logo

ఇబ్బందులు వస్తాయన్నా.. పట్టని అధికారులు

యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) ఏర్పాటు తర్వాత న్యాక్‌ ఏ గ్రేడుకు వచ్చేందుకు పద్దెనెమిదేళ్లు పట్టింది. అలాంటి దానిని మళ్లీ వెనక్కు నెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ అధ్యాపకులు భగ్గుమంటున్నారు.

Published : 25 May 2024 03:38 IST

వైవీయూలో ఏఎఫ్‌యూ ఏర్పాటుకే  మొగ్గు
నెలాఖరులోపు భవనాలు అప్పగించేందుకు సిద్ధం
న్యూస్‌టుడే, వైవీయూ(కడప) 

యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) ఏర్పాటు తర్వాత న్యాక్‌ ఏ గ్రేడుకు వచ్చేందుకు పద్దెనెమిదేళ్లు పట్టింది. అలాంటి దానిని మళ్లీ వెనక్కు నెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ అధ్యాపకులు భగ్గుమంటున్నారు. జిల్లాలో నాలుగేళ్ల కిందట ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ(ఏఎఫ్‌యూ)కు వైవీయూ భవనాలను అప్పనంగా అప్పగించేందుకు అధికారులు సిద్ధమవడంతో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారని వారు వాపోతున్నారు.  

ఏకపక్షంగా కమిటీ నియామకం

రెండు వారాల కిందట ఏఎఫ్‌యూ అధికారులు వైవీయూకు వచ్చి వీసీతో కలసి నూతన పరిపాలనా భవనం, గెస్ట్‌హౌస్, ఇంకా కొన్ని భవనాలను పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో చర్చించకుండానే, ఎలాంటి సమావేశం నిర్వహించకుండా ఆగమేఘాల మీద ఈ నెల 29వ తేదీ లోపు నివేదిక ఇచ్చి, 31 లోపు ఏఎఫ్‌యూకు భవనాలను అప్పగించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ వైవీయూ వీసీ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఆయనను కలిసి ఇప్పటికే కోర్సులకు తగ్గట్టు భవనాలు సరిపోవడం లేదని, ఏఎఫ్‌యూకు సర్దుబాటు చేస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయని చెప్పినా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో కమిటీ ఏర్పాటుపై ఉత్తర్వులను ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

న్యాక్‌ గుర్తింపు కోల్పోయే పరిస్థితి 

ప్రస్తుతం వైవీయూ న్యాక్‌ ఏప్లస్‌ గ్రేడులో ఉంది. రాబోయే రెండేళ్లలో వైవీయూ మళ్లీ న్యాక్‌ పరిశీలనకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు వైవీయూలో మౌలిక, విద్యా వసతులు, ల్యాబ్‌ సౌకర్యాలు తదితర అన్నింటిని పరిశీలించి ఉత్తమంగా నిలిస్తే న్యాక్‌తో పాటు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాకింగును మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఒకే క్యాంపస్‌లో రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తే వైవీయూ అభివృద్ధికి ఆటంకం ఏర్పడటంతో పాటు ప్రస్తుతం ఉన్న న్యాక్‌ గుర్తింపు కూడా కోల్పోయే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.

విద్యార్థులు పెరిగితే ఎలా... 

నూతన విద్యావిధానం ప్రకారం వైవీయూలో యూజీసీ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నారు. నూతన కోర్సులను ప్రారంభించేందుకు ఇటీవల సమావేశం కూడా నిర్వహించారు. కొత్త విద్యార్థులు వస్తే తరగతి గదులు, ల్యాబ్‌లు అవసరమవుతాయి. దీనికి తోడు ఆర్కిటెక్చర్‌ విద్యార్థులు కూడా వస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. రెండు యూనివర్సిటీలను ఒకే క్యాంపస్‌లో నిర్వహించేందుకు సాధ్యమవుతుందా?, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది ఊహించకుండా వైవీయూ అధికారులు తప్పటడుగులు వేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.


ఈసీలో చర్చించి నిర్ణయం

- వై.పి.వెంకటసుబ్బయ్య, రిజిస్ట్రార్‌   

ఒకే క్యాంపస్‌లో రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో  ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణయం తీసుకుంటాం. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశాం.  ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(ఈసీ)లో చర్చిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని