logo

జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే

మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్‌.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్‌.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా.

Published : 19 Apr 2024 03:02 IST

రాజోలి జలాశయం ఆత్మఘోష

కుందూనదిపై జిల్లా సరిహద్దులోని రాజోలి ఆనకట్ట

న్యూస్‌టుడే, మైదుకూరు: మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్‌.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్‌.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. ఇప్పుడు ఓటర్ల సమయమొచ్చింది. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఇంత ఇదిగా చెబుతున్న నేను ఎవరని అంటున్నావా.. నా పేరు కుముద్వతి. జిల్లా వాసులంతా కుందూ నది అంటారులే. నేను కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పుట్టి మన జిల్లా పెన్నాలో కలుస్తాననే విషయం అందరికీ తెలిసిందే. మీవాళ్లు నాలోని ఇసుకను టన్నుల కొద్దీ తవ్వి కాసులవర్షంలో తడిచిపోయారులే. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే.. పోయిన సంవత్సరం వానల్లేక.. నీళ్లు పారక ఈరోజు ఎండిపోయి కనిపిస్తున్నా. నీకు తెలుసో లేదో కానీ.. అంతకమునుపు ఏడాది పొడవునా నాలో గంగమ్మ ఉరకలేసేది. గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ.. నాలోని ఫిల్టర్‌ బావులతో వేలాది ఎకరాలకు నీరిచ్చా.. చుట్టుపక్క గ్రామాల్లో భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడ్డాను. అన్నదాతలకు సాగు నీరు... ప్రజలకు తాగునీరిచ్చి వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకున్నా. అలాంటి నాపైన పొరుగు జిల్లా నంద్యాల, మన జిల్లా సరిహద్దు రాజోలి ఆనకట్ట వద్ద 2.95 టీఎంసీల నీటి నిల్వకు జలాశయం నిర్మిస్తే కర్నూలు-కడప కాలువ ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడతానని అందరూ భావించారు. మానవసేవే మాధవ సేవ కదా.. అని నేను కూడా ఆనందించా. మీ నాయన రాజశేఖర్‌రెడ్డి జలాశయం నిర్మాణానికి నిధులు రూ.630 కోట్లు కేటాయించారు. 2008లో శంకుస్థాపన కూడా చేశారు. మీ నాయిన చేసిన మేలును మరచిపోకుండా ప్రజలంతా 2009లో తిరిగి పట్టం కట్టారు. ఈ విషయాన్ని 2017 నవంబరులో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా దువ్వూరు సభలో నీవు గుర్తు చేశావు కదా.. రాజోలి ప్రాజెక్టును మళ్లీ మనమే పూర్తి చేస్తామని హామీ గొప్పగా ఇచ్చావ్‌ సామీ. నీవు చెప్పిన మాటలు ప్రజలు నమ్మి నీకే అధికారం ఇచ్చారు. 2019 డిసెంబరు 23న మళ్లీ శంకుస్థాపన చేశావ్‌. వర్షాభావంతో శ్రీశైలం జలాశయం నుంచి నీరు రాకపోయినా నాలో ప్రవహించే నీటిని తెలుగుగంగకు ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశావు. ఏముందిలే ప్రజలకు మేలు జరిగితే అంతకాన్న ఈ జీవితానికేం కావాలని సంబరపడ్డాను. కాలచక్రం గిర్రున తిరిగింది. చూస్తే నాలుగేళ్లు దాటింది. జలాశయం ఊసేలేదు. ఎత్తిపోతల పథకం పనులూ ప్రారంభించలేదు. మాట తప్పను మడమ తిప్పనంటూ దువ్వూరులో చెప్పి విస్మరించావు. ఆ నొక్కే బటన్‌ ఏదో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు విషయంలోనూ చూపించి ఉండాల్సింది. దీన్నిబట్టి నాకర్థమైందేందంటే.. చెప్పేందుకే నీతులని... ఆచరించడానికి కాదని మీరు నిరూపించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు జగనన్నా. మళ్లీ ఎన్నికలొచ్చేశాయ్‌... ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఓటర్లే ఇక ఆలోచించి తీర్పు చెబుతారు.

ఇట్లు : జగనన్నను నమ్మి మోసపోయిన రాజోలి జలాశయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని