logo

ఇసుక తినేస్తున్నారు.. మట్టి మింగేస్తున్నారు..!

జిల్లాలోని సహజ వనరులపై వైకాపా నాయకుల కళ్లు పడ్డాయి. గత అయిదేళ్లుగా ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి దోపిడీ సాగిస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండదండలుండడంతో వారి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

Published : 25 May 2024 03:48 IST

జిల్లాలో యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ
సుప్రీంకోర్టు ఆదేశాలు వైకాపా నేతలు బేఖాతరు 
అక్రమార్కులకు అధికార యంత్రాంగం వత్తాసు 
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ

జిల్లాలోని సహజ వనరులపై వైకాపా నాయకుల కళ్లు పడ్డాయి. గత అయిదేళ్లుగా ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి దోపిడీ సాగిస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండదండలుండడంతో వారి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రధానంగా ఇసుక అక్రమ దందాను ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి పలు ఆదేశాలు జారీ చేసినా నాయకులు ధిక్కరిస్తున్నారు. వీరికి అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. 


రాజంపేట మండలం మందరం కొత్తపల్లి గ్రామసమీపంలోని చెయ్యేరు నదిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. నది సమీపంలోని మామిడి తోటల్లో ట్రాక్లర్లును ఉంచి రాత్రివేళల్లో ఇసుక తవ్వేసి  రాజంపేటకు తరలిస్తున్నారు. అక్కడ ట్రాక్టరు ఇసుకను రూ.6 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

తాజాగా వచ్చిన సుప్రీంకోర్టులో ఆదేశాలతో జిల్లాలోని చెెయ్యేరు నదీ పరివాహక గ్రామాల ప్రజలు ప్రజలు సంబరపడ్డారు. ఇసుక తవ్వకాలు నిలిచిపోతాయని, నది ధ్వంసం కాకుండా ఉంటుందని, భూగర్భజల మట్టాలు పెరుగుతాయని భావించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా లెక్క చేయకుండా అక్రమార్కులు ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రధానంగా రాజంపేట, నందలూరు, వీరబల్లి, పెనగ లూరు మండలాల పరిధిలోని ఇసుక రేవుల్లో గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం అక్రమార్కులు కొత్త దారులు వెతుక్కుకుంటున్నారు. లారీలు, టిప్పర్లను ఇసుక రేవుల్లోకి తీసుకెళ్లడంలేదు. ట్రాక్టర్లతో ఇసుకను తరలించి తోటల్లో నిల్వలు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా లారీలు, టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారం బహిరంగ రహస్యమైనా అధికారులు కనీసం పట్టించుకోవడంలేదు. గనులశాఖలోని కొంతమంది అధికారులకు ఇసుక దందాలో వాటాలుండడంతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అక్కడక్కడ రాత్రి పూట యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వ్యవసాయ పనులు కోసమంటూ మామిడి తోటల్లో ట్రాక్టర్లును ఉంచుకుని రాత్రి కాగానే చెయ్యేరులోని ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

  • పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు గ్రామసమీపంలో గతంలో ఇసుకను డంపింగ్‌ చేశారు. దానిని ఇప్పటికే పూర్తిగా బయట ప్రాంతాలకు తరలించినప్పటికీ తిరిగి ఇక్కడే ఇసుక నిల్వ చేస్తూ తరలించుకుపోతున్నారు.
  • నందలూరు మండలం తొగుపేట వద్ద పట్టపగలే చెయ్యేరు నది నుంచి ఇసుకను తరలిస్తున్నారు. పాపారాజుపల్లి వద్ద నుంచి సిమెంటు ఇటుకల తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యం ఇసుకను రవాణా చేస్తున్నారు. 
  • వీరబల్లి మండలం రాగిమాను దిన్నేెపల్లి, మట్లి, పెద్దివీడు, వీరబల్లి గ్రామాల్లో మాండవ్య నది నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లతో రాత్రి సమయంలో ఇసుక తరలిస్తున్నారు. మండలంలో భారీ ఎత్తున తవ్వకాలు సాగిస్తున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోవడంలేదు. 
  • రామాపురం మండలం మద్దిరేవుల వంక ప్రాంతంలో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడకు వచ్చి పరిశీలించిన అధికారి ఒకరు కూడా లేరు. కొంతమంది సెబ్‌ అధికారులు వైకాపా నేతలతో లాలూచీ పడి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. 

కర్ణాటకకు అక్రమ రవాణా...

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మట్టి మాఫియా కొందరు అధికారుల అండదండలతో గుట్టలు, కొండలను కొల్లగొట్టేస్తోంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం పంచాయతీ రేకులకుంటపల్లి సమీపంలోని మొరుంగుట్టలో మట్టి తవ్వకాలు జరుపుతూ సమీపంలోని కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తూ ఓ వైకాపా నేత భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేత తన పొలం సమీపంలోని మొరుం గుట్ట సర్వే సంఖ్య 891(ఎ)లో 7.88 ఎకరాల భూమిని 28 మంది దళిత రైతులకు గతంలో పట్టాలు మంజూరు చేశారు. వీరి భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకుని మట్టి తవ్వకాలు యథేచ్ఛగా చేపడుతున్నారు. వివిధ రూపాల్లో నేత సాగిస్తున్న ఆరాచకాలపై ప్రశ్నించడానికి ఏ అధికారి ముందుకు రావడం లేదు. కొంతమంది గ్రామస్థులు తహసీల్దారు, గనులశాఖ అధికారులకు గతంలో సమాచారం అందించినప్పÆట¨కీ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ఇట©వల పోలీసు అధికారులు దాడులు నిర్వహించి వాహనాలు జప్తు చేయకుండా వదిలేశారు. కర్ణాటక రాష్ట్రంలో మట¨్ట, ఇసుక రవాణాకు అనుమతులు లేక పోవడంతో సరిహద్దు ప్రాంతంలోని ట¨.సదుం పంచాయతీ, పాపఘ్ని నదిలోని ఇసుకతో పాటు కూతవేటు దూరంలో ఉన్న రేకులకుంటపల్లి వద్ద నుంచి మట¨్టని తరలిస్తున్నారు. అధికారుల అండతో అక్రమ రవాణాకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు