logo

మండిపల్లి రిజర్వాయర్‌ గేట్ల నుంచి లీకేజీ

హంద్రీ-నీవా నీరు తీసుకొచ్చి రిజర్వాయరు నింపాల్సిన పాలకులు గత అయిదేళ్లలో ఆ పని చేయలేదు. అరకొరగా కురిసిన వర్షాలకు రిజర్వాయరుకు వచ్చి చేరిన నీటి నిల్వలను వైకాపా నేతలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే లక్ష్యంతో గేట్ల నుంచి వదిలేయించారు.

Published : 12 Apr 2024 03:04 IST

వైకాపా నేతల ఒత్తిళ్లతో నీటిని వదిలేసిన వైనం
గేట్లు దించే సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం

రాయచోటి, చిన్నమండెం, న్యూస్‌టుడే: హంద్రీ-నీవా నీరు తీసుకొచ్చి రిజర్వాయరు నింపాల్సిన పాలకులు గత అయిదేళ్లలో ఆ పని చేయలేదు. అరకొరగా కురిసిన వర్షాలకు రిజర్వాయరుకు వచ్చి చేరిన నీటి నిల్వలను వైకాపా నేతలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే లక్ష్యంతో గేట్ల నుంచి వదిలేయించారు. నేతల సిఫార్సు మేరకు వంత పాడిన అధికారులు ఆఘమేఘాల మీద రిజర్వాయర్‌ తూము గేటు ఎత్తి ఉన్న నీటిని కాలువకు వదిలేశారు. అసలే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో మండిపల్లి నాగిరెడ్డి జలాశయం అధికారుల తీరుతో ఒట్టికుండను తలపిస్తోంది. రిజర్వాయరు కింద ఉన్న కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయలేదు. లైనింగ్‌ పనులు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. ప్రధాన రహదారులను దాటే ప్రాంతాలలో వంతెనల నిర్మాణం చేపట్టలేదు. మరికొన్ని చోట్ల రైతులు కాలువను చదును చేసి ఆక్రమించేశారు. ఇలాంటి పరిస్థితిలో కాలువకు నీరు వదిలినా పంట పొలాలకు చేరే పరిస్థితి లేదు. ఏమి జరిగిందో ఏమో కానీ వారం రోజుల కిందట నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయరు వద్దకు చేరుకుని గేటుకు దూరంగా ఉన్న నీటిని కాలువ తీసి గేటు వరకు తీసుకొచ్చి గేటు ఎత్తివేశారు. రిజర్వాయరులో ఉన్న నీరు పూర్తిగా వెళ్లిపోతుండడంతో స్థానికుల నుంచి అభ్యంతరాలు రావడంతో గేటు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ గేటు దిగే సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పూర్తి స్థాయిలో అమర్చలేదు. దాంతో రేయి పగలు నిరంతరాయంగా గేటు ద్వారా లీకై నీరు వృథాగా పోతోంది. అటు కాలువలు ద్వారా సాగుకు అందే పరిస్థితి లేకపోగా మరో వైపు రిజర్వాయరులోని నీటిని తోడేయడంతో పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీటికి కష్టాలు ఎదురవుతున్నాయి. పెద్దకాలువతో పాటు పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేయలేకపోగా ఎన్నికల సమయంలో నీటిని విడుదల చేశామని చెప్పుకొనేందుకే ఇలా రిజర్వాయరు నీటిని వృథా చేశారని ఆయకట్టుదారులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

పండ్ల తోటలు కాపాడేందుకే..

రిజర్వాయరు పరిధిలో మామిడి, ఇతర పండ్ల తోటలు ఎండిపోతున్నాయని వాటిని కాపాడేందుకే తూము గేటుకు మోటార్లు వేసి నీటిని విడుదల చేశామని డీఈ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తూము గేటు దించే సమయంలో మొరాయించడంతో సమస్య ఏర్పడిందన్నారు. త్వరలోనే నీటి లీకేజీని అరికడతామని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని