన వరి చేలను అధికారుల బృందం పరిశీలించింది. ఇక్కడ గతంలో పని చేసిన కారణంగా నరసాపురం పరిసర ప్రాంతాలపై తనకు పూర్తి అవగాహన ఉందని ప్రత్యేకాధికారి కన్నబాబు తెలిపారు. రైతుల ఇబ్బందుల గురించి రైసు మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందించడానికి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టరు పి.ప్రశాంతి మాట్లాడుతూ అధికార బృందం క్షేత్ర స్థాయిలోనే పని చేస్తోందని, ఎప్పటికప్పుడు అంచనాలు సిద్దం చేస్తున్నామని అందుకు అనుగుణంగా సహాయక చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేమవరం సర్పంచి జె.చంటి మాట్లాడుతూ పుంత రోడ్లు అభివృద్ధి చేయాలని, తుపాన్ల సందర్భాల్లో రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌ రామ్‌సుందర్‌ రెడ్డి, ఆర్డీవో అచ్యుత అంబరీష్‌, జిల్లా వ్యవసాయాధికారి జడ్‌.వెంకటేశ్వరరావు, తహసీˆల్దార్‌ సుబ్రహ్మణ్యం, ఎంపీˆడీవో నరసింహ ప్రసాద్‌, ఇన్‌ఛార్జి ఏవో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


విరుచుకుపడిన సుడిగాలి  

వీరవాసరం, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో ఏర్పడిన సుడిగాలి (టోర్నడో)  వీరవాసరం మండలంలో మంగళవారం బీభత్సం సృష్టించింది. పాలకొల్లు మండలం తిల్లపూడి మీదుగా వీరవాసరం వైపు దూసుకొచ్చిన ఈ సుడిగాలి ప్రభావంతో గొంతేరు డ్రెయిను సమీపాన ఉన్న గోదాములు, పశువుల పాకలు, రెస్టారెంట్లు, చేపలు, రొయ్యల కొనుగోలు షెడ్లు ధ్వంసమయ్యాయి. అదే ప్రాంతంలో నాటుకోళ్ల ఫారం షెడ్డు కుప్పకూలింది. డ్రెయిను గట్టున నిలిపిన రెండు ట్రాక్టర్లు, ఓ లారీ బోల్తా పడ్డాయి. వీరవాసరం - పెనుమంట్ర రహదారిలో కొబ్బరి చెట్లు మెలితిరిగి సగానికి విరిగి పడ్డాయి. పలు గ్రామాల్లో ఇళ్లు, పశువుల పాకలపై రేకులు ఎగిరిపోయాయి. చెట్ల కొమ్మలు తీగలపై పడటంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.


నష్టం మిగిల్చిన తుపాను  

ఏలూరు గ్రామీణ, కలిదిండి, ముదినేపల్లి, న్యూస్‌టుడే: తుపాను రైతులకు నష్టాన్ని మిగిల్చింది. సోమవారం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి వరి, మినుము, పెసర, పత్తి, మొక్కజొన్న, పొగాకు పంటలు నీట మునిగి, నేలవాలి దెబ్బ తిన్నాయి.  ఏలూరు జిల్లాలో ఖరీఫ్‌లో 1,93,399 ఎకరాల్లో వరి సాగు చేయగా 90 వేల ఎకరాల్లో కోతలు కోశారు. ధాన్యం రాశులను కాపాడుకోవడానికి కర్షకులు అష్టకష్టాలు పడుతున్నారు.  దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల్లో 40 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సగానికిపైగా కోతలు కోశారు. చాలావరకు పనలపై ఉండగా.. వర్షానికి తడిచి దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి దెబ్బతిన్న పంట  నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నారు.


విద్యుత్తు సరఫరాకు అంతరాయం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:    తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం కలిగింది. ఉండి, పాలకోడేరు, భీమవరం, మొగల్తూరు, ఆకివీడు, కాళ్ల తదితర మండలాల్లో గ్రామాలకు మంగళవారం గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచింది. గాలులు వీచినప్పుడల్లా సరఫరా ఆగింది. రాత్రివేళ కూడా అంతరాయాలు కొనసాగడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. భీమవరం ఏడో వార్డు పరిధి గాంధీనగర్‌లో చెట్టు కొమ్మలు పడటంతో విద్యుత్తు తీగలు తెగిపోయాయి. భీమవరంలోని 125 కేవీఏ ఉపకేంద్రం ఆవరణలోకి నీరు చేరడంతో సరఫరా నిలిపేశారు. అగ్నిమాపక వాహనం ద్వారా నీటిని బయటకు మళ్లించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని