logo

అడుగంటిన నీళ్లు... అన్నదాతలకు కన్నీళ్లు

ప్రాజెక్టులు, కాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరందిస్తామన్న హామీని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు.

Published : 25 May 2024 03:54 IST

ఇదీ బ్రహ్మంసాగర్‌ జలాశయం పరిస్థితి 
న్యూస్‌టుడే, బద్వేలు 

ప్రాజెక్టులు, కాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరందిస్తామన్న హామీని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. వర్షాభావ పరిస్థితులతో బద్వేలు నియోజకవర్గం పరిధిలోని బ్రహ్మంసాగర్‌ జలాశయంలో నీరు అడుగంటిపోయింది. ఇందులోకి నీరు నింపడంలో పాలకులు చర్యలు చేపట్టకపోవడంతో ఖరీఫ్‌లో పొలాలకు సాగునీరందే పరిస్థితి లేకుండాపోయింది. జలాశయం నిత్యం నిండు కుండలా ఉండేవిధంగా 17 టీఎంసీల నీటిని నింపుతామన్న హామీని ప్రభుత్వం విస్మరించడంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ద్వేలు ఉపఎన్నిక సందర్భంగా వచ్చిన సీఎం జగన్‌ బ్రహ్మంసాగర్‌ జలాశయంలోకి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని నింపుతామన్నారు. నియోజకవర్గంలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన మండలాల్లో కరవు పీడిత రైతాంగానికి సాగునీరందిస్తామని అర్భాటంగా ప్రకటించారు. దువ్వూరు మండలం కుందూ నదిపై రూ.400 కోట్ల పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. ఇంతవరకు పనులు చేపట్టలేదు. వ్యవసాయ రంగానికి ఆధారమైన బ్రహ్మంసాగర్‌ జలాశయంలో పూర్తి స్థాయిలో 17 టీఎంసీల నీటిని నింపిందిలేదు. దీంతో జలాశయం కింద ఉన్న 90 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. గతేడాది వర్షాభావంతో జలాశయంలోకి కృష్ణా జలాలు రాలేదు. దీంతో రబీ, ఖరీఫ్‌లలో పంటలను సాగుచేసుకునే అవకాశం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రధాన కుడి, ఎడమ కాలువల కింద ఉన్న పంట కాలువలు పూర్తి కాలేదు. కొన్నిచోట్ల లైనింగ్‌ పనులు చేయలేదు. దీంతో నీరందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక పర్యాయాలు పాలకులు, అధికారులకు రైతులు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. బద్వేలు నియోజకవర్గ రైతాంగానికి ఆధారంగా ఉన్న జలాశయానికి నీరందించి రైతులకు శాశ్వత పరిష్కారం చూపడంతో వైకాపా ప్రభుత్వం విఫలం కావడంతో అన్నదాతలు పంటల సాగుకు దూరమయ్యారు. 


పొలం బీడుగా వదిలేశాం 

 - శివారెడ్డి, రైతు, కోనసముద్రం 

నాకు బ్రహ్మంసాగర్‌ జలాశయం కుడి కాలువ కింద అయిదు ఎకరాల పొలం ఉంది. ఇంతవరకు పంట కాలువను పూర్తి చేయకపోవడంతో అసంపూర్తిగా ఉంది. పదేళ్లుగా అనేక పర్యాయాలు తెలుగుగంగ ఇంజినీర్లు, పాలకుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందన లేదు. సాగునీరందకపోవడంతో పొలాన్ని బీడుగా వదిలేశాను.


ఆయకట్టుకు సాగునీరందించలేం 

- సాయి, ఏఈ, బ్రహ్మంసాగర్‌ జలాశయం 

బ్రహ్మంసాగర్‌ జలాశయంలో 17 టీఎంసీలకు ఒకటిన్నర టీఎంసీ మాత్రమే నీరు ఉంది. ఖరీఫ్‌లో ఆయకట్టు పొలాలకు సాగునీరందించలేం. గతేడాది వర్షాభావంతో జలాశయంలోకి కృష్ణ జలాలు రాలేదు. ఈ కారణంగా రైతాంగానికి సాగునీరందించలేకపోతున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని