logo

ఆరోగ్య సురక్షకు.. బకాయిల భారం

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో మొదటి విడత మొత్తం 956 జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించారు.

Updated : 24 Feb 2024 05:34 IST

కొండంత ఖర్చుకు గోరంత మంజూరు 
గగ్గోలు పెడుతున్న నిర్వాహకులు

చేబ్రోలులో వైద్య శిబిరం

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో మొదటి విడత మొత్తం 956 జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రెండో విడతలో 411 శిబిరాలు ఏర్పాటు చేశారు. మొదటి విడత వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీ కార్యక్రమంలా ఆర్భాటం చేయడంతో ఖర్చు తడిసిమోపెడైంది. టెంట్లు, మైకు సెట్లు, కుర్చీలు, టేబుళ్లు, విద్యుత్తు సౌకర్యం, అల్పాహారం, టీలు, భోజనాలు, బ్లీచింగ్‌, ముగ్గు, క్లీనింగ్‌, సామగ్రి, రవాణా కూలీల ఖర్చులన్నీ కలిపి రూ.50 వేల వరకు ఖర్చయింది.

  • టి.నరసాపురం మండలంలోని 15 గ్రామాల్లో మొదటి విడత ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించారు. ఒక్కో గ్రామంలో శిబిరం నిర్వహణకు రూ.50 వేల వరకు ఖర్చవగా.. రూ.30 వేలు మాత్రమే జమ చేశారు. మిగిలిన బిల్లుల గురించి అడుగుతున్నా పట్టించుకోవడం లేదని కొందరు సర్పంచులు, కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు.
  • జంగారెడ్డిగూడెం పట్టణంలో మొదటి విడతలో అయిదు శిబిరాలు నిర్వహించారు. ఒక్కో దానికి రూ.60 వేల చొప్పున రూ.3 లక్షలు ఖర్చయింది. బిల్లులు పెట్టి నెలలు గడుస్తున్నా చెల్లించకపోవడంతో డబ్బు ఖర్చు చేసిన వారు లబోదిబోమంటున్నారు. రెండో విడత 8 శిబిరాలు ఏర్పాటుచేశారు. ఒక్కో శిబిరానికి రూ.40 వేల వరకు ఖర్చు చేయగా ఇప్పటివరకు నగదు ఊసే లేదు.
  • ఉండి మండలంలోని ఓ పంచాయతీలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండు విడతలుగా నిర్వహించారు. మొదటి విడత రూ.30 వేలు, రెండో విడత రూ.25 వేల చొప్పున రూ.55 వేలు ఖర్చు చేయగా ఇప్పటి వరకు జమ కాలేదు.
  • ఆచంట మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన శిబిరానికి రూ.25 వేలు ఖర్చు కాగా రూ.10 వేలే ఇస్తామని అధికారులు చెబుతున్నారని నిర్వాహకుడు వాపోయారు. ఆ రూ.10 వేలు కూడా ఇప్పటి వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈనాడు, ఏలూరు: వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారింది. తొలి విడత వైకాపా నాయకులు ఆర్భాటం చేసి నిర్వహణ భారాన్ని సర్పంచులు, గ్రామ కార్యదర్శులపై మోపారు. బిల్లులు పెట్టి నెలలు గడుస్తున్నా చాలామందికి ఎదురుచూపులు తప్పడం లేదు. జమ చేసినా కొండంత ఖర్చుకు.. గోరంత ఇవ్వడంతో నిర్వాహకుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది. బిల్లుల గురించి అధికారులను అడుగుతున్నా పట్టించుకోవడం లేదని వారంటున్నారు.

మొదటి విడతకే దిక్కు లేదు

ప్రభుత్వం మొత్తం ఖర్చులు జమ చేస్తుందని నిర్వాహకులు భావించారు. ఇదంతా జరిగి మూడు, నాలుగు నెలలు గడుస్తున్నా చాలా గ్రామాల్లో మొదటి విడత బిల్లులే మంజూరు కాలేదు. ఆ విడతలో నిర్వాహకులు సగటున రూ.3.8 కోట్ల వరకు ఖర్చు చేయగా ఇప్పటి వరకు 30 శాతం బిల్లులు కూడా మంజూరుకాలేదు. ఇచ్చిన వారికి సైతం అయిన ఖర్చుకు.. జమ చేస్తున్న మొత్తానికి పొంతన లేదు.

చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని అయిదు సచివాలయాల్లో ఆరోగ్య సురక్ష శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి రూ.40 వేల వరకు ఖర్చు కాగా.. రూ.20 వేలు ఇచ్చారు. మిగిలిన మొత్తం గురించి అడుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు.
ఉంగుటూరు మండలంలోని ఓ మేజర్‌ పంచాయతీలో మొదటి విడత శిబిరానికి రూ.50 వేలు ఖర్చు చేశారు. ఖాతాలో రూ.30 వేలు మాత్రమే జమచేశారు. రెండో విడతలో రూ.30 వేలు ఖర్చవగా ఇప్పటివరకు పైసా కూడా జమ కాలేదు. అప్పులు తెచ్చి ఖర్చు పెట్టిన చాలామంది సర్పంచులు, కార్యదర్శులు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ అంశమై నోడల్‌ అధికారి పూర్ణచంద్రరావును వివరణ కోరగా బిల్లులు సంబంధిత విభాగాలు పంపించామని, త్వరలో జమవుతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని