logo

ఇరకాటంలో ఇంటర్‌!

జిల్లాకేంద్రమైన రాయచోటి పట్టణంలో బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. బాలుర కళాశాలలో నాడు-నేడు కింద చేపట్టిన పనులు నేటికీ పూర్తికాలేదు. మరుగుదొడ్లను పరీక్షల వేళ హడావుడిగా పూర్తి చేశారు.

Published : 25 May 2024 03:44 IST

ప్రభుత్వ కళాశాలల్లో కానరాని మౌలిక వసతులు
పట్టించుకోని అధికార యంత్రాంగం 
న్యూస్‌టుడే, రాయచోటి, ఓబులవారిపల్లె

జిల్లాకేంద్రమైన రాయచోటి పట్టణంలో బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. బాలుర కళాశాలలో నాడు-నేడు కింద చేపట్టిన పనులు నేటికీ పూర్తికాలేదు. మరుగుదొడ్లను పరీక్షల వేళ హడావుడిగా పూర్తి చేశారు. బాలికల జూనియర్‌ కళాశాలలో గదుల కొరత పీడిస్తోంది. అక్కడే ఉన్న బ్రిటీష్‌కాలం నాటి భవనంలోనే విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంగణంలో రెండేళ్ల కిందట మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక గదులు లేకపోవడంతో జూనియర్‌ కళాశాల గదుల్లోనే సర్దుబాటు చేశారు.

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సమస్యలు తిష్ట వేశాయి. ఏటా అధికారులు హడావుడిగా ప్రవేశాలు కల్పిస్తూ అరకొర సౌకర్యాల మధ్యనే విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యకు ప్రాధాన్యమిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం కళాశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు. కనీస నిర్వహణ ఖర్చులకు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలోని చాలా కళాశాలల్లో గదుల కొరత పీడిస్తోంది. నాడు-నేడు కింద చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులకు చెట్ల కింద చదువులు తప్పేటట్టు లేదు. మరికొన్ని కళాశాలల్లో ప్రయోగశాలలు లేకపోవడంతో పొరుగు కళాశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కేజీబీవీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత పీడిస్తోంది. చాలా కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకులతోనే బోధన సాగిస్తున్నారు. కళాశాలల పునఃప్రారంభం నాటికి సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం దృష్టి సారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

  • రాయచోటి-శిబ్యాల మార్గంలోని కేజీబీవీ పాఠశాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గుట్టల ప్రాంతంలో ఉండడం, విద్యుత్తు దీపాలు లేకపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. 
  • రామాపురం మండలం గంగనేరు క్రాస్‌లో గుట్టపై నిర్మించిన కేజీబీవీ పాఠశాలకు అయిదేళ్ల కిందట ప్రారంభించిన ప్రహరీ నిర్మాణపనులు ఇంతవరకు పూర్తికాలేదు. 
  • గాలివీడులోని వెలిగల్లు ప్రాజెక్టు ఒడ్డున కేజీబీవీ పాఠశాల, కళాశాలకు ప్రహరీ నిర్మాణం పూర్తి కాలేదు. అన్ని గ్రూపుల్లో  కలిపి 60 మందికిపైగా విద్యార్థినులు చదువుతున్నారు. 
  • సుండుపల్లి కేజీబీవీ పాఠశాలలోని ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోగశాల లేదు. ప్రైవేట్‌ కళాశాలల్లోని ప్రయోగశాలల్లో ప్రాక్టికల్స్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
  • నందలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోనే ఉన్నత పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంటర్‌ విద్యార్థులకు సరిపడా గదులు లేవు. పాఠశాల, కళాశాల రెండూ ఒకే ప్రాంగణంలో ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.
  • పెనగలూరు కేజీబీవీలో ఎంపీసీ గ్రూపు మాత్రమే ఉంది. మూడేళ్లుగా బోధన సిబ్బంది లేరు. ప్రయోగశాలతోపాటు ప్రత్యేక తరగతి గదులు, వసతులు లేవు. 2021-22 విద్యాసంవత్సరంలో 20 శాతం, 2022-23లో సున్నా ఫలితాలు, 2023-24లో 33.33 శాతం ఉత్తీర్ణత సాధించింది. 
  • చిట్వేలి కేజీబీవీలో ఎంపీసీ గ్రూపు ఉంది. ఇంటర్మీడియట్‌ విద్యను బోధించే సిబ్బందే లేరు. పాఠశాలలకు బోధించేవారే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు బోధిస్తున్నారు. ఇక్కడ ప్రయోగశాల లేదు. 2022-23లో ప్రథమ సంవత్సరం 4 శాతం, ద్వితీయ సంవత్సరం 7 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2023-24లో ప్రథమ సంవత్సరం 23 శాతం, ద్వితీయ సంవత్సరం 27 శాతం ఉత్తీర్ణత సాధించారు.
  • పుల్లంపేటలో ఎంపీసీ గ్రూపు ఉంది. ప్రత్యేక తరగతి గదులు లేవు. ప్రయోగశాల లేదు. ఈ ఏడాది మాత్రమే సిబ్బంది వచ్చారు. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 11 మంది పరీక్షలు రాస్తే నలుగురు, ద్వితీయ సంవత్సరంలో 16 మంది పరీక్ష రాస్తే నలుగురు మాత్రమే ఉత్తీర్ణ సాధించారు. 2022-23లో 10 శాతం, 2021-22లో 3 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
  • ఓబులవారిపల్లె కేజీబీవీలో బైపీసీ గ్రూపు మాత్రమే ఉంది. 2021-22కు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు సున్నాగా నమోదయ్యాయి. 2022-23లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం 21 మంది పరీక్షలు రాస్తే కేవలం అయిదుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 19 మందికి ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులు 26 మంది పరీక్షలు రాస్తే కేవలం ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 21 మందికి నలుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. బోధన సిబ్బంది కొరతే ప్రధాన కారణం. అంతేకాకుండా ఎటువంటి ల్యాబ్‌ సౌకర్యం లేదు. ప్రత్యేక గదులు కూడా లేవు. 

మెరుగైన వసతులు కల్పిస్తాం

- కృష్ణయ్య, డీఐఆర్‌వో, అన్నమయ్య 

జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్యను బలోపేతం చేస్తున్నాం. కళాశాలల్లో ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. కళాశాలల్లో ఎలాంటి సమస్యలున్నా యాజమాన్యాలు కళాశాలలు ప్రారంభం లోపు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని