logo

పల్లెల్లో పాల వెల్లువేదీ?

వ్యవసాయ అనుబంధ రంగమైన పశుపోషణకు గడ్డుకాలం వచ్చింది. పశువుల పెంపకం భారంగా మారుతోంది. దాణా ధరలు కొండెక్కాయి.

Published : 26 May 2024 04:04 IST

ముందుకు సాగని భవన నిర్మాణాలు
పాడి రైతులకు దక్కని ఆర్థిక భరోసా

ఒంటిమిట్టలో అసంపూర్తిగా భవన నిర్మాణ పనులు

వ్యవసాయ అనుబంధ రంగమైన పశుపోషణకు గడ్డుకాలం వచ్చింది. పశువుల పెంపకం భారంగా మారుతోంది. దాణా ధరలు కొండెక్కాయి. వర్షాభావంతో గ్రాసం కొరత వెంటాడుతోంది. ఎండు గడ్డి ధరాఘాతంతో పోషకులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు మోసాలకు పాల్పడుతూ దగా చేస్తున్నారు. కొలతల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పాలు విక్రయించినవారికి సకాలంలో డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని ముందుకొచ్చి జగనన్న పాల వెల్లువకు శ్రీకారం చుట్టారు. అమూల్‌ సంస్థ ద్వారా పాలను సేకరిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. మూడున్నరేళ్లు దాటినా మూడోవంతు మండలాల్లోనే పాల సేకరణ ప్రక్రియ జరుగుతోంది. బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ (బీఎంసీయూ), యాగ్జలరీ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్‌ (ఏఎంసీయూ) భవనాల నిర్మాణ పనులు మూడడుగులు ముందుకు... ఆరడుగులు వెనక్కి అన్నట్లు నత్తనడకన సాగుతున్నాయి.

న్యూస్‌టుడే, కడప

జిల్లాలో జగనన్న పాల వెల్లువ అమలులో భాగంగా ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా ఒక్కొక్కటి చొప్పున పాల శీతలీకరణ, సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు మూడేళ్ల కిందట సంకల్పించారు. ఆ తర్వాత పాడి పశువులు, క్షీర ఉత్పత్తి ఎక్కువగా ఉన్న పల్లెలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. తొలుత 341 భవనాలు నిర్మించాలని ప్రణాళికను రూపొందించారు. ఉపాధిహామీ పథకం కింద ఒక్కో భవనానికి రూ.15.74 లక్షలు ఖర్చు చేయాలని అనుమతిచ్చారు. అనంతరం 43 బీఎంసీలకు పరిమితం చేశారు. అంచనా విలువ రూ.7.59 కోట్లు. వీటి నిర్మాణాలను పర్యవేక్షణ బాధ్యతలు పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు అప్పగించారు. నామినేషన్‌ విధానంలో వైకాపా నాయకులకు కట్టబెట్టారు. భవన నిర్మాణ సామగ్రి ఇసుక, ఇనుప చువ్వలు, ఇటుకలు, చలువరాయి, విద్యుత్తు పరికరాల ధరలు, కార్మికుల కూలీ పెరగడంతో గిట్టుబాటు కాదని అధికార పార్టీకి చెందిన గుత్తేదారులు మెలిక పెట్టారు. ఆ తర్వాత ఒక్కో భవనానికి అదనంగా మరో రూ.1.94 లక్షలు చెల్లించడానికి అనుమతిచ్చారు. ఇప్పటికీ సగం చోట్ల కూడా పూర్తవ్వలేదు. కొన్నిచోట్ల పునాది దశ కూడా దాటలేదు.

పడకేసిన ప్రగతి

  • ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు, నర్వకాటిపల్లెలో భవనాల నిర్మాణానికి మట్టి పని చేసి వదిలేశారు. రెండేళ్లుగా ఇక్కడ ఎలాంటి కదలిక లేదు.
  • సాలాబాద్‌ పంచాయతీ మలకాటిపల్లెలో సిమెంటు కాంక్రీటు ఫిల్లర్లు వేసి ఆపేశారు.
  • ఒంటిమిట్టలో నిర్మించిన భవనానికి సిమెంటు పూతలు వేయలేదు.
  • రాచపల్లెలో రంగులు వేయలేదు.
  • చింతరాజుపల్లెలో భవన నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయి.
  • గంగపేరూరులో ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ప్రారంభించినా ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేదు. ఇక్కడే కాకుండా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పనుల తీరును పరిశీలిస్తే నత్తే నయం అనిపిస్తోంది. పులివెందుల నియోజకవర్గానికి పెద్దపీట వేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇలాకాలో జరుగుతున్న పనులకు ప్రాధాన్యమిచ్చారు. మిగతా ప్రాంతాల్లో శీతకన్ను వేశారు. ఇక ఏఎంసీయూలు 84 చేపట్టాలని అనుమతి ఇచ్చారు. వీటి విలువ రూ.8.90 కోట్లు. ఇప్పటికీ నాలుగో వంతు కూడా చేపట్టలేదు. జిల్లా వ్యాప్తంగా పనుల ప్రగతి పడకేసింది. గుత్తేదారులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో చాలాచోట్ల అర్ధంతరంగా పనులు నిలిపేశారు. భవనాలు పూర్తయిన చోట్ల ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించినా యంత్ర సామగ్రి సమకూర్చకపోవడంతో అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి.

9 మండలాల్లోనే సేకరణ

గతంలో ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ, మహిళా డెయిరీ ఆధ్వర్యంలో పాల సేకరణ చేశారు. ఆయా ప్రాంతాల్లో పాల ఉత్పత్తిని పరిశీలించి బీఎంసీయూలు ఏర్పాటు చేశారు. నిర్వహణ భారం, నష్టాలు రావడంతో మూసేశారు. దీంతో పాడి రైతులు ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడాల్సి వచ్చింది. వర్తకులు ఇచ్చిన ధరతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కొలతల్లోనూ మోసాలు జరిగేవి. కొన్నిసార్లు పాలు చెడిపోయినట్లు నాటకమాడి నగదు చెల్లించకుండా ఎగనామం పెట్టే పరిస్థితులతో పశు పోషకులు తీవ్రంగా నష్టపోయారు. రూ.లక్షలు వెచ్చించి తెప్పించిన యంత్ర సామగ్రి నిరుపయోగంగా మారింది. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం పునఃప్రారంభిస్తారని పాడి రైతులు ఆశించారు. పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌ సంస్థతో మూడేళ్ల కిందట ఒప్పందం చేసుకుని జిల్లాలో  పాల సేకరణ మొదలుపెట్టారు. జిల్లాలోని పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, వేముల, వేంపల్లె, తొండూరు, చక్రాయపేట, పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె మండలాల పరిధిలోని 162 గ్రామాల్లో ఉదయం, సాయంత్రం కలిపి 20,300 లీటర్లు సేకరిస్తున్నారు. మిగతా మండలాల్లో ప్రైవేటు వ్యాపారులకే పాలను అమ్ముకోవాల్సి వస్తోంది. అమూల్‌ సేవలు మూడున్నరేళ్ల కిందట ప్రారంభమైనా ఇప్పటికీ సగం మండలాల్లో కూడా పాలను కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది.

భవన నిర్మాణాలు పూర్తిచేయిస్తాం

జిల్లాలో బీఎంసీయూ, ఏఎంసీయూల నిర్వహణకు భవనాలు నిర్మించాలని పనులు మంజూరు చేశాం. కొన్నిచోట్ల పూర్తయ్యే దశలో ఉండగా, మరికొన్ని గ్రామాల్లో నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిలిపివేసినట్లు మా దృష్టికి  కూడా వచ్చింది. ఇంకొన్ని పల్లెల్లో ఇంకా మొదలు పెట్టలేదు. నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం.

శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌శాఖ, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని