logo

ఇదేనా సాంకేతిక విప్లవం?

గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక విప్లవం తీసుకొస్తామని వైకాపా ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందట గొప్పగా ప్రకటించింది. ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా ఒక డిజిటల్‌ గ్రంథాలయం నిర్మించాలని ముందుకొచ్చింది.

Published : 25 May 2024 03:51 IST

గ్రామాల్లో నత్తనడకన డిజిటల్‌ గ్రంథాలయాల నిర్మాణ పనులు
న్యూస్‌టుడే, కడప 

గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక విప్లవం తీసుకొస్తామని వైకాపా ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందట గొప్పగా ప్రకటించింది. ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా ఒక డిజిటల్‌ గ్రంథాలయం నిర్మించాలని ముందుకొచ్చింది. అనంతరం కాసుల కష్టంతో కొన్నిచోట్ల మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టాలని అనుమతులు ఇవ్వగా, ఇప్పటికీ 25 శాతం కూడా పూర్తి కాలేదు. చాలాచోట్ల నిధుల లేమితో పనులన్నీ అసంపూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా నిరుద్యోగ యువత కల సాకారం కాలేదు. 

జిల్లాలో 557 గ్రామ పంచాయతీలు, 423 సచివాలయాలు ఉన్నాయి. ప్రతిచోట ఒక వైఎస్‌ఆర్‌ డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందట కీలక నిర్ణయం తీసుకొంది. ఆధునిక వసతులతో భవనాన్ని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించాలని అనుమతిచ్చారు. తొలి దశలో 199 చోట్ల భవనాలను చేపట్టాలని ఆమోదం తెలిపారు. ఒక్కో భవనానికి నరేగా పద్దు రూ.16 లక్షలు ఖర్చు చేసేందుకు పచ్చజెండా ఊపారు. మొదటి దశ పనుల అంచనా వ్యయం రూ.31.84 కోట్లు కాగా, నిర్మాణ బాధ్యతలను. పంచాయతీరాజ్‌ సాంకేతిక శాఖకు అప్పగించారు. ఆయా గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఎంపిక చేశారు. కొన్నిచోట్ల సచివాలయం ప్రాంగణంలోకి అనువైన జాగా ఉండగా, మరికొన్ని గ్రామాల్లో మాత్రం ప్రత్యేకంగా నిర్మించాలని ఉత్తర్వులిచ్చారు. అధికార పార్టీలో రెండు వర్గాలు ఉండటంతో నిర్మాణ బాధ్యతల అప్పగింతపై పంచాయితీ జరిగింది. మాకే ఇవ్వాలని ఒక వర్గం, ఎలాగైనా మేమే చేస్తామని మరో వర్గం నాయకులు పట్టు పట్టారు. ఇరు వర్గా మధ్య సయోధ్య కుదర్చడానికి కొంత సమయం పట్టింది. అనంతరం తొలుత గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డాక్టరు వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌ పనులు చేసిన గుత్తేదారులకు సకాలంలో బిల్లులు ఇవ్వలేదు. ఇవి చేసినా కూడా డబ్బులు వెంటనే ఇవ్వరని తెలిసి చాలామంది గుత్తేదారులు వెనుకడుగు వేశారు. ఇప్పటికీ 30 కూడా పూర్తికాకపోగా, మరో 60 చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా చోట్ల గ్రహణం పట్టింది. ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లెలో నిర్మించిన భవనాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 23న, గంగపేరూరులో మార్చి 5న ప్రారంభించారు. ఇంతవరకు ఇక్కడ ఎలాంటి డిజిటల్‌ సేవలు వినియోగంలోకి రాలేదు. పెన్నపేరూరు, సాలాబాదులలో భవన నిర్మాణాలు పునాది దశ దాటలేదు. చెర్లోపల్లి, ఒంటిమిట్టలో భవనాలకు పైకప్పులు నిర్మించలేదు. రాచపల్లెలోని భవనానికి ఇంతవరకు సిమెంటు పూతలు వేయలేదు. కొండమాచుపల్లెలో అసంపూర్తిగా ఉండగా, కొత్తమాధవరంలో ముగింపు దశలో ఉన్నాయి. డి.గొల్లపల్లి, కోనరాజుపల్లెలో అసలు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. జిల్లా వ్యాప్తంగా చూస్తే అనుమతిచ్చిన భవనాల్లో మూడో వంతు కూడా పనులు పూర్తి కాలేదు. పైగా అక్కడక్కడ పూర్తయినా వినియోగంలోకి తీసుకురాలేదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల తీరు చూస్తే నత్తే నయం అన్నట్లు నత్తనడకన సాగుతున్నాయి. 


పనులు నిదానంగా జరుగుతుండడం వాస్తవమే

- శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌శాఖ, కడప  

డిజిటల్‌ గ్రంథాలయాల పనులు నిదానంగా జరుగుతుండడం వాస్తవమే. నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాలను గుర్తించి వేగవంతంగా పూర్తి చేయిస్తాం. వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని