logo

చిన్న పిల్లాడికి పెద్ద కష్టం!

తమ పిల్లలు తోటివారితో ఆడుతూ పాడుతూ ఎదుగుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని ఎన్నో కలలు కంటుంటారు.

Published : 25 May 2024 03:56 IST

ఏడేళ్లుగా అంతుచిక్కని వ్యాధితో బాలుడికి నరకం 
ప్రభుత్వ సాయానికి తల్లిదండ్రుల ఎదురుచూపులు 
న్యూస్‌టుడే, బద్వేలు, గోపవరం
 

తమ పిల్లలు తోటివారితో ఆడుతూ పాడుతూ ఎదుగుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని ఎన్నో కలలు కంటుంటారు. అలాంటిది పుట్టినప్పటి నుంచి చిన్నారి అంతుచిక్కని వ్యాధితో నరకం అనుభవిస్తుండడం, తోటి పిల్లలు సైతం దగ్గరకు రానీయకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో బాలుడి తల్లిదండ్రులు రూ.లక్షలు అప్పులు చేసి మరీ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోవడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆ బాలుడే బద్వేలు పురపాలక సంఘం పరిధిలోని త్యాగరాజు కాలనీకి చెందిన పీరయ్య కొండమ్మల కుమారుడు జనార్దన్‌ మురుగన్‌

చిన్నారి మురుగన్‌కు ఏడేళ్ల వయసు. పుట్టుకతోనే వింత వ్యాధితో బాధపడుతున్నాడు. శరీరమంతటా మచ్చలుండడం, బిగుసుకుపోయి రక్తస్రావం కావడం, ఆయాసం, ఆహారం తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండడం, కనీసం నడిచేందుకు శరీరం సహకరించకపోవడం, మాట స్పష్టత లేకపోవడం వంటి లక్షణాలు ఆ చిన్నారిని బాధిస్తున్నాయి. తోటి పిల్లలతో ఆడుకునేందుకు పంపించాలన్నా చిన్నారి శరీర ఆకృతి చూసి తోటి పిల్లలు భయపడుతున్నారని తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. తమ కుమారుడికి వచ్చిన వ్యాధిని నయం చేయించేందుకు ఏడేళ్లుగా వారు కలవని వైద్యుడు లేరు. తిరగని ఆసుపత్రి లేదు. తమిళనాడుతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. తమ బిడ్డకు వ్యాధిని నయం చేయించాలని తల్లిదండ్రులు ఉన్నందంతా ఆసుపత్రులకు ధారపోశారు. ఇప్పటివరకు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసి చివరకు అప్పులపాలయ్యారు. కూలీనాలీ చేసుకుని బతికే తమకు బాలుడి సంరక్షణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి పరిస్థితి  చూస్తూ నిత్యం కన్నీటి పర్యంతమవుతున్నారు. వేసవిలో వ్యాధి తీవ్రంగా ఉంటుందని, శీతాకాలంలో కాస్త కుదుట పడుతుందని చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. నెలకు రూ.7 వేలు వరకు మందులకు ఖర్చవుతోందని, ఇది ఆర్థికంగా బారంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కలత చెందుతున్నారు. పింఛను మంజూరు చేయాలని కలెక్టర్‌కు విన్నవించినా స్పందన లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సాయం అందించి ఆదుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని