logo

పోలీసుల నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం!

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు తమ బాధ్యతను విస్మరించడంతో కడప నగరంలోని గౌస్‌నగర్‌లో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య రాళ్ల దాడికి దారి తీసింది.

Published : 23 May 2024 07:58 IST

కడప గౌస్‌నగర్‌ ఘటనలో పోలీసుల ఉదాసీన వైఖరి 
గంటన్నరపాటు తాత్సారం చేయడంతోనే దాడులు 

 పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట (పాత చిత్రం)

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు తమ బాధ్యతను విస్మరించడంతో కడప నగరంలోని గౌస్‌నగర్‌లో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య రాళ్ల దాడికి దారి తీసింది. రెండు పార్టీల శ్రేణులను సుమారు గంటన్నరపాటు ప్రాధేయపడుతూ కాలయాపన చేయడంతో చివరకు ఇరు పార్టీల మధ్య భారీగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. మొదట్లోనే రెండు వర్గాలను అడ్డుకుని ఉంటే వ్యవహారం దాడులకు దారి తీసేది కాదు.  ఈ వ్యవహారంలో వ్యవస్థాపరంగా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాళ్లదాడి ఘటనలో అధికారులపై చర్యలు తీసుకోకుండా కింది స్థాయి వారికి మెమోలతో సరిపెట్టారు. ఇక్కడ పరిస్థితి చూస్తే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చిన చందంగా వ్యవహరించారు పోలీసు అధికారులు. 


ఘటనా స్థలంలో అంజాద్‌ బాషా, వైకాపా నాయకులు (పాత చిత్రం) 

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కడప నేరవార్తలు : ఈ నెల 13వ తేదీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు తెదేపా, వైకాపా నాయకులు అక్కడక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. దీనికి దొంగ ఓట్లే మూలమైంది. వైకాపా నాయకుల దొంగ ఓట్ల పన్నాగాన్ని ముందే పసిగట్టిన తెదేపా నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫలితంగా రెండు వర్గాలు అక్కడక్కడ తలపడ్డాయి. రెండు వర్గాలు తలపడిన ప్రతిచోట పోలీసులు తాత్సారం చేస్తూ వచ్చారు. ఉదయం నుంచి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఆరు గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. కడప నగరంలోని గౌస్‌నగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో వైకాపా నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఇంతలో వైకాపా కార్యకర్తలు ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషాకు సమాచారమివ్వడంతో ఆయన కూడా అక్కడకు చేరుకున్నారు. అప్పటికి ఇరు వర్గాల వారు మొత్తం కలిపి 50 నుంచి 60 మంది వరకు మాత్రమే ఉన్నారు. వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. తెదేపా శ్రేణులు కదిరి ప్రసాద్‌ పెట్రోలు బంకు వద్ద ఉండగా, వైకాపా నాయకులు అమీర్‌ ధియేటర్‌ వద్ద ఉన్నారు. స్పెషల్‌ పార్టీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. అప్పుడే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను వెనక్కి పంపే చర్యలు తీసుకోవాల్సి ఉండగా, వైకాపాతో అంటకాగుతున్న పోలీసులు ఆ సాహసం చేయలేకపోయారు. ఇరువర్గాల వారిని ప్రాధేయపడడానికే సుమారు గంటన్నర సమయం పోలీసులు వెచ్చించారు. వారు వెళ్తే తాము వెళ్తామంటూ ఇరు వర్గాలు భీష్మించుకుని కూర్చోవడంతో అప్పటికే రెండు వర్గాల అనుచరులు భారీగా తరలివచ్చారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా వాహనంపైకి ఎక్కి సవాల్‌ చేయడం, ఇరు పార్టీల శ్రేణులు ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్న సమయంలోనూ పోలీసులు వారిని ప్రాధేయపడుతూనే ఉన్నారు. పోలీసులు అప్పుడే లాఠీలకు పని కల్పించి ఉన్నట్లయితే అంతా చెల్లాచెదరయ్యేవారు. ఇంతలో గుంపులో నుంచి ఓ వ్యక్తి రాయి విసరడంతో మరికొంత మంది ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం ప్రారంభించారు.. ఇలా రెండు వర్గాల వారు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. అప్పుడు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. డీఎస్పీ స్థాయి అధికారి ఉండి కూడా రాళ్ల దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. అంత మంది పోలీసులు.. పైగా కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కూడా వారిని నిలువరించలేక పోయారనే విమర్శలు వెల్లువెత్తాయి.

పోలీసుల నిర్లక్ష్యం స్పష్టం

గౌస్‌నగర్‌కు ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందంటూ ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సీఐతోపాటు అయిదుగురు ఎస్‌.ఐ.లకు తాఖీదులు ఇచ్చారు. పోలీసులు ముందుగానే అప్రమత్తమై ఇరు పార్టీల వారిని ఘటనాస్థలం నుంచి వెనక్కి పంపించి ఉంటే ఘటన జరిగేది కాదనే అంచనాకు పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. ఎంత సేపు పోలీసులు నేతలను ప్రాధేయపడ్డారే తప్ప పరిస్థితి చేయి దాటిపోకుండా బాధ్యతగా చర్యలు తీసుకుని ఉంటే అంత అలజడి జరిగేది కాదు. ఇరు పార్టీలకు చెందిన 47 మందిపై కేసులు నమోదయ్యేవి కావు. ఘటనకు సంబంధించి అటు ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషాతో పాటు 22 మందిపై, ఇటు తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు 25 మందిపై కేసులు నమోదు చేసి 41ఏ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసు కేసుల నేపథ్యంలో పలువురు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మెమోలు కాదు.. ఇప్పటికే బాధ్యలైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. గౌస్‌ నగర్‌ ఘటన ప్రాంతంలో రాళ్లు రువ్వుకోవడం, రెచ్చగొట్టేలా నేతల ప్రవర్తించిన తీరు మరో తాడిపత్రి, తిరుపతి, పల్నాడు స్థాయిలో తక్కువేమీ జరగలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని