logo

అంతా దాచిపెట్టి... అంతటా దోచిపెట్టి..!

ఎంతో క్రియాశీలకమైన గనులశాఖ తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. దాదాపు తన ఉనికిని కోల్పోయింది. వైకాపా చేతిలో కీలుబొమ్మగా మారి ఆ పార్టీ నేతలకు సహజ సంపదను దోచిపెట్టింది.

Updated : 26 May 2024 04:27 IST

ఇసుకాసురులకు గనులశాఖ వత్తాసు
అమలు కాని సుప్రీంకోర్టు ఆదేశాలు
ఇసుక   రేవుల్లో ఆగని అక్రమ దందా

భారీఎత్తున తవ్వకాలతో గోతులమయంగా మారిన చిత్రావతి నదీతీరంలోని ఏటూరు ఇసుక రేవు

ఎంతో క్రియాశీలకమైన గనులశాఖ తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. దాదాపు తన ఉనికిని కోల్పోయింది. వైకాపా చేతిలో కీలుబొమ్మగా మారి ఆ పార్టీ నేతలకు సహజ సంపదను దోచిపెట్టింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా తన విధులను నిర్వర్తించలేకపోతోంది. న్యాయస్థానం ఆదేశాలను పాటించలేకపోతోంది.  

ఈనాడు, కడప

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్ఛగా కొనసాగించడంపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను ఆడ్డుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. వ్యవస్థకు వచ్చే ఫిర్యాదులను జిల్లా కమిటీలకు పంపించి వెంటనే పరిష్కరించాలని స్పష్టంగా చెప్పింది. ఫిర్యాదులు సులభంగా అందేవిధంగా ఈ-మెయిల్, టోల్‌ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని తేల్చి చెప్పింది.

 చిత్రావతి నదీతీరంలోని ఏటూరు రేవులో ఇటీవల  భారీ టిప్పర్లకు ఇసుకను నింపుతున్న యంత్రం

  • సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి పది రోజులు కావస్తున్నా జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు దిశగా ప్రయత్నాలు కనిపించడంలేదు. ఇసుక రేవుల్లో యంత్రాలతో తవ్వకాలు, టిప్పర్లు, లారీలతో రవాణా చేయడం  తాత్కాలికంగా ఆగింది. కొన్ని చోట్ల రాత్రి వేళల్లో తవ్వకాలు, రవాణా సాగుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు మిశ్రమంగా అమలవుతున్నాయి. టిప్పర్లు, లారీల స్థానంలో ట్రాక్టర్లను అక్రమార్కులు రంగంలోకి దింపారు. వీటి ద్వారా ఇసుకను తరలించి ఆపై టిప్పర్లు, లారీలకు నింపుకొంటున్నారు. దీనిపై అక్కడక్కడ పోలీసులు స్పందిస్తున్నా రెవెన్యూ, గనులశాఖలు స్పందించడంలేదు. రెవెన్యూ కంటే గనులశాఖ వైకాపా చేతిలో కీలుబొమ్మగా మారిపోయి కట్టడి చేసే ధైర్యం చేయలేకపోతోంది. కీలకమైన ఈ శాఖ తన బాధ్యతను పూర్తిగా విస్మరించి అధికార పార్టీ జేబు సంస్థగా మారిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఆచరణలో పెట్టే ప్రయత్నాలు చేయడంలేదు. రేవుల్లోకి వెళ్లి ఇసుక తవ్వకాలు, రవాణాను అడ్డుకున్న దాఖలాలూ లేవు.
  • జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కమిటీ ఏర్పాటు, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు సులభతరమైనా ఆ ప్రయత్నమే జరగలేదు. ఓట్ల లెక్కింపులో నిమగ్నమైన అధికార యంత్రాంగం ఆ పేరిట తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తోంది.  అంత వరకు తేనె తుట్టెలో వేలు పెట్టడానికి ఎవరూ సాహసించడంలేదు. రంగంలోకి దిగే పక్షంలో వైకాపా కీలక నేతల మాట పడాల్సి వస్తుందనే అభిప్రాయంతో ఉంది. ఫలితంగా జిల్లాలోని అన్ని రేవుల్లో ఇసుక దందా కొనసాగుతోంది.
  • ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్న రేవులపై నివేదిక ఇవ్వాలని గతంలోనే హైకోర్టు, ఎన్‌జీటీ గనులశాఖను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ, పోలీసు, గనులశాఖలు కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలనతో నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు రాజంపేట మండలం మందడం రేవులో నాటకీయంగా తనిఖీలు జరిగాయి. ముందస్తుగా తవ్వకాలు నిలిపివేసి అధికారులు తనిఖీ సమయంలో బాగున్నట్లుగా వాతావరణం సృష్టించారు. అధికారులు సైతం రేవుల్లో ఇసుక తవ్వకాలు జరగడంలేదంటూ తప్పుడు నివేదిక ఇచ్చారు. ఇదంతా ప్రభుత్వ ఉన్నతస్థాయి నుంచి వచ్చిన సూచనల మేరకు జరిగింది. దీంతో హైకోర్టు, ఎన్‌జీటీలకు మమ అనిపిస్తూ నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా కొన్ని నెలలుగా వ్యవహారం సాగబట్టి.. ప్రస్తుతం నదులు ధ్వంసంతో పాటు ఇసుక సైతం లేకుండా పోయింది. భూగర్భ జలాల మట్టం పాతాళానికి పడిపోయింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు