logo

ప్రజాప్రతినిధి అండదండలు... అడుగడుగునా అక్రమాలు

అధికారంలో ఉన్న ముఖ్య ప్రజానేత అండదండలతో ప్రభుత్వానికి భారీగా గండిపడుతోంది. ఇంటి నిర్మాణ ఆకృతుల జారీ, పౌర సేవల ముసుగులో బరితెగించిన ఇంటి దొంగలు, పలువురు ప్రజాప్రతినిధుల పనితీరుతో పంచాయతీ రాబడికి భారీగా గండిపడినట్లు విమర్శలున్నాయి.

Published : 13 Apr 2024 03:04 IST

అతీగతీలేని రాచమల్లు హామీలు
కనీస వసతులకు నోచుకోని పల్లెలు
అధికారుల్లో కొరవడిన చిత్తశుద్ధి
న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు గ్రామీణ

ధికారంలో ఉన్న ముఖ్య ప్రజానేత అండదండలతో ప్రభుత్వానికి భారీగా గండిపడుతోంది. ఇంటి నిర్మాణ ఆకృతుల జారీ, పౌర సేవల ముసుగులో బరితెగించిన ఇంటి దొంగలు, పలువురు ప్రజాప్రతినిధుల పనితీరుతో పంచాయతీ రాబడికి భారీగా గండిపడినట్లు విమర్శలున్నాయి. ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం- 1, 2, 3, 4, 5 గ్రామసచివాలయాల పరిధిలో ప్రజా సమస్యలు తిష్ఠ వేశాయి. వీటిని పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారుల్లో చిత్తశుద్ధి, జవాబుదారీతనం లేక ఈ దుస్థితి నెలకొందని స్థానికులు విమర్శిస్తున్నారు. శ్మశానాలకు స్థలాలు లేకపోవడం, ఇళ్లపై 33 కేవీ కరెంటు తీగలు, మైలవరం ఉత్తర కాలువలో మురుగు, సీసీ రోడ్లు, కాలువలు, మెరుగైన పారిశుద్ధ్య సేవలు లేక నరకప్రాయంగా ఉందంటున్నారు. వందలాది ఎకరాల్లో అనుమతి లేని లే-అవుట్లు నుంచి 10 శాతం చొప్పున సామాజిక స్థలాలను కోల్పోవడంతో గ్రామ సచివాలయాలకు భూముల లభ్యత లేక కట్టడాలను చేపట్టని దుస్థితి ఉంది. నీటి సరఫరాలో ఉప్పు, లవణాల శాతం అధికంగా ఉన్నందున రోజువారీగా రూ.8 నుంచి రూ.10 చొప్పున రక్షిత నీటి కొనుగోలుతో ప్రజలకు ఆర్థిక భారంగా ఉంది. 20,419 మంది జనాభా ఉంది. శివారుల్లో జోరుగా నిర్మాణాలు చేపడుతున్నా వీధుల్లో మౌలిక సౌకర్యాలు లేవు. ఆచార్లకాలనీ, విరాట్‌నగర్‌, భగత్‌సింగ్‌ కాలనీ, హెచ్‌బీ కాలనీ మీదుగా 2.50 కి.మీ వరకు 33 కేవీ విద్యుత్తు తీగలు కింద గతంలో వ్యవసాయ భూములు ఉండేవి. పట్టణ విస్తరణలో భాగంగా కరెంటు తీగల సమస్య జఠిలంగా మారింది.

ఇళ్లపై ఉన్న యమపాశాలకు స్థానికులు ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతోంది. విద్యుత్తు తీగల మార్పిడిపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కొర్రపాడురోడ్డులోని సంపద సృష్టి కేంద్రం వద్దకు రోడ్డు మార్గం లేక ఎక్కడపడితే అక్కడే వ్యర్థాలను వదిలిపెడుతున్నారు. అయిదు గ్రామ సచివాలయాల పరిధిలో శ్మశానాల్లేక అంతిమ యాత్రలో ఆరు అడుగుల స్థలం కోసం వ్యయ, ప్రయాసలకు గురికావల్సి వస్తోంది. మురుగుపారుదల, సీసీ రహదారులు, కంకర రోడ్డు లేని వీధులు అనేకం ఉన్నాయి. హెచ్‌బీ కాలనీలో రూ.4.30 కోట్లతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి భూమి పూజ చేసినా ఉద్యాన అభివృద్ధి పనుల్లో పురోగతి లేదు. స్థానిక మున్సిపల్‌, పంచాయతీ వీధుల నుంచి పెద్ద ఎత్తున మురుగు జలాలు నేరుగా ఉప్పాగు వంకలోకి కలుస్తున్నాయి. రెవెన్యూ, పంచాయతీ, జలవనరుల శాఖల మధ్య సమన్వయం లేక పలు చోట్ల ఉప్పాగు వంక ఆక్రమణలతో కుంచించుకుపోతున్నా చర్యల్లేవు.


కరెంటు తీగల మధ్య జీవనం

- వీరప్రతాప్‌రెడ్డి, ఆచార్లకాలనీ

పలు వీధుల్లో ఇళ్లపై వెళ్తున్న 33 కేవీ విద్యుత్తు తీగలను మార్పిడి చేస్తామని ఎందరో పాలకులు, అధికారులు హామీలు ఇచ్చినా అతీగతీ లేదు. దీని కోసం ఎన్నాళ్ల నుంచి నిరీక్షిస్తున్నా నిరాశ కలుగుతోంది. చివరకు ఇళ్లపై అదనంగా గదుల నిర్మాణం లేక బాధిత కుటుంబాల అవస్థలు వర్ణనాతీతం.


మురుగు నిల్వలతో అవస్థ

- వెంకటకృష్ణ యాదవ్‌, కాల్వకట్ట

మైలవరం ఉత్తర కాలువలో పూడికతీత చేపట్టక వ్యర్థాలు, పిచ్చి మొక్కలతో మురుగుపారుదల లేదు. రాత్రి, పగలు తేడా లేకుండా దుర్వాసన, దోమలతో కంటిమీద కునుకు లేక విషజ్వరాల బారినపడుతున్నారు. సకాలంలో పూడికతీత, స్వచ్ఛత పనులు చేపట్టాలి. కాల్వకట్ట సమీపంలో ఇటీవల డెంగీ బారినపడిన బాధితులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు