logo

బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు.

Published : 19 Apr 2024 03:04 IST

స్వామి వారిని అభిషేకిస్తున్న అర్చకులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. కోదండరాముడు వేణుగానాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత శ్రీరామచంద్రమూర్తిని సుందరంగా అలంకరించారు. తితిదే ఉప కార్యనిర్వహణాధికారి పి.వి.నటేష్‌బాబు ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవం ఘట్టం కనులపండువగా జరిగింది. భక్తజన బృందాలు, చెక్కభజనలు, కోలాట నృత్య ప్రదర్శనలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఆలయంలో ఉదయం 11 గంటల నుంచి సీతారామలక్ష్మణమూర్తులకు స్నపవ తిరుమంజనం వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. అభిషేక ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి దివ్యానుభూతి పొందారు.డీఎఫ్‌వో శ్రీనివాసులు, పర్యవేక్షకుడు హనుమంతయ్య, తనిఖీ అధికారి నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం 7.30కు జగదభిరాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.  రాత్రి 7 నుంచి 9 వరకు సింహ వాహనంపై సీతారామలక్ష్మణమూర్తులు విహరిస్తారు.

ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల తయారీ పూర్తి

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు అవసరమైన ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు తయారీ పూర్తయింది. ఈ నెల 22న రాత్రి సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు వీటిని పంపిణీ చేయనున్నారు. సుమారు లక్ష ప్యాకెట్లు సిద్ధం చేశారు. జానకీరాముల పరిణయ ఘట్టాన్ని తిలకించడానికి తరలిరానున్న భక్తులకు పవిత్రమైన ముత్యాల తలంబ్రాలతోపాటు తిరుమల శ్రీవారి చిన్న (25 గ్రాములు) లడ్డూలు అందజేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.

కనుల పండువగా ఊంజల్‌ సేవ

ఏకశిలానగరి కోదండ రామాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఊంజల్‌సేవ భక్తులను ఆనందభరితులను చేసింది. రామయ్య క్షేత్రంలో ఉన్న కల్యాణ మండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి డోలికల్లో కూర్చోబెట్టి ఊంజల్‌ సేవ చేశారు. చెన్నైకు చెందిన శృతి... భక్తి గీతాలను, అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని