logo

ఎగరని కిసాన్‌ డ్రోన్లు!

‘పంటల సాగులో విత్తనాలు, ఎరువులు చల్లేందుకు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేందుకు కిసాన్‌ డ్రోన్లు తెస్తున్నాం. రైతులకు డబ్బు, సమయం ఆదా చేసేలా, కూలీల లభ్యత సమస్యకు పరిష్కారం చూపేలా దేశంలో తొలిసారి ఏపీలో వీటిని అందుబాటులోకి తెస్తున్నాం’ రైతులనుద్దేశించి సీఎం జగన్‌ చెప్పిన మాటలివి.

Updated : 24 Feb 2024 05:35 IST

ప్రకటనలు ఘనం..  ఆచరణలో నీరసం

‘పంటల సాగులో విత్తనాలు, ఎరువులు చల్లేందుకు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేందుకు కిసాన్‌ డ్రోన్లు తెస్తున్నాం. రైతులకు డబ్బు, సమయం ఆదా చేసేలా, కూలీల లభ్యత సమస్యకు పరిష్కారం చూపేలా దేశంలో తొలిసారి ఏపీలో వీటిని అందుబాటులోకి తెస్తున్నాం’ రైతులనుద్దేశించి సీఎం జగన్‌ చెప్పిన మాటలివి.

ఈనాడు డిజిటల్‌, భీమవరం, అర్బన్‌, ఉండి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 10 వేల ఆర్బీకేలకు దశల వారీగా రాయితీపై డ్రోన్లు ఇస్తాం. తద్వారా 20 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుంది. తొలి దశలో 600 డ్రోన్‌ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. అని అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి 2022-23 వ్యవసాయ బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క కిసాన్‌ డ్రోన్‌ కూడా పొలాలపై ఎగిరిన దాఖలాలు లేవు.

20 మండలాలు.. 28 బృందాలు.. మెకనైజ్డ్‌ అగ్రికల్చర్‌ పథకం కింద జిల్లాలోని 20 మండలాల్లో అయిదుగురు సభ్యుల చొప్పున 28 గ్రూపులు ఏర్పాటు చేశారు. ముందుగా మండలానికి మూడు డ్రోన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కానీ డ్రోన్‌ ఆపరేటర్లుగా శిక్షణ పొందేందుకు అర్హులైన వారు లేకపోవడంతో నిబంధనలు సడలించారు. మండలానికి కనీసం ఒక్కరినైనా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించి కొందరిని ఎంపిక చేసి గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇస్తున్నారు. మొత్తానికి ప్రస్తుత సీజËన్‌లోనూ ఈ పథకం అమలయ్యే పరిస్థితులు లేవు.

నిబంధనలు ఇవీ.. డ్రోన్‌ పైలెట్‌గా ఎంపికయ్యే అభ్యర్థులకు సాగు భూమి తప్పనిసరిగా ఉండాలి. వ్యవసాయ డిప్లొమా, ఇంజినీరింగ్‌ చేసిన వారు అర్హులు. ఆర్బీకేలకు పది కిలోమీటర్ల పరిధిలోపు వారై ఉండాలి. పాస్‌పోర్టు ఉండాలి. 15 రోజుల శిక్షణ అనంతరం మూడేళ్ల పాటు సేవలు అందిస్తామనే అంగీకారపత్రం అందజేయాలి. ఈలోపు గ్రూపు నుంచి బయటకు వెళ్లిపోతే రూ.75 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. అయిదుగురు రైతులను కమ్యూనిటీ హైరింగ్‌ గ్రూపు (సీహెచ్‌సీ)గా ఏర్పాటు చేసి డ్రోన్‌ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే రుణం అందిస్తుంది. రాయితీ పోగా మిగిలిన మొత్తాన్ని రైతులు 36 నెలల్లో చెల్లించాలి.

ఆదాయం వచ్చేనా.. వ్యవసాయ అవసరాలకు వినియోగించే డ్రోన్‌ ఖరీదు రూ.10 లక్షల వరకు ఉంది. ప్రభుత్వం రూ.4 లక్షలు రాయితీ ఇస్తుండగా రూ.లక్ష రైతులు చెల్లించాలి. మిగిలిన రూ.5 లక్షలు బ్యాంకు ద్వారా రుణం ఇస్తారు. అంటే బృందంలో ప్రతి ఒక్కరూ రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టాలి. జిల్లాలో 70 శాతం వరకు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. పదెకరాల కంటే ఎక్కువ పొలం ఉన్నవారు 20 శాతం మాత్రమే. తక్కువ భూమి ఉన్న రైతులు డ్రోన్ల వినియోగంపై ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో సాగయ్యే పంటలకు ఏడాదిలో మూడు నెలలే డ్రోన్లు వినియోగించే పరిస్థితి ఉంటుంది. మిగిలిన రోజుల్లో బ్యాంకు వాయిదాలు చెల్లించే ఆదాయం కూడా రాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై జిల్లా వ్యవసాయ శాఖాధికారులు స్పందిస్తూ డ్రోన్ల ఉపయోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన పైలెట్లలో కొందరు శిక్షణ తీసుకున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని