logo

ఆ ముగ్గురిని జిల్లా దాటించారు!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మలమడుగు, కడప నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసుశాఖ డేగ కళ్లలో నిఘా పెట్టింది.

Updated : 18 May 2024 07:24 IST

ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిలపై పోలీసుల నిర్ణయం 
జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్‌ కొనసాగింపు
కడప నగరంలోనూ అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ఈనాడు, కడప

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మలమడుగు, కడప నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసుశాఖ డేగ కళ్లలో నిఘా పెట్టింది. ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులను శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఉండరాదంటూ హుకుం జారీ చేసి బయట ప్రాంతాలకు పంపేవిధంగా చర్యలు తీసుకున్నారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం.. సంబంధిత పోలీసు అధికారులపై వేటు వేసింది. ఇక ముందు ఇలాంటి అల్లర్లకు ఆస్కారం ఉండరాదంటూ కఠినంగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఈ నెల 13వ తేదీ రాత్రి జమ్మలమడుగు, కడపలో తెదేపా, వైకాపా మధ్య చెలరేగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని భారీగా పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు. ఆ రోజు రాత్రి వైకాపా వర్గాలు ఓ వైపు, తెదేపా, భాజపా వర్గీయులు మరో వైపు ఉంటూ రాళ్లు రువ్వుకున్నారు. ఆ రోజు నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు దేవగుడిలో తెదేపా కడప ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి, భాజపా జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి  ఆదినారాయణరెడ్డి, నిడిజువ్విలో వైకాపా  జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముగ్గురు అభ్యర్థులు స్థానికంగా ఉంటే కౌంటింగ్‌ లోపు మళ్లీ అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు. ఈ ముగ్గురూ స్థానికంగా ఉండరాదంటూ హుకుం జారీ చేశారు. ముందుగా సుధీర్‌రెడ్డిని హైదరాబాద్‌కు పంపించారు. భూపేష్‌రెడ్డి అత్తగారి ఊరు బనగానపల్లెకు వెళ్లారు. ఆదినారాయణరెడ్డి సైతం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దేవగుడిలో ఆదినారాయణరెడ్డి సోదరుల ఇళ్ల వద్ద భారీగా స్పెషల్‌ పార్టీ పోలీసులు పహారా కాస్తున్నారు. సుధీర్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. జమ్మలమడుగులోని మూడు ప్రధాన పార్టీల కార్యాలయాల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో 144వ సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఎవరూ గుంపులు.. గుంపులుగా తిరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్‌ వరకు బందోబస్తు  కొనసాగించాలని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

కడప నగరంలోనూ అప్రమత్తత

పోలింగ్‌ రోజు రాత్రి వైకాపా, తెదేపా వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో రాళ్లు రువ్వుకున్నారు. ఏకంగా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్‌బాషా గౌస్‌ నగర్‌లో వాహనం ఎక్కి తొడలు కొట్టి కేకలు వేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇలాంటి పరిస్థితిలో రెండు వర్గాల మధ్య కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిఘా వర్గాలు సైతం పోలీసులను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తెదేపా కడప అభ్యర్థి మాధవి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కడప వదిలి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కడపలో పార్టీ పతాకం ఎగుర వేస్తున్నామనే ధీమాను వ్యక్తం చేస్తూ.. కౌంటింగ్‌ వరకు పార్టీ కార్యకర్తలంతా సంయమనం పాటించాలని.. వైకాపా కవ్వింపు చర్యలకు రెచ్చిపోకుండా ఉండాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన సైతం జారీ చేశారు. ఆ తర్వాత అంజాద్‌ బాషా సైతం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెదేపా నాయకులు కడప నగరంలో అల్లర్లు సృష్టించే విధంగా రొచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, కార్యకర్తలంతా సంయమనం పాటించాలని కోరారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకే రోజు ప్రకటనలు విడుదల చేయడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. మున్మందు నగరంలో ఏం జరుగుతుందోననే ఆందోళనలో ప్రజలున్నారు. చిన్న గొడవ జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రెచ్చగొట్టే విధంగా ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిద్ధార్ధకౌశల్‌ హెచ్చరించారు. జమ్మలమడుగులో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కౌంటింగ్‌ రోజు.. తర్వాత కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని