logo

అవినాష్‌రెడ్డిది ఓటమి భయం

‘ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది  వైఎస్‌ రాజశేఖరరెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నారు. హంతకుడు కావాలా..? అభివృద్ధి ప్రదాత రాజన్న కుమార్తె కావాలా’ అని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల కోరారు.

Updated : 13 Apr 2024 05:04 IST

కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల
పులివెందులలో బస్సుయాత్రకు బ్రహ్మరథం
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, పులివెందుల, వేంపల్లె, లింగాల, సింహాద్రిపురం

‘ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది  వైఎస్‌ రాజశేఖరరెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నారు. హంతకుడు కావాలా..? అభివృద్ధి ప్రదాత రాజన్న కుమార్తె కావాలా’ అని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, పులివెందులలో శుక్రవారం ఆమె తన చిన్నాన్న వైఎస్‌ వివేకా కుమార్తె సునీతతో కలిసి బస్సుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో బస్సుయాత్రకు అన్ని వర్గాల ప్రజలు కదిలివచ్చారు. దీంతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అదే స్థాయిలో పులివెందులలో కూడా ప్రజలు ఘన స్వాగతం పలికారు. సింహాద్రిపురం నుంచి పులివెందుల పట్టణంలోని పూలంగళ్లు కూడలి సమీపానికి చేరుకోగానే బస్సుకు ఎదురెళ్లి ప్రజలు అభిమానంతో పలకరించి కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దుకాణాల్లోని కొనుగోలుదారులు, యజమానులు, వ్యాపారులు, పట్టణ వాసులు బయటకు వచ్చి చూస్తూ నిలబడిపోయారు. ప్రజల ప్రేమాభిమానాలు చూసి షర్మిల బస్సులో నుంచి కిందకి దిగి కాలినడకన దండాలు పెడుతూ సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

బస్సు పైనుంచి ఆమె ప్రసంగిస్తున్న తీరును ప్రజలు ఆసక్తిగా విన్నారు. మిద్దెలపై నిల్చుని ఓపిగ్గా ప్రసంగం ముగిసే వరకు అక్కడే ఉన్నారు. సీఎం జగన్‌ పాలనపై చేస్తున్న విమర్శలు, ఎంపీ అవినాష్‌రెడ్డిని నిలదీస్తుంటే ప్రజలు చప్పట్లు, కేకలు వేస్తూ ఆమెలో మరింత ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మీ రాజన్న బిడ్డగా కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నానని, మరోవైపు చిన్నాన్న వివేకాను హత్య చేసిన హంతకుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి పోటీగా నిలిచారని, హంతకులకు ఓటేస్తారా? న్యాయం కోసం పోరాడుతున్న మాకు ఓటేస్తారా అని కొంగుచాచి నేను, చిన్నాన్న వివేకా కుమార్తె సునీత అడుగుతున్నామని గద్గద స్వరంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆమె కన్నీటిని చూసి ప్రజలు మీకే ఓటేస్తామని చప్పట్లు కొట్టి నినదించారు. షర్మిల ప్రసంగం సాగిన అరగంటసేపు సభా ప్రాంగణంలోని జనాలు కదలకుండా అలాగే ఉండిపోయారు. వివేకా దేవుడంటూ వృద్ధులు సైతం నినాదాలు చేస్తూ మీకే ఓటేస్తామంటూ గళం విప్పారు. సభ జరుగుతున్న సమయంలో ఒకట్రెండు చోట్ల వీది దీపాలు ఆపేయడంతో ఆ ప్రాంగణం చీకటిమయమైంది. మేము వస్తున్నామని తెలిసి దీపాలు ఆపేశారా?.. అంటూ సభికులను షర్మిల అడిగారు. పులివెందులలో దీపాలు ఉండవంటే సీఎంగా జగన్‌ ఫెయిల్‌ అయినట్లు... దీపాలు ఉద్దేశపూర్వకంగానే తీశారంటే అవినాష్‌రెడ్డికి భయం పట్టుకున్నట్లుంది.. అంటూ ఆమె వ్యాఖ్యానించడంతో జనం నుంచి నవ్వులు విరిశాయి. అంతకుముందు షర్మిల, సునీతను పెద్ద సంఖ్యలో అభిమానులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పీసీసీ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పులివెందుల నియోజకవర్గ బాధ్యుడు శ్రీనివాసులరెడ్డి, వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, సీపీఐ నాయకుడు ఓబులేసు, నాయకులు బాబు, మనోహరరెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.  


లింగాలలో ఉద్రిక్తత...

లింగాలలో వైఎస్‌ షర్మిల, సునీత, బస్సుయాత్రను వైకాపా శ్రేణులు తమ పార్టీల జెండాలతో నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత సమయం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బస్సుయాత్ర లింగాల చేరుకోగానే సునీత మాట్లాడుతూ.. అవినాష్‌రెడ్డి... పులివెందుల పూలంగళ్ల వద్దకు రండి తేల్చుకుందాం.. వివేకా హత్యోదంతంపై చర్చిద్దామంటూ మాట్లాడటంతో వైకాపా శ్రేణులు జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెసు శ్రేణులు జై షర్మిల అంటూ నినదించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా శ్రేణులు పార్టీ జెండాలు చేతపట్టి సమీప వైకాపా నాయకుడి ఇంటి వద్ద నినాదాలు చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా నాయకులు మిద్దెపైకి ఎక్కి నినాదాలు చేయడంతో షర్మిల మాట్లాడుతూ.. పోలీసులు వైకాపా నాయకులను బలవంతంగా ఇంట్లోకి పంపి తలుపులు వేశారు. నాయకులు మరో ద్వారం ద్వారా బయటకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రసంగం అనంతరం వైఎస్‌ షర్మిలతో మహిళలు కరచాలనం చేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ ముందుకు సాగారు. బోనాల, లింగాల, లోపట్నూతల, గుణకనపల్లె, పెద్దకుడాల, అంకేవానిపల్లె, మురారిచింతల, తేర్నాంపల్లె, అక్కులగారిపల్లె, ఇప్పట్ల తదితర గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని