logo

అతని తీరుతో అంతటా శోకం.. పోలీసు అధికారి వ్యవహార శైలిపై విమర్శలు

జిల్లాలో ఏ కేసులోనైనా జోక్యం చేసుకుంటారు... సాటి అధికారులను బెదిరిస్తారు... తనకు అనుకూలంగా మార్చుకుంటారు... మాట వినని అధికారులను ఇబ్బందులకు గురి చేస్తారు... నాలుగు రాళ్లు వెనకేసుకోండని తోటి అధికారులు, సిబ్బందికి హితబోధ చేస్తారు... వైకాపా నేతలు చెప్పినట్లు వినాలంటూ శాసిస్తారు...

Updated : 22 May 2024 06:47 IST

గత అయిదేళ్లుగా భూదందాలు, సెటిల్‌మెంట్లు
నిందితులను కేసుల నుంచి తప్పిస్తూ వసూళ్లు

ఈనాడు, కడప: జిల్లాలో ఏ కేసులోనైనా జోక్యం చేసుకుంటారు... సాటి అధికారులను బెదిరిస్తారు... తనకు అనుకూలంగా మార్చుకుంటారు... మాట వినని అధికారులను ఇబ్బందులకు గురి చేస్తారు... నాలుగు రాళ్లు వెనకేసుకోండని తోటి అధికారులు, సిబ్బందికి హితబోధ చేస్తారు... వైకాపా నేతలు చెప్పినట్లు వినాలంటూ శాసిస్తారు... లేకుంటే ఇబ్బందులు పడతారంటూ కఠినంగా హెచ్చరిస్తారు... ఇదీ జిల్లాలోని ఓ పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నైజం. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా కేంద్రమైన కడప నగరంలో ఆయనే పోలీసు బాసుగా చక్రం తిప్పుతున్నారు. వైకాపా నాయకుల అండదండలతో తమ శాఖ ఉన్నతాధికారులను సైతం శాసించే స్థాయికి ఎదిగిన ఆయన అనతికాలంలో అక్రమ సంపాదనతో రూ.కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఏ పోలీసు అధికారి బదిలీ కావాలన్నా ఈయన చెబితేనే జరుగుతుందనే స్థాయికి ఎదిగిపోయారు.  ఈయన ఇటీవల వేరే విభాగానికి  బదిలీపై వెళ్లారు.

  • కడప నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా సీఐకు సంబంధించి బినామీ పేర్లతో దాదాపు వంద వరకు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు ఉన్నాయన్నది సమాచారం. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. కడప నగరంలోని విద్యుత్తునగర్, దేవుని కడప ప్రాంతాల్లో వెంచర్లు ఉన్నాయి. భూవివాదాలతో ఎవరైనా పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కితే రాజీ చేయిస్తూ డబ్బులు తీసుకోవడం.. లేదంటే ప్లాట్లు రాయించు కోవడం చేస్తున్నారనే విమర్శలున్నాయి. .
  • గతంలో తెదేపా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని అరెస్టు చేసి రెండున్నర గంటల పాటు కడప నగర శివారులోని రహస్య ప్రాంతంలో నిర్బందించిన వ్యవహారంలో ఈయన కీలక పాత్ర పోషించారని తెదేపా నేతలు ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌ తనను కిడ్నాప్‌ చేయించి అంతమొందించడానికి పోలీసులను వాడుకున్నారని.. వారే తనను బంధించి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని బీటెక్‌ రవి సైతం ఆరోపించారు
  • కడప నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో సీఐగా పనిచేసిన అనుభవమున్న ఈయన వ్యవహారశైలిపై సర్వత్రా తీవ్ర దుమారమే రేగుతోంది. అధికారి తీరుపై పలు సందర్భాల్లో విపక్షాలు, ప్రజాసంఘాలు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు సైతం చేశాయి. 2019, సెప్టెంబరు నుంచి ఈయన ఆడిందే ఆట...పాడిందే పాట అన్న చందంగా భూదందాలు, సెటిల్‌మెంట్లు, చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో సీఐ, ఎస్‌.ఐ. స్థాయి పోలీసు అధికారులు బదిలీ కావాలన్నా ఈయనను ఆశ్రయించడం, వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసుల దర్యాప్తు బాధ్యతలను ఈయనకే అప్పగించడం ద్వారా నిందితులను కేసుల నుంచి తప్పించ డానికి గానీ, చేర్చడానికి గానీ రూ.లక్షల్లో ముడుపులు మూటగట్టుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
  • ప్రధానంగా వైకాపా నేతలు తలదూర్చిన కేసులతోపాటు పోలీస్‌స్టేషన్లకు వచ్చే పంచాయితీలు, సివిల్‌ కేసుల్లో రాజీ ప్రయత్నాలకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే అపవాదు ఈయనకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మంత్రితో సత్సంబంధాలు నెరుపుతూ ఆయన చెప్పినట్లుగా జిల్లాలో పలు కేసులను అక్రమ మార్గంలో కొలిక్కి తెచ్చినట్లు సమాచారం. ప్రధానంగా పులివెందుల వైకాపా పెద్దలకు వత్తాసు పలుకుతూ వారి సూచనల మేరకు భూదందాలు.. కేసులు మాఫీ వంటి వాటికి పాల్పడడం, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం చేస్తున్నారనే విమర్శలున్నాయి.
  • గతంలో కడప నగరంలో ఓ వైకాపా నాయకుడి హత్య కేసులో మరో వైకాపా నేత ప్రమేయం ఉందని బాధిత కుటుంబ సభ్యులతో పాటు ప్రతిపక్షాలు విమర్శలు చేశారు. దీంతో సీఐ సదరు నేత నుంచి రూ.లక్షలు వసూలు చేసి కేసు నుంచి తప్పించారనే ఆరోపణలున్నాయి. తన పరిధిలో కాకపోయినా గతేడాది మార్చిలో కడపలోని ఓ ఉన్నతాధికారి హత్య కేసులో జోక్యం చేసుకుని దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నారు. అసలు నిందితులను తప్పించడానికి రూ.లక్షల్లో ముడుపులు అందుకుని కేసును నీరుగార్చారనే అపవాదు ఉంది.
  • కడపలో భూదందాలు, సెటిల్‌మెంట్లు చేయడమే కాకుండా.. బీటెక్‌ రవిని చంపడానికి ప్రయత్నించిన వారిలో సదరు సీఐ పాత్ర ఉందని భాజపా నేత సీఎం రమేష్‌ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈయన వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్నడూలేనంతగా సీఐ స్థాయి అధికారి తీరుపై నేతలు ధ్వజమెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
  • సదరు సీఐను బదిలీ చేయాలని, ఆయన వైకాపాకు అనుకూలంగా ఉంటారని తెదేపా నేతలు ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. వైకాపా పెద్దల అండదండలున్నా.. ఎన్నికల సంఘం కఠిన నిర్ణయం తీసుకుంటుందనే అనుమానంతో ముందస్తుగానే అనారోగ్య కారణాలు చూపించి సీఐ సెలవుపై వెళ్లిపోయారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే సెలవు పెట్టిన ఈయన ఇంటి వద్ద నుంచే జిల్లాలో వైకాపా నేతలకు పరోక్షంగా సహకరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని