logo

జలం వృథా... జనం వ్యధ!

జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో తాగునీటికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పట్టణానికి వెలిగల్లు జలాశయం నుంచి వస్తున్న తాగునీటిని పొదుపుగా వాడుకుంటూ అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేందుకు కృషి చేయాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు.

Published : 25 May 2024 03:40 IST

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో తాగునీటికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పట్టణానికి వెలిగల్లు జలాశయం నుంచి వస్తున్న తాగునీటిని పొదుపుగా వాడుకుంటూ అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేందుకు కృషి చేయాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. పట్టణ వాసులు దాహం తీరక కొనుగోలు చేసిన నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. గేట్‌ వాల్వ్‌ల వద్ద లీకేజీ అవుతున్న నీటిని సైతం జనం వదలకుండా బిందెలతో పట్టుకుని తాగేందుకు భద్రపరుచుకుంటున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. తాగునీటి పైపులైన్లకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో పట్టణంలోని పైపులైన్ల లీకేజీలతో తాగునీరు వృధాగా పోతోంది. పట్టణంలోని మాసాపేట వంతెన వద్ద ఏర్పాటు చేసిన పైపులైను జాయింట్‌ వద్ద మరలు ఊడిపోవడంతో శుక్రవారం నీరంతా వృథాగా దిగువన మాండవ్య నదిలోకి పారింది. స్థానికులు పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వృథాగా పోతున్న నీటిని అరికట్టలేదని స్థానికులు వాపోయారు. వేసవిలో ఇలా నీరు వృథా చేస్తే జనం దాహం తీర్చేది ఎలాగని పట్టణ వాసులు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని లీకేజీలు అరికట్టాలని పురవాసులు కోరుతున్నారు. పట్టణంలో ఎక్కడ లీకేజీలు ఏర్పడిన తాగునీటి సరపరా విభాగం సిబ్బందిని పంపి వెంటనే లీకేజీలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ వాసుబాబు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని