logo

జగన్‌ పాలనలో ఇసుక... జనం జీవితాల్లో మసక!

వినియోగదారులకు ఉచితంగా లభిస్తున్న ఇసుకను జగన్‌ ప్రభుత్వం బంగారంగా మార్చేసింది. కనీసం గ్రామపరిసరాల్లో ఉచితంగా తీసుకెళ్లే విధానాన్ని సైతం తమ గుప్పిట్లోకి వ్యూహాత్మకంగా తెచ్చుకుంది.

Updated : 12 Apr 2024 05:17 IST

అయిదేళ్లుగా ఇష్టారాజ్యంగా దోపిడీ
పేద, మధ్యతరగతి వర్గాలపై భారం
ఎన్నికల కోడ్‌ వచ్చినా ఆగని రవాణా
ఈనాడు, కడప, న్యూస్‌టుడే బృందం

వినియోగదారులకు ఉచితంగా లభిస్తున్న ఇసుకను జగన్‌ ప్రభుత్వం బంగారంగా మార్చేసింది. కనీసం గ్రామపరిసరాల్లో ఉచితంగా తీసుకెళ్లే విధానాన్ని సైతం తమ గుప్పిట్లోకి వ్యూహాత్మకంగా తెచ్చుకుంది. క్రమంగా వైకాపా మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఊరూపేరూ తెలియకుండా ఏదో కంపెనీ పేరుతో ఇసుక రేవులను స్వాధీనం చేసుకోవడం, తవ్వకాలు, రవాణా, విక్రయాలు గొలుసు రూపంలో దందా సాగుతోంది. ఎవరైనా నిలదీస్తే పోలీసులు రంగప్రవేశం చేసి బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలా గత ఐదేళ్లుగా వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో విస్తారంగా ఉన్న సహజ సంపదను దోచేసుకుంటున్నారు. రెండు జిల్లాల్లో రూ.2 వేల కోట్లకుపైగా ఇసుక దందా సాగిందనేది అంచనా. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. వైకాపా నేతల దందాపై జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. జగన్‌ పాలనలో కనుసైగలతో సాగుతున్న ఇసుక దందా, వైకాపా నేతల దోపిడీ పర్వంపై ప్రత్యేక కథనం.  


రహదారులు ఛిద్రం

ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల రాకపోకలతో వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో సుమారు 1,400 కిలోమీటర్ల పొడవునా రహదారులు ధ్వంసమయ్యాయి. పెన్నా తీరంలోని సిద్దవటం మండలం జంగాలపల్లె, ఎస్‌.రాజంపేట, కమ్మపాలెం, వంతాటిపల్లె తదితర గ్రామాల్లో ప్రధాన రహదారులు గోతులమయంగా మారాయి. రెండు జిల్లాల్లోని పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.


చెయ్యేరు కొల్లగొట్టి... కోట్లు మూటగట్టి

రాజంపేట నియోజకవర్గంలోని వైకాపా నేతలు ఇసుక దందా సాగించారు. ఇతర రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు దండుకున్నారు. ఇద్దరు వైకాపా కీలక నేతలు కొండలను సైతం తవ్వేసి చెయ్యేరు నదిలో రోడ్లు వేసి మరీ దోచుకున్నారు. చిత్తూరు జిల్లాలోని ఓ కీలక మంత్రి అండదండలతో ఇసుక దందా కొనసాగుతోంది.


పోలీసులపైనా దాడులు

ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఠాణా మహిళా ఎస్‌.ఐ.హైమావతిపై గతేడాది డిసెంబరు 8న అర్థరాత్రి ఇసుకాసురులు దాడికి తెగబడ్డారు. పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తలిస్తున్నారని సమాచారంతో ఆమె అడ్డుకునేందుకు వెళ్లగా ఆమెపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమె గాయపడడంతోపాటు ఆమె చరవాణి ధ్వంసమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొన్నిరోజులపాటు  హడావుడి చేసి అనంతరం పట్టించుకోలేదు.


నదులే లక్ష్యంగా ధ్వంసరచన!

పెన్నానది తీరంలో వైయస్‌ఆర్‌ జిల్లా సిద్దవటం మండలం ఎస్‌.రాజంపేట, జంగాలపల్లె, టక్కోలి, మూలపల్లె, పాపఘ్ని పరివాహక ప్రాంతం పెండ్డిమర్రి మండలం నందిమండలం, కొత్తగంగిరెడ్డిపల్లె, వీరపునాయునిపల్లె మండలం సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద, వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె, జమ్మలమడుగు మండలం అంబవరం, చాపాడు మండలం వెదురూరు, ప్రొద్దుటూరు సమీపంలోని ఆర్‌టీపీˆపీ రహదారి, రామాపురం, రామేశ్వరం రెండు కుళాయిలు, నంగనూరుపల్లె, కల్లూరు, ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు రేవు, అన్నమయ్య జిల్లా మాండవ్య, చెయ్యేరు నదీ తీరాల్లోని మందరం, పెన్నా, పాపఘ్ని నదుల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పీటీఎంలో సంపతికోటవాగు రేవుల్లో భారీగా ఇసుక దందా సాగుతోంది. కొండాపురం మండలం ఏటూరు గ్రామ సమీపంలోని చిత్రావతి నదిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. యంత్రాలతో ఇసుకను తవ్వడంతో నదిలో చాలా చోట్ల పెద్దపెద్ద గుంతలేర్పడ్డాయి. తవ్వకాలకు అనుమతులు ఉన్నట్లు గుత్తేదారులు చెబుతున్నా నదిలో ఏ ప్రాంతంలో ఎక్కడ వరకు అనుమతిచ్చారో గుర్తులు ఏర్పాటు చేయలేదు.


ఎన్నో అరిష్టాలు..!

పర్యావరణ అనుమతులు లేకుండా.. నిబంధనలు ఉల్లంఘించి యంత్రాలతో 20 నుంచి 30 అడుగుల లోతున తవ్వేశారు. వైకాపా నియోజకవర్గ కీలక నేతల కనుసన్నల్లో ఇసుకను బెంగళూరు, హైదరాబాదు తదితక నగరాలకు తరలిస్తున్నారు. రాయచోటి సమీపంలోని వండాడి, గొర్లముదివీడు, వీరబల్లి మండలం మట్లి, పెద్దివీడు, బొంగావాండ్లపల్లి, గండి సమీప ప్రాంతాల్లో మాండవ్య నదిలో బండరాళ్లు బయటపడ్డాయి. కడప సమీపంలోని చెన్నూరు వద్ద పెన్నా నదిలో భారీగా తవ్వడంతో బండరాళ్లను తలపించేలా నదీ గర్భం దర్శనమిస్తోంది. పింఛ బాహుదా నదుల్లోనూ ఇదే పరిస్థితి. చక్రాయపేట సమీపంలోని పాపఘ్ని నదిలో ఇసుకను తోడేందుకు ఏకంగా రహదారులనే నిర్మించారు.


బలైపోయిన జీవితాలెన్నో...

ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు ఢీకొని గత నాలుగేళ్లలో 12 మంది మృతి చెందగా, 23 మంది క్షతగాత్రులయ్యారు. నదుల్లో ఇసుక తవ్వకాలతో పడిన గోతుల్లో పడి 16 మంది మృత్యువాత పడ్డారు.మదనపల్లె మండలం చీకలబైలు సమీపంలో ఇసుకాసురుల చర్యలతో పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ ఆరంట్లపల్లెకు చెందిన రెడ్డెప్ప (53) బలయ్యారు. కుటుంబపెద్ద మృతితో భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు.

  • రాజుపాళెం మండలం కూలూరు కుందూనది వంతెన సమీపంలో ఈ నెల 4న ఇసుక ట్రాక్టరు ఢీకొనడంతో నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం నాగళ్లుపాడుకు చెందిన కూలీ పెద్దఓబులేసు (38) మృతి చెందారు.
  • వల్లూరు మండలం కొత్తగాలివారిపల్లెకు చెందిన వర్షిక(4) తన ఇంటి ముందున్న రోడ్డును దాటుతుండగా ఇసుక టిప్పరు ఢీకొనడంతో ప్రాణాలు విడిచింది.
  • సిద్దవటం మండలం జంగాలపల్లె సమీపంలో 2023, మార్చి 21న మహిళా కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఇసుక టిప్పరు ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు.

పోలీసులకు ఇసుక అదనపు సంపాదన

సీకేదిన్నె పోలీస్‌స్టేషన్‌లో గతంలో పనిచేసిన ఓ పోలీసు అధికారి సిద్దవటం రేవుల్లో ఇసుక దందా సాగించారు. రాత్రి పూట టిప్పర్లతో ఇసుక తరలించి నాలుగు రాళ్లు వెనకేసుకొంటున్నట్లు ఉన్నతాధికారులకు గుర్తించి వీఆర్‌కు పంపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పులివెందులలో పోస్టింగ్‌ ఇచ్చారు. కొన్ని రేవుల్లో పోలీసులకు, సెబ్‌ సిబ్బందికి టిప్పర్లు వంతున వాటాలందుతున్నాయి. వసూళ్లకు ప్రత్యేకంగా నమ్మకమైన సిబ్బందిని నియమించుకున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొట్టడంలో పరోక్షంగా పోలీసులు భాగస్వాములయ్యారు.


జనాల్లో చైతన్యం.. చేదు అనుభవం!

ఇసుక దందాపై ప్రజల్లో చైతన్యం వచ్చి తవ్వకాలు, వాహనాలను అడ్డుకున్న ఘటనలు ఉన్నాయి. వీరబల్లి, వేంపల్లె, సిద్దవటం, ఎర్రగుంట్ల, వల్లూరు మండలాల ప్రజల్లో చైతన్యం రాగా.. తవ్వకాలు తాత్కాలికంగా ఆగాయి. ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన ఆదినిమ్మాయపల్లె వాసులు ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గ్రామానికి చెందిన రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డగించి పది టిప్పర్లు రెండు జేసీబీలు పట్టించారు. అధికారులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గి కేవలం ఒక్క టిప్పరుపై మాత్రమే కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇసుక దందాల్లో వైకాపా నేతలకు మొదలు, పోలీసు, రెవెన్యూ, గనులశాఖ అధికారులకు వాటాలుండగా, సెబ్‌ విభాగం దోచుకుంటోంది. నెలవారీ మామూళ్లు ఉన్నతాధికారులకు అందుతుండడంతోనే చర్యలు తీసుకోలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


దోచేసి... ధరలు పెంచేసి

తెదేపా ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచితంగా లభిస్తే.. ఇప్పుడేమో మరింత ప్రియం కావడంతో పేద, మధ్యతరగతి వర్గాలపై భారం పడుతోంది. తెదేపా ప్రభుత్వ హయాంలో టిప్పరు ఇసుక రూ.10 వేల లోపే లభించగా, జగన్‌ పాలనలో దూరాన్ని బట్టి రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా సాధారణ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. తెదేపా ప్రభుత్వ హయాంలో ట్రాక్టరు ఇసుక రవాణా ఖర్చులతో కలిపి రూ.2 వేల లోపు ఖర్చయ్యేది. అదే జగన్‌ పాలనలో ఇసుక ట్రాక్టరు కొనుగోలే రూ.3 వేల వరకు ఉంటోంది. దీనికి రవాణా ఖర్చులు అదనం.


దందా అంతా పైవారి నుంచే..!

ఇసుక దందాలో వైకాపా కీలక నేతలే రంగంలోకి దిగారు. ప్రారంభంలో నెలవారీగా లీజుకిచ్చి తవ్వకాలకు స్థానిక వైకాపా నేతలకే అప్పగించారు. వసూళ్ల పరంగా ఇబ్బందులుండంతో జేపీˆ సంస్థ పేరిట దందా సాగించారు. ఆ తర్వాత అనధికారిక సంస్థల పేరిట దందా సాగిస్తున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో కీలక నేతలు తమ బంధువుల ద్వారా దందా సాగించగా... అన్నమయ్య జిల్లాలో మాత్రం ఓ అమాత్యులు, తంబళ్లపల్లె, రాయచోటి ప్రాంత నియోజకవర్గ నేతలే చక్రం తిప్పుతున్నారు. ఇతర నియోజకవర్గాల్లో స్థానిక నేతలే దోచుకున్నారు.


వైకాపాలోనూ బాధితులు!

ఆరంభంలో లీజు పేరిట వైకాపా నాయకులకే ఇసుక రేవులు అప్పగించారు. నెలవారీ వసూళ్లు ముందస్తుగా చెల్లించాలనే షరతుతో నేతలు చక్రం తిప్పారు.  లీజు గిట్టుబాటు కాక సిద్దవటానికి చెందిన వైకాపా నేతలు భారీగా నష్టపోయారు. వైకాపాతో జరిగిన మోసంతో బాధితులందరూ తెదేపాలో చేరే పరిస్థితులకు దారితీసింది. వైకాపా నేత, ఇసుక వ్యాపారి, పోరుమామిళ్లకు చెందిన చెన్నారెడ్డిపేట వాసి నారాయణరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని