logo

చంద్రన్న వడ్డిస్తే.. జగనన్న లాగేశాడు..

తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.5కే అన్న క్యాంటీన్‌ ద్వారా పేదలకు ఆహారం అందించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 క్యాంటీన్లు కిటకిటలాడేవి. నిత్యం 15,500 మంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునేవారు.

Published : 12 Apr 2024 07:58 IST

నాడు పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్లు
తొలగించి పగ సాధించిన  వైకాపా సర్కారు

తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.5కే అన్న క్యాంటీన్‌ ద్వారా పేదలకు ఆహారం అందించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 క్యాంటీన్లు కిటకిటలాడేవి. నిత్యం 15,500 మంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునేవారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే కూలీలు, ఆసుపత్రులు, ఇతరత్రా అవసరాల నిమిత్తం పట్టణాలకు వచ్చేవారికి రూ.5కే నాణ్యమైన ఆహారం దొరికేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని ఎత్తేసింది. ఇప్పుడు రూ.100- రూ.120 పెడితేగానీ ఆకలి తీరని పరిస్థితి నెలకొంది.


అన్న క్యాంటీన్లు మూసేసి పేదల నోటి కాడ కూడు లాగేసిన వైకాపా ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులో ‘ఆహా’ పేరిట స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఆహార శాలలను ఆర్భాటంగా ప్రారంభించింది. వీటి వైభవం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. క్రమంగా ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. వీటికి సంబంధించిన టెంట్లు తుపాను గాలికి ఎగిరిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. వీటివల్ల పేదల ఆకలి తీరకపోయినా పెద్దోళ్లకు మాత్రం దండిగా సొమ్ములు ముట్టాయనే విమర్శలున్నాయి.


భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: దాతృత్వానికి పురిటిగడ్డ గోదావరి డెల్టా. నోరు తెరిచి అడగకపోయినా ఆప్యాయ ంగా వడ్డించి ఆకలి తీర్చే మనసున్న మనుషులు గోదారి వాసులు. అందుకే గోదావరి జిల్లాలకు దేశ విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు. ఇలాంటి సంస్కృతిని ప్రతిబింబించేలా కేవలం రూ.5కే పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కూలీలు, నిరుపేదలు, సామాన్య, మధ్యతరగతి ప్రజలు వీటిని ఉపయోగించుకొనేవారు.


అయిదేళ్ల కిందట భీమవరంలో వేలాది మందికి ఆహారం అందించిన అన్న క్యాంటీన్‌ భవనం ఇది. నిర్వహణ లేక ఇలా పాడుబడినట్లు దర్శనమిస్తోంది. వైకాపా పాలకులు ఈ భవనాల్లో చాలా వరకు వార్డు సచివాలయాలకు కేటాయించారు. కనీస మరమ్మతులు చేయించలేని దుస్థితి నెలకొంది.


ఆహా.. అంటూ రోజుల వ్యవధిలోనే..

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగ మేఘాలపై అన్న క్యాంటీన్లను మూసేశారు. వీటి కోసం నిర్మించిన భవనాల రంగులు మార్చేసి సచివాలయాలు, ఇతరత్రా అవసరాలకు కేటాయించారు. అప్పటి నుంచి వాటికి కనీస మరమ్మతులు లేవు. మరోపక్క అద్భుతమైన ఆహారం అందిస్తామంటూ తెరిచిన ఆహా క్యాంటీన్లను రోజుల వ్యవధిలోనే మూసేశారు.


రూ.5కే రుచిగా.. శుచిగా

అన్న క్యాంటీన్ల ద్వారా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించారు. అప్పట్లో మూడుపూటలకు కలిపి మొత్తం రూ.73 వ్యయం కాగా పేదలపై భారం పడకుండా రూ.15 మాత్రమే వసూలు చేశారు. మిగిలిన రూ.58 రాయితీగా ప్రభుత్వం సమకూర్చింది. బీ మధ్యాహ్నం, రాత్రి భోజనంలో 400 గ్రాముల అన్నంతో పాటు పప్పు, సాంబారు, కూర, పెరుగు, చట్నీ అందించారు. ఉదయం అల్పాహారంలోనూ మెనూ ప్రకారం రకరకాలు రుచులు వడ్డించారు.


జిల్లాలో మొత్తం క్యాంటీన్లు  22
నిత్యం అల్పాహారం, భోజనం తినేవారు 15,500
సద్వినియోగం చేసుకున్నవారు 1,30,20,000
వెచ్చించిన వ్యయం సుమారుగా రూ.65.10 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు