logo

చౌక బియ్యం.. అక్రమార్కుల భోజ్యం!

జిల్లాలో రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని అక్రమార్కులు పందికొక్కుల్లా బొక్కేస్తున్నారు. కార్డుదారులకు చేరక ముందే దోపిడీ జరిగిపోతోంది. డీలర్లకు సరఫరా చేస్తున్న దాంట్లోనూ తూకం తగ్గుతోంది.

Published : 25 May 2024 03:59 IST

ప్రొద్దుటూరు, మైదుకూరు కేంద్రాలుగా దందా
పాలిష్‌ చేసి యథేచ్ఛగా మార్కెట్లో విక్రయాలు 
ఈనాడు, కడప

జిల్లాలో రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని అక్రమార్కులు పందికొక్కుల్లా బొక్కేస్తున్నారు. కార్డుదారులకు చేరక ముందే దోపిడీ జరిగిపోతోంది. డీలర్లకు సరఫరా చేస్తున్న దాంట్లోనూ తూకం తగ్గుతోంది. జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో ఎక్కడ చౌక బియ్యం పట్టుబడినా వాటి మూలాలు ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో బయట పడుతున్నాయి. తాజాగా పలు ఘటనలు వెలుగు చూసినా కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఈ అక్రమ వ్యవహారం వైకాపాలోని కొంతమంది కీలక నేతలతో ముడిపడి ఉండడంతో అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. 

వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం రేషన్‌ మాఫియా చెలరేగిపోయింది. అక్రమార్కులు నిత్యావసరాల పంపిణీని గాల్లో దీపంగా మార్చేసి పెద్దఎత్తున చౌక బియ్యాన్ని నల్ల బజారుకు తరలిస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చౌక బియ్యం బయటపడుతూనే ఉంది. పంపిణీ చేసే దాంట్లో 30-40 శాతం పక్కదారి పడుతున్నట్లు అనధికారిక అంచనా. రాయచోటి, పీలేరు, కడప, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల నుంచి సేకరిస్తూ ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లోకి మిల్లులకు తరలిస్తున్నారు. వైకాపా నేతల అండదండలతో ఈ అక్రమ రవాణా మూడు వ్యాన్లు.. ఆరు లారీల్లా సాగిపోతోంది. పేదలకు ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొని తరలించడంతో పాటు తూకం తరుగు రూపంలో భారీగా గోదాముల నుంచి మాయం చేస్తున్నారు. కొన్ని చోట్ల పేదలకు నెలల తరబడి ఇవ్వడంలేదు. ఆ బియ్యం ఎటు పోతోందనేది ప్రశ్నార్థకంగా మారింది. పేదల బియ్యం పక్కదారితో కేంద్ర ఖజానాకు రూ.కోట్లలో నష్టం వాటిల్లులోంది. 

దాడులు... ఆపై వాటాలు!

రేషన్‌ మాఫియా అక్రమ దందా సాగిస్తున్నా అధికారులు మాత్రం నామమాత్రపు దాడులతో సరిపెడుతుండటతో అక్రమ వ్యవహారానికి అడ్డుకట్ట పడడంలేదు. గత కొన్ని నెలలుగా అక్రమార్కులు రూటు మార్చి దందా సాగిస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో చౌక బియ్యం ముఠాలు ఉన్నాయి. ప్రధానంగా ప్రొద్దుటూరులో ఏళ్ల కాలంగా అక్రమార్కులు దందా నడుపుతున్నారు. ఇక్కడ సేకరించిన బియ్యాన్ని రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో ప్రొద్దుటూరుతో పాటు ఇతర రాష్ట్రాలకు బియ్యం రవాణా చేసేవారు. తాజాగా ముఠా సభ్యులు స్థానికంగా వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నారు. పులివెందుల, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, బద్వేలు, రాజంపేట తదితర ప్రాంతాల్లోనూ చౌకబియ్యం రవాణా జోరుగా సాగుతోంది. ప్రొద్దుటూరు పట్టణంలో ప్రధానంగా గిడ్డంగివీధి, రామేశ్వరం, మిట్టమడి వీధి, సూపర్‌బజార్‌రోడ్డుకు చెందిన వ్యక్తులు కొన్నేళ్లుగా పెద్దఎత్తున దందా సాగిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ధనార్జనే ధ్యేయంగా అక్రమ వ్యాపారం చేస్తున్నా అధికారులు మాత్రం కట్టడికి చర్యలు తీసుకోవడంలేదు. వీరికి ప్రొద్దుటూరులో రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. ఒక్క ప్రొద్దుటూరులోనే ప్రతి నెలా టన్నుల కొద్దీ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారంటే ఉమ్మడి కడప జిల్లాలో ఈ దందా ఏ మేరకు జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. వీరిని కట్టడి చేయాల్సిన అధికారులు వారితో లాలూచీపడి దందాల్లో వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రూటు మార్చిన అక్రమార్కులు

ఊరూరా సేకరించిన చౌక బియ్యాన్ని కొందరు రైస్‌ మిల్లులకు తరలిస్తుండగా, మరికొందరు ఇప్పడు కొత్త పద్దతిని అనుసరిస్తున్నారు. బియ్యాన్ని స్థానికంగానే నూక చేసేందుకు ముఠా సభ్యులు యంత్రాలను సైతం కొనుగోలు చేశారు. ఒక్క ప్రొద్దుటూరులోనే దాదాపు 40 వరకూ యంత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. రామేశ్వరం, మోడంపల్లి, మండీబజార్‌ వీధి, ఈశ్వర్‌రెడ్డి నగర్, తదితర ప్రాంతాల్లో యంత్రాలు ద్వారా బియ్యాన్ని నూక చేస్తున్నారు. ఈ విధానం కడప ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ సాగుతోంది. మిల్లుల్లో పాలిష్‌ చేసి తెల్ల సంచుల్లోకి నింపి తిరిగి మార్కెట్‌లోకి పంపుతున్నారు.  

ఇంటింటికీ వెళ్లి సేకరణ

ప్రతి నెలా ప్రభుత్వం బియ్యం అందించిన వెంటనే కూలీలు వారి ఇళ్ల వద్దకు వెళ్తున్నారు. ఇంటింటికి తిరిగి బియ్యం ఉన్నాయా..అమ్ముతారా అంటూ ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ అడుగుతున్నారు. పాత పరిచయాలున్న ప్రతి ఒక్కరూ వారికి చౌక బియ్యాన్ని విక్రయిస్తున్నారు. అందుకు కొన్నిచోట్ల కిలో రూ.10 నుంచి రూ.12 చెల్లించి కొంటున్నారు. ఇలా అన్ని చోట్ల సేకరించిన బియ్యాన్ని బస్తాల్లో నింపి ఆటోలో లేదా ఇతర వాహనాల్లో బస్తాలన్నింటిని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు. చౌకబియ్యం అక్రమార్కులకు కొందరు డీలర్లు, ఎండీయూ వాహనదారులు సహకారం అందిస్తున్నారు. ఏ సమయంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న విషయం సంబంధిత అధికారులకు తెలిసినా కఠిన చర్యలు తీసుకోవడంతో వెనకడుగు వేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని