logo

జగన్‌ మామయ్య ఏలుబడి... ఇంటర్‌ ఫలితాల్లో బోల్తాపడి

మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. జిల్లాలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 55 శాతం, ద్వితీయ సంవత్సరంలో 69 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా 22వ స్థానంలో నిలిచింది.

Published : 13 Apr 2024 03:38 IST

ఉత్తీర్ణతలో జిల్లాకు రాష్ట్రంలో 22వ స్థానం
న్యూస్‌టుడే, కడప విద్య, రాయచోటి

మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. జిల్లాలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 55 శాతం, ద్వితీయ సంవత్సరంలో 69 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా 22వ స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికలు హవా కనబరిచారు. మొదటి ఏడాదిలో బాలురు 49 శాతం మంది, బాలికలు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం ఫలితాల్లో బాలురు 65 శాతం, బాలికలు 72 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇంటర్మీడియట్‌ విద్యపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితాలపై ప్రభావం చూపింది. కనీస వసతుల్లేని కళాశాలల్లో విద్యార్థులకు అరకొర అధ్యాపకులు విద్యాబోధన సాగించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసినట్లుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకూ పాఠ్య పుస్తకాలు అందించేవారు. సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పు కొంటున్న జగన్‌ ప్రభుత్వం విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని అటకెక్కించింది. గతేడాది విద్యార్థి సంఘాలు విద్యార్థులను కలుపుకొని రాష్ట్ర స్థాయిలో నిరసన గళ మెత్తినా ఏమాత్రం పట్టించుకోలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో జూనియర్‌ కళాశాలల విద్యార్థులకూ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించి అమలు చేయగా, వైకాపా తన అయిదేళ్ల పాలనలో ఆ విధానానికి మంగళం పాడేసింది. అంతే కాకుండా జిల్లాలో అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒప్పంద అధ్యాపకులకు సకాలంలో వేతనాలిచ్చే పరిస్థితి లేక విద్యాబోధన అంతంత మాత్రంగానే కొనసాగింది. ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల స్థాయిని పెంచుతాం, మండలానికో జూనియర్‌ కళాశాలతోపాటు ప్రత్యేకంగా బాలికల జూనియర్‌ కళాశాలలను ఏర్పాటుచేస్తాం’ అని సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేసింది. అవి కేవలం మాటలకే పరిమితమైందని ఇంటర్‌ ఫలితాలు తేల్చిచెబుతున్నాయి. పోస్టులే లేకుండా నిర్వహణ సాగిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. విద్యార్థులకు కనీస వసతులు కల్పించలేదు. మొత్తంగా ఇంటర్‌ ఫలితాలు ప్రభుత్వ పనితీరును వెక్కిరిస్తున్నాయి.

కళాశాలల్లో అధ్యాపకులేరి?

జిల్లాలోని 28 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 268 మంది జూనియర్‌ అధ్యాపకుల మంజూరు పోస్టులు ఉండగా, 139 మంది మాత్రమే రెగ్యులర్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. చక్రాయపేట, పెనగలూరు, రాయచోటి (బాలికలు), రాజంపేట (ఉర్దూ), మైదుకూరు (ఉర్దూ), ప్రొద్దుటూరు (ఉర్దూ), వేంపల్లి (ఉర్దూ), ఎర్రగుంట్ల, రైల్వేకొండాపురం కళాశాలల్లో అసలు మంజూరు అధ్యాపక పోస్టులే లేవు. ఒకరు కూడా అధికారికంగా అక్కడ విధులు నిర్వర్తించడం లేదు. ఇంటర్‌ విద్య దయనీయస్థితికి ఇదే సాక్ష్యం. ఆయా చోట్ల కొంతమంది ఒప్పంద అధ్యాపకులతో పనిచేయిస్తూ మమ అనిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎయిడెడ్‌ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య కన్నా బోధించే అధ్యాపకుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారి సేవలను ఇతర చోట్ల వినియోగించుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. సిలబస్‌ సకాలంలో పూర్తి చేయడం, ఆ తరువాత వాటిని తిరిగి విశ్లేషించుకోవడం, స్టడీ అవర్స్‌, పరీక్షలు రాయించడం వంటివి వాటిపై పూర్తిగా పర్యవేక్షణ కొరవడిందని ఆ శాఖ అధికారులు, అధ్యాపకులే చర్చించుకుంటున్నారు.

నాడు- నేడు అంతంతే

ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయి వరకూ నాడు-నేడు పనులకు సంబంధించి చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ విద్యకు మాత్రం వాటిని ఆలస్యంగా ప్రారంభించింది. వాటినీ కొద్దినెలల కిందట అధికారికంగా ఆపేసింది. నిధుల కొరత వెంటాడటంతోనే చాలాచోట్ల పనులు సరిగా లేవు. జిల్లాలో నాడు-నేడు కింద కడప (బాలురు, బాలికలు), జమ్మలమడుగు (బాలురు, బాలికలు), మైలవరం, ప్రొద్దు టూరు, ఎర్రగుంట్ల, పెండ్లిమర్రి, పోరుమామిళ్ల మొత్తంగా 9 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వసతులు కల్పించాలని నిర్ణయించారు. రూ.7 కోట్లకుపైగా నిధులు వెచ్చించి చేపట్టాల్సిన పనుల్లో రూ.2.50 కోట్లు ఖర్చు చేసిన వైకాపా ప్రభుత్వం ఆ తరువాత చేయించలేకపోయింది. వివిధ కారణాలతో మొత్తంగా పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు.

హైస్కూల్‌ప్లస్‌ అంతా ఆర్భాటమే...

చింతకొమ్మదిన్నె, చెన్నూరు (బాలికలు), గోపవరం, కమలాపురం (బాలురు), తాళ్లప్రొద్దుటూరు, ఎగువ లింగాల, ముద్దనూరు (బాలురు), వేపరాల, సిద్దవటం, తొండూరు, వేంపల్లి (బాలికలు), ఒంటిమిట్ట, చిలంకూరు, బద్వేలు (బాలురు) జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ప్లస్‌ పేరుతో జూనియర్‌ కళాశాలలుగా ఉన్నతీకరించారు. 2022-23లో వీటిని ప్రారంభించగా మొదటి సంవత్సరం ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులనే బోధనకు వినియోగించుకున్నారు. ఈ విద్యాసంవత్సరం పలువురు స్కూల్‌అసిస్టెంట్లకు సీనియారిటీ ప్రాతిపదికన ఒక ఇంక్రిమెంటు మంజూరుతో జూనియర్‌ అధ్యాకులుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. ప్రధానోపాధ్యాయులే ప్రిన్సిపల్స్‌గా వ్యవహరించారు. నాడు-నేడు పనుల పర్యవేక్షణ, యాప్‌ల నిర్వహణ వంటి వాటిలో హెచ్‌.ఎం.లకు సాధారణ విధులే ఇబ్బందికరంగా ఉందని వాపోతుంటే, జూనియర్‌ కళాశాలల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందన్నది వైకాపా ప్రభుత్వ పెద్దలకు తప్ప అందరికీ అవగతమవుతుంది. మండలానికి ఒక జూనియర్‌ కళాశాల, బాలికలకు ప్రత్యేక జూనియర్‌ కళాశాలలు అంటూ ఆర్భాటంగా ఊదరగొడుతున్న నాయకుల మాటలకు క్షేత్రస్థాయిలో విద్యాలయాల ఆవరణల్లో దుస్థితికి ఎలాంటి పొంతన కుదరదు.  


ప్రభుత్వ విధానాలే కారణం

- కత్తి నరసింహారెడ్డి, ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ

ఏటా ఇంటర్‌ ఫలితాలు తగ్గడానికి ప్రభుత్వ విధానాలే కారణం. సుమారు మూడు వేల ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల పర్యవేక్షణకు రాష్ట్రంలో ఒక రెగ్యులర్‌ ఆర్జేడీ, డీవీఈవో, ఆర్‌ఐవో గానీ లేరు. గతేడాది పాఠ్యపుస్తకాలు ముద్రించకుండానే విద్యాసంవత్సరం నడపడం, పదోతరగతి సిలబస్‌కి, ఇంటర్మీడియట్‌ సిలబస్‌కీ ఎక్కువ వ్యత్యాసం ఉండటం రెండు వందలకుపైగా ప్రభుత్వ కళాశాలలకు ప్రిన్సిపల్‌ పోస్టులు ఖాళీగా ఉండడం, 83 కళాశాలలకు ఒక రెగ్యులర్‌ లెక్చరర్‌ కూడా మంజూరు చేయకపోవడం, కళాశాలల్లో 80 శాతం మంది బోధనా సిబ్బంది ఒప్పంద, గెస్ట్‌ లెక్చరర్స్‌ నిర్వహిస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించకపోవడమే ఫలితాలు సరిగా లేకపోవడానికి ప్రధాన కారణాలు.


ఇంటర్‌ విద్యపై సవతి తల్లి ప్రేమ

 - గుజ్జల వలరాజు, జిల్లా కార్యదర్శి, ఏఐఎస్‌ఎఫ్‌

రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ విద్యపై  సవతితల్లి ప్రేమ చూపుతోంది. ప్రధానంగా జిల్లాలో ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో ఫలితాలు నామమాత్రంగా వచ్చాయి. వీటికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. పూర్తిస్థాయిలో అధ్యాపకులు, జూనియర్‌ కళాశాలలకు నిధులు, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాల్సిన ప్రభుత్వం ముఖం చాటేసింది. కనీస వసతులు కల్పించడంలో విఫలమైంది. 


పాఠ్యపుస్తకాలు... మధ్యాహ్నభోజనం ఊసేదీ?

తంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల మాదిరిగానే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకూ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేవారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  వాటిని ఇవ్వడం మానేసింది. గతేడాది విద్యార్థి సంఘాలు రాష్ట్రస్థాయిలో నిరసన గళమెత్తినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో జూనియర్‌ కళాశాలల విద్యార్థులకూ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించి అమలు చేయగా, వైకాపా ప్రభుత్వం దానిని అమలు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని