logo

వైకాపాలో అసమ్మతి సెగ

ఉమ్మడి పశ్చిమ వైకాపాలో అసమ్మతి సెగలు కక్కుతోంది. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులతో ఉన్న విభేదాలు కొన్ని చోట్ల తారస్థాయికి చేరుకున్నాయి.

Updated : 03 Apr 2024 05:20 IST

అభ్యర్థులకు అందని సహకారం
ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకులతో విభేదాలు
అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న కీలక నేతలు

ఈనాడు, ఏలూరు: ఉమ్మడి పశ్చిమ వైకాపాలో అసమ్మతి సెగలు కక్కుతోంది. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులతో ఉన్న విభేదాలు కొన్ని చోట్ల తారస్థాయికి చేరుకున్నాయి. రానున్న ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించేదే లేదంటూ కొందరు పార్టీకి  రాజీనామా చేసేస్తున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది.నిన్న మొన్నటి దాకా ఎవరైతే తమ బలం అని భావించారో వారి నుంచే వ్యతిరేక స్వరాలు వినిపించటంతో వైకాపా అభ్యర్థులు కొందరు దిక్కుతోచని స్థితిలో మిగిలారు.


చల్లారని చింతలపూడి

చింతలపూడిలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వర్గ పోరు ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ పోటీలో లేకున్నా.. అంతర్యుద్ధం సద్దుమణగ లేదు. అభ్యర్థి విజయరాజు తీరు తమకు నచ్చటం లేదని కొందరు వైకాపా నాయకులు ఇటీవల ఎంపీ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఎలీజాకు అనుకూలంగా ఉన్న కొందరికి విజయరాజు ప్రాధాన్యం ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి, ఉప ఎంపీపీ, కొందరు ఎంపీటీసీ సభ్యులతో పాటు చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. మేడవరపు అశోక్‌ కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన వర్గం మొత్తం విజయరాజుపై గుర్రుగా ఉంది.


ఏలూరులో అసహనం

ఏలూరు వైకాపాలో భారీగా లుకలుకలున్నాయి. ఇప్పటికే ముగ్గురు వైకాపా కార్పొరేటర్లు పార్టీ విధానాలకు  విసిగిపోయి తెదేపాలో చేరారు. ఆళ్ల నాని తమను ఎదగనివ్వటం లేదని నియోజకవర్గానికి ఆయువు పట్టులాంటి ఆరుగురు ప్రథమ శ్రేణి నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. మరో వారంలో కొందరు తెదేపా తీర్థం పుచ్చుకుంటున్నారని సమాచారం. ఇందులో ఓ కీలక నేతకు ఇచ్చిన నామినేటెడ్‌ పదవిని కనీస సమాచారం లేకుండా తీయించారని గుర్రుగా ఉన్నారు. దీంతో ప్రధాన నేతల నుంచి సహాయ నిరాకరణ తప్పదని తెలుస్తోంది.


పాలకొల్లులో ప్రథమ శ్రేణి దూరం

వైకాపా అభ్యర్థి శ్రీహరిగోపాలరావుకు ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకుల సహాయం అందటం లేదు. స్థానికులైన ఇద్దరు ముగ్గురు ప్రథమ శ్రేణి నాయకులకు గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. వారికి నియోజకవర్గంలో బలమైన వర్గం, ఓటు బ్యాంకు కూడా ఉంది. వారికి కాకుండా స్థానికేతరుడికి సీటు ఇవ్వటంపై మండి పడుతున్నారు. వైకాపా అభ్యర్థి రెండు వారాల నుంచి ప్రచారం చేస్తున్నా ప్రధాన నాయకులు కాన రావటం లేదు. ఆయనకు మేం సహకరించేది లేదంటూ సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు తెలుస్తోంది. అనేక నామినేటెడ్‌ పదవులు దక్కించుకున్న ఓ నాయకుడు సైతం ప్రచారంలో కానరావటం లేదు.


నూజివీడులో నిరుత్సాహం

నియోజకవర్గ నాయకుల్లో సైతం ఎమ్మెల్యే అభ్యర్థిపై ప్రథమ శ్రేణి నాయకుల్లో అసంతృప్తి ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవులు ఇస్తామని అయిదేళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదని చాలా మంది నాయకులు ఉడికిపోతున్నారు. చాట్రాయి మండలంలోని ఓ కీలక నేత కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన పదవిని వేరొకరికి కేటాయించటంతో ఆయన అంటీముట్టనట్టు ఉంటున్నారు.  సర్పంచుల నుంచి ఎంపీటీసీ సభ్యులు, పట్టణంలో కౌన్సిలర్లు ఇలా అన్ని వర్గాల్లో అసమ్మతి ఉంది.


తణుకులోనూ తడబాటే

ఇప్పటికే మట్టా వెంకట్‌ లాంటి కొందరు నాయకులు అసంతృప్తితో తెదేపాలోకి చేరారు. మరికొందరు వైకాపాలో ఉన్నా మంత్రితో అంటీముట్టనట్టు ఉంటున్నారు. అధికారం, మంత్రి పదవి వచ్చాక మమ్మల్ని పట్టించుకోలేదన్న అసంతృప్తితో ముగ్గురు నాయకులు ఎడముఖం..పెడముఖంగానే ఉన్నారు. వీరి ముగ్గురికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గెలుపోటములు ప్రభావితం చేయగల నాయకులు కావటంతో వీరిని బుజ్జగించేందుకు వైకాపా నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు