logo

ఆలోచన రేకెత్తించి... ప్రజల మనసులను దోచుకుని...

ప్రొద్దుటూరు సభలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీరును షర్మిల తీవ్రంగా ఎండగట్టారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Updated : 14 Apr 2024 08:39 IST

జిల్లాలో ముగిసిన షర్మిల బస్సుయాత్ర
రాచమల్లుపై విరుచుకుపడ్డ పీసీసీ అధ్యక్షురాలు

 

ప్రొద్దుటూరు సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల, పక్కన సునీత, నాయకులు

ప్రొద్దుటూరు సభలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీరును షర్మిల తీవ్రంగా ఎండగట్టారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘తనను రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కాదంటావా?. నీకు, వైకాపా సామాజిక మాధ్యమాలు నడిపే వారికి కఠినంగా హెచ్చరిస్తున్నాంటూ రాచమల్లుపై మండిపడ్డారు. జగన్‌ జైల్లో ఉంటే 3,200 కి.మీ పాదయాత్ర చేశా.. నా బిడ్డలను వదిలి పెట్టి.. ఏడాది పాటు రోడ్లపై తిరిగా.. పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డి కాదా?.. బాయ్‌ బాయ్‌ బాబు అంటూ చంద్రబాబుపై యుద్ధం చేసినప్పుడు షర్మిలారెడ్డి కాదా?.. అంటూ నిలదీశారు.

ఈనాడు, కడప: పులివెందుల బహిరంగసభలో శుక్రవారం రాత్రి కొంగు చాచి అడుగుతున్నా.. న్యాయం చేయండని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల అర్థించడం ఓటర్లను ఆలోచనలో పడేసింది. కన్నీళ్లతో ఓటర్లను వేడుకుని సానుభూతిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో ఆమె సఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వైకాపాలో అంతర్మథనం మొదలైంది. తమకు నష్టం జరుగుతోందనే అభిప్రాయానికి ఆ పార్టీ నేతలొచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు రంగ ప్రవేశం చేసి.. షర్మిల, సునీతలపై ఎదురుదాడి చేసేందుకు వారి మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దించారు. వివేకా హత్య కేసులో జగన్‌, అవినాష్‌రెడ్డిని వెనకేసుకొచ్చిన విమలారెడ్డికి షర్మిల, సునీత సుతిమెత్తగా చురకలు అంటించారు. కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన షర్మిల ఆరు రోజుల పాటు కడప పార్లమెంటు పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య అంశాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు. వివేకా కుమార్తె సునీతతో కలిసి తనదైన శైలిలో జగన్‌, అవినాష్‌రెడ్డిపై ఘాటైన విమర్శలు, ఆరోపణలు సంధించడంతో పార్టీ శ్రేణుల్లో, కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఐదేళ్ల కిందట జరిగిన వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడని సీబీఐ స్పష్టం చేస్తున్నా ఎందుకు జైలుకు పంప లేదనే వారి ప్రశ్నలకు సమాధానాలు లేకపోయాయి. ప్రతి సభలోనూ ఇదే అంశం ప్రస్తావన చేయడంతో ప్రజల్లో చర్చ మొదలైంది. మీ రాజన్న బిడ్డ కావాలో.. రాజశేఖర్‌రెడ్డి తమ్ముడిని చంపించిన అవినాష్‌రెడ్డి కావాలో తేల్చుకోవాలని పిలుపునివ్వడం ఓటర్లు ఆత్మపరిశీలనలో పడ్డారు. షర్మిల, సునీతపై వైకాపా నాయకులు కొందరు విమర్శలు చేసినా.. ప్రజలు పట్టించుకోకపోవడంతో చివరకు వారి మేనత్తను రంగంలోకి దింపారు. వైయస్‌ఆర్‌, వివేకాల సోదరి విమలారెడ్డిని మీడియాతో మాట్లాడించి షర్మిల, సునీతపై విమర్శలు చేయించారు. పులివెందులలో తమ కుటుంబ ఆడపడుచులు ఇద్దరూ కొంగు చాచి ఓట్లు అడుగుతుంటే రక్తపోటు పెరిగిపోయిందని విమలారెడ్డి అన్నారు. వివేకాను ఎవరు చంపారో వాళ్లు చూశారా?.. అవినాష్‌రెడ్డి, బాస్కర్‌రెడ్డిపై నిందలు వేశారంటూ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్వయానా అన్న వివేకాను చంపేస్తే.. సానుభూతి చూపించకుండా... న్యాయ కోసం పోరాడుతున్న అక్కాచెల్లెళ్లపైనే మాటల దాడి చేస్తారా? అంటూ సునీత, షర్మిల నిలదీశారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో శనివారం బస్సుయాత్ర కొనసాగింది. జమ్మలమడుగు పర్యటనలో ఇద్దరూ స్పందించారు. కనీసం కృతజ్ఞత లేకుండా జగన్‌ దగ్గర పొందుతున్న లబ్ధి కోసం తమపై మాట్లాడుతున్నారని విమర్శించారు. వైకాపా నాయకులైనా.. కుటుంబ సభ్యులైనా విమర్శిస్తే ఏమాత్రం తగ్గకుండా షర్మిల, సునీత వారికి ఘాటుగా బదులిస్తుండడం అధికార పార్టీ నేతలకు మింగుడుపడడంలేదు. ఆరు రోజుల బస్సుయాత్రను ముగించుకుని తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనకు వెళ్లారు. వివేకా కుమార్తె సునీత ఎన్నికల వరకు జిల్లాలోనే ఉంటూ షర్మిల తరపున విస్తృతంగా పర్యటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని