logo

రుణాల పేరుతో బురిడీ కొట్టించి మూడు ఇళ్లలో చోరీ

రుణాల పేరుతో బురిడీ కొట్టించి మూడు ఇళ్లలో చోరీకి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేసి, రూ.22.32 లక్షలు విలువైన 31 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Published : 25 May 2024 03:34 IST

పొదుపు సంఘం లీడర్‌ అరెస్టు
31 తులాల బంగారం స్వాధీనం

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రుణాల పేరుతో బురిడీ కొట్టించి మూడు ఇళ్లలో చోరీకి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేసి, రూ.22.32 లక్షలు విలువైన 31 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్‌ తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని మౌలానా ఆజాద్‌ వీధి-2కు చెందిన జహరా తాజ్‌ పొదుపు సంఘం గ్రూపునకు లీడర్‌గా పనిచేస్తోంది. గ్రూపు సభ్యుల ఇళ్లలో బంగారం ఆభరణాలు ఉన్నట్లు గుర్తించి వాటిని చోరీ చేయాలని పక్కా ప్రణాళిక వేసింది. ఈ క్రమంలో రుణాలు ఇప్పిస్తానని ఆశచూపి మహిళలను ఇంటి వద్దకు రప్పించుకుని, మాటలు కలిపి వారి హ్యాండ్‌బ్యాగులో ఉన్న ఇంటి తాళాలు తీసుకునేది. వారిని అక్కడే ఉంచి, రుణం గురించి మాట్లాడి వస్తానని నేరుగా బాధితుల ఇంటికి వెళ్లి తాళాలను తీసి బీరువాలో ఉన్న బంగారం ఆభరణాలను చోరీ చేసింది. ఈ విధంగా మౌలానా ఆజాద్‌ వీధిలోని రెండు ఇళ్లు, కేహెచ్‌ఎం వీధిలోని మరో ఇంట్లో దొంగతనాలు చేసి మొత్తం 35 తులాల బంగారు ఆభరణాలు అపహరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలించిన నగలను కరిగించి ఆభరణాలు తయారు చేయించేందుకు నెల్లూరు వెళ్తుండగా నిందితురాలిని పట్టణంలోని గంగమ్మ దేవాలయం వీధిలో అదుపులోకి తీసుకుని 31 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్, ఎస్‌.ఐ.లు హైమావతి, మంజునాథ్, హెడ్‌కానిస్టేబుళ్లు నాగాంజనేయులు, జగన్నాథరెడ్డి, రహ్మతుల్లా, కానిస్టేబుల్‌ బాబా ఫకృద్ధీన్, హోంగార్డు రంజిత్‌కుమార్‌రెడ్డిని డీఎస్పీ అభినందించారు.


తాళం పగులగొట్టి దొంగతనం

13 తులాల బంగారం, రూ.50 వేల నగదు అపహరణ

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఎస్‌.ఉప్పలపాడు గ్రామంలోని పెద్ద ఓబులేసు ఇంట్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బాధితుడి వివరాల మేరకు కుటుంబసభ్యులు భోజనం చేసి ఇంటికి తాళం వేసి మేడ మీద పడుకున్నారు. శుక్రవారం ఉదయం వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళం తొలగించడాన్ని గమనించారు. దుండగులు బీరువా తాళం పగులగొట్టి 13 తులాల బంగారం, రూ.50 వేల నగదు చోరీ చేశారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: మండల పరిధిలోని చిలమకూరు గ్రామ సమీపంలో బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సంపంగి కుళాయప్ప (50) మృతి చెందినట్లు శుక్రవారం ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. ఎర్రగుంట్ల పట్టణం మహేశ్వర్‌నగర్‌లో నివాసం ఉండే కుళాయప్ప కొండాపురం సమీపంలో ఒక క్రషర్‌ మిషన్‌కు సంబంధించి టిప్పర్‌ డ్రైవర్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ద్విచక్రవాహనంలో కొండాపురం నుంచి ఎర్రగుంట్లకు వస్తుండగా చిలమకూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.


ప్రొద్దుటూరులో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పట్టణంలోని ఓ కూల్‌డ్రింక్‌ దుకాణంలో శుక్రవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఐ ఇదురుబాషా తెలిపిన వివరాల ప్రకారం.. పానీయాలు తయారు చేసి నిల్వ చేస్తున్న బాటిల్స్‌ను తిరిగి వినియోగించడం, వాటిపై తూకం, బరువు, నిల్వ చేసిన తేదీ, ప్యాకింగ్‌ లైసెన్సు లేవన్నారు. ఈ నిబంధనలు పాటించనందుకు అధికారులు రూ.25000 జరిమానా విధించారు. ప్లాస్టిక్‌ బాటిల్స్, పాలిథిన్‌ కవర్లు వాడటం, తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వినియోగించినందుకు రూ.5000లు జరిమానా విధించారు. ఈ సందర్భంగా పానీయాలతో పాటు బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ప్రయోగశాలలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీసీటీవో బాబు మోజెస్,  వ్యవసాయాధికారి బాలగంగాధర్‌రెడ్డి, ఆహారపదార్థాల డివిజన్‌ తనిఖీ అధికారి హరిత, ప్రొద్దుటూరు లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ జయదేవ్, పారిశుద్ధ్య అధికారి కిరణ్, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. 


క్రిమినల్‌ కేసుల నమోదుకు డిమాండు

కడప, చిన్నచౌకు, న్యూస్‌టుడే: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు కల్పిస్తున్న యాజమాన్యాలపై తక్షణం క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని గ్రేటర్‌ రాయలసీమ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు యాదవ్, రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు షేక్‌ సిద్ధిక్‌ డిమాండు చేశారు. దీనిపై శుక్రవారం ఆర్‌ఐవో వెంకటసుబ్బయ్యకు వినతిపత్రం అందజేశారు.  అనంతరం వారు మాట్లాడుతూ ఇంటర్‌విద్య అధికారుల నిర్లక్ష్యంతో ఎంతోమంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని ఆరోపించారు. ఆర్‌ఐవో కార్యాలయానికి సమీపంలోనే ఓ ప్రైవేటు విద్యాసంస్థకు గుర్తింపు లేకపోయినప్పటికీ నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పారు.


రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం

పుల్లంపేట: ద్విచక్ర వాహనం లారీని ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రఘురాం తెలిపిన వివరాల ప్రకారం.. పెనగలూరు మండలం కొండూరు అగ్రహారానికి చెందిన రైతులు పసుపులేని సుబ్బనరసయ్య (40) తోట వెంకటరమణలు వారి పొలాల్లో డ్రిప్‌ పైపులు ఏర్పాటు చేసేందుకు ద్విచక్ర వాహనంలో రెడ్డిపల్లెకు బయల్దేరారు. పుల్లంపేట మండలం అప్పయ్యరాజుపేట పెట్రోలు బంకు సమీపంలో వెళ్లగానే కోడూరు నుంచి రాజంపేట వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సుబ్బనరసయ్య అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు