logo

నష్టపరిహారానికి నిరీక్షణ

జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది రైతులు పశు పోషణపై ఆధారపడుతున్నారు. 2017-18 వరకు పశువు చనిపోతే సంబంధిత పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే ప్రభుత్వం పరిహారం చెల్లించేది.

Published : 24 Feb 2024 03:39 IST

 పశు పోషకులకు ఇబ్బందులు 
వైఎస్‌ఆర్‌ బీమాపై నిరాసక్తత'

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది రైతులు పశు పోషణపై ఆధారపడుతున్నారు. 2017-18 వరకు పశువు చనిపోతే సంబంధిత పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే ప్రభుత్వం పరిహారం చెల్లించేది. అనంతరం 2019లో ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ పశు నష్టపరిహార పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో క్లెయిమ్‌లు అధికంగా రావడంతో ప్రభుత్వం పథకాన్ని నిలిపేసింది. దీని స్థానంలో రైతు భాగస్వామ్యంతో ప్రీమియం చెల్లించేలా వైఎస్‌ఆర్‌ పశు బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనిపై పశుపోషకులు పెదవి విరుస్తున్నారు. ప్రైవేటు డెయిరీలో గేదె విలువ ప్రకారం బీమా చేస్తుండగా.. ప్రభుత్వ పథకంలో పశువు విలువ రూ.30 వేలకే పరిమితం చేశారు. పాడి గేదెలు, ఆవులు తదితరాల విలువ కొన్నేళ్లుగా బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.30 వేలకే బీమా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలో ఆవులు, ఎద్దులు 1.36 లక్షలు, గేదెలు 5.12 లక్షలు, గొర్రెలు 5.26 లక్షలు, మేకలు 1.98 లక్షలు, కోళ్లు 1.3 కోట్లు ఉన్నట్టు పశుసంవర్ధక శాఖ అంచనా.

సకాలంలో అందితే చాలు.. ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకం ద్వారా రెండేళ్ల క్రితం చనిపోయిన వాటికీ పరిహారం అందని బాధితులు అనేక మంది ఉన్నారు. పశువు చనిపోతే చెల్లించే సొమ్ము తక్కువగా ఉన్నా.. అదీ సకాలంలో ఇవ్వడం లేదు. మేలు జాతి పశువులకు ఒక్కొక్క దానికి రూ.30 వేలు, నాటు పశువులకు రూ.15 వేలు, గొర్రెలు, మేకలకు రూ.6 వేల బీమా చేసే అవకాశం కల్పించారు. తెల్ల కార్డుదారులకు బీమా ప్రీమియంలో 20 శాతం (రూ.30 వేలకు ప్రభుత్వ వాటా రూ.1536, రైతు వాటా రూ.960) దారిద్య్ర రేఖకు ఎగువనున్న వారికి 50 శాతం (ప్రభుత్వ వాటా రూ.960, రైతు వాటా రూ.960) చెల్లించాల్సి ఉంటుంది. పశువు విలువ ఎంత ఉన్నా బీమా రూ.30 వేలకు మాత్రమే చేసే అవకాశముంది. ప్రీమియంపై 3 శాతం బ్యాంకు ఛార్జీల నిమిత్తం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

బకాయిలు ఎప్పుడిస్తారో?.. పశు నష్టపరిహారం పథకం రద్దయినా సదరు బకాయిలను ఇంకా కొంతమంది రైతులకు చెల్లించలేదు. ఎప్పుడిస్తారనే విషయమై స్పష్టత లేకపోవడంతో పశు పోషకుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో పథకానికి సంబంధించి 1,715 మంది రైతులకు రూ.4.73 కోట్ల వరకు రావాల్సి ఉంది. లబ్ధిదారులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నా నిరాశే మిగులుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ పశు బీమా చేసేందుకు పాడి రైతులు నిరాసక్తత చూపుతున్నారు.

ఈ విషయమై జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు నెహ్రూబాబుతో మాట్లాడగా సంబంధిత బిల్లులు ఆర్‌బీఐకి వెళ్లాయని, అక్కడి నుంచి అనుమతి రాగానే రైతుల వ్యక్తిగత ఖాతాలకు నగదు జమవుతుందన్నారు. బీమా పథకంలో 7,576 పశువులకు బీమా చేసి రూ.1.08 కోట్ల ప్రీమియం చెల్లించామన్నారు. రైతులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  •  పెదవేగి మండలం దుగ్గిరాలలో ఎస్‌.సుబ్బారావుకు చెందిన పాడి గేదె మృతి చెందింది. బీమా పరిహారానికి 2021 ఆగస్టులో ప్రతిపాదనలు పంపారు. నేటికీ పరిహారం అందలేదు.
  • ఏలూరు మండలంలో  కె.రాంబాబుకు చెందిన పాడి గేదె కొద్దినెలల కిందట చనిపోయింది. బీమా పరిహారానికి ప్రతిపాదనలు పంపి ఆరు నెలలవుతోంది. రావాల్సిన రూ.30 వేలు నేటికీ అందలేదు. ఇలా బీమా పరిహారం కోసం ఎంతోమంది రైతులు ఎదురుచూస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని