logo

మదనపల్లెలో వ్యక్తి దారుణ హత్య

మదనపల్లె పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. కట్టుకున్న భార్య కü˘్లదుటే ఆమె భర్తని కత్తులతో నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది.

Published : 26 May 2024 03:55 IST

భూ దందాలో వివాదమే కారణం
భార్య కü˘్లదుటే ప్రత్యర్థుల ఘాతుకం
హతుడు, నిందితులు వైకాపా వర్గీయులే

శేషాద్రి అలియాస్‌ శేషు (పాత చిత్రం)

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : మదనపల్లె పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. కట్టుకున్న భార్య కü˘్లదుటే ఆమె భర్తని కత్తులతో నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. భూ దందాలు చేసే అధికార పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్యన తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. హతుడు, నిందితులూ వైకాపా వర్గీయులు కావడం మదనపల్లెలో చర్చనీయాంశంగా మారింది. మదనపల్లె పట్టణానికి పుంగనూరు శేషాద్రి అలియాస్‌ శేషు (35) కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈయన మొదటి భార్య లావణ్య భర్త, కుమార్తె జెరూసను వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు.  ఈ నేపథ్యంలో శేషు కోల్‌కతాకు కారుడ్రైవర్‌గా వెళ్లి అక్కడే కమలను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె రెడ్డెమ్మ ఉంది. గత కొన్ని రోజులుగా మదనపల్లెలో వైకాపా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. దీంతో పాటు ఇదే పార్టీకి చెందిన కె.ఆనంద్‌తో కలిసి భూ దందాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మదనపల్లె ఎమ్మెల్యే పేరు చెప్పి గతంలో భూ దందాలు చేస్తుండటంతో తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యే నవాజ్‌బాషా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శేషుపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆనంద్‌తో కలిసి పనిచేయకుండా ఒక్కరే దందా సాగిస్తున్నారు. దీంతో పాటు ఇటీవల స్థానిక రామారావు కాలనీలో అంబేడ్కర్‌ విగ్రహం ఉన్నప్పటికీ మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వివాదంలో కీలక పాత్ర పోషించారు. రెండు నెలల కిందట పిఠాపురం వెళ్లి అక్కడ వైకాపా అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొని ఇటీవలే తిరిగి మదనపల్లెకు వచ్చారు. ఈ నెల 24వ తేదీన తన అనుచరులతో కలిసి బోయకొండకు వెళ్లిన అతను రాత్రి తిరిగి ఇంటికొచ్చారు. అర్ధరాత్రి దాటిన అనంతరం ఆనంద్‌ తన అనుచరులతో కలిసి శేషు ఇంటికి వెళ్లి మిద్దెపైకి తీసుకెళ్లారు. అక్కడ ఇరువర్గాలు భూ దందా విషయమై గొడవ పడ్డారు.  గొడవలో ఆనంద్, అనుచరులు శేషును కత్తితో నరకడంతో వారి నుంచి తప్పించుకుని ఇంట్లోకి తలుపులు వేసుకున్నారు.దీంతో ఆనంద్‌ వర్గీయులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి శేషు భార్య కమలను అరవనీయకుండా ఆమె గొంతుపై కత్తి ఉంచి శేషును విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపేసి పరారయ్యారు. వారు వెళ్లిన తర్వాత కమల కేకలేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండో పట్టణ సీఐ యువరాజ్, ఒకటో పట్టణ సీఐ వల్లిబసు, రూరల్‌ సీఐ శేఖర్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రి శవగారానికి తరలించారు.

హత్యాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీం

భూ దందాలే హత్యకు కారణం : డీఎస్పీ

శేషు హత్యకు ప్రధాన కారణం భూదందాలో తలెత్తిన వివాదమేనని డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.  శేషు, నిందితుడు కొండుపల్లె ఆనంద్‌లు వైకాపా పార్టీ వర్గీయులని వీరిద్దరూ కూడా బహుజన సేన సంఘంలో సభ్యులన్నారు. వీరిద్దరు కలిసి సెటిల్‌మెంట్లు, భూ దందాలు చేసేవారన్నారు. విబేధాలు రావడంతో శేషు సొంతంగా ఒక్కడే భూదందా చేస్తున్నాడన్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆనంద్‌ అతని అనుచరులు చరణ్, మణికంఠ, చెన్నారెడ్డితో పాటు మరికొందరు శేషాద్రి ఇంటికి వెళ్లి దారుణంగా హత్య చేసినట్లు తేలిందన్నారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితులను పట్టుకునేందుకు ముగ్గురు సీఐలతో కూడిన బృందాలను ఏర్పాటు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.  మృతుడి భార్య కమల, తండ్రి హరిప్రసాద్‌ల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. నిందితుడైన కొండుపల్లి ఆనంద్‌పై 2014 కేసు నమోదైందని అది కొట్టేయగా, ప్రస్తుతం 2020లో నమోదైన గొడవ కేసు విచారణలో ఉందని డీఎస్పీ వెల్లడించారు.

ముందే ఫిర్యాదు చేసిన శేషాద్రి

ఆనంద్‌తో వివాదాల నేపథ్యంలో తనకు అతని నుంచి ప్రాణహాని ఉందని శేషాద్రి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ రాత్రి అతను ఫిర్యాదు చేస్తే సిబ్బంది అతన్ని తీసుకెళ్లి ఇంటి వద్ద దించి వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కళ్లముందే భర్తను అతి కిరాతకంగా శరీరం మొత్తం తూట్లు పడేలా కత్తులతో నరకడంతో కమల షాక్‌కు గురైంది. దీనిపై డీఎస్పీ మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని