logo

పట్టపగలే రెండిళ్లలో చోరీ

మదనపల్లె పట్టణంలో ఆదివారం పట్టపగలే రెండు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడి రూ.20 లక్షలు విలువైన బంగారు, డబ్బు ఎత్తుకెళ్లిన సంఘటన సంచలనం సృష్టించింది.

Published : 27 May 2024 03:36 IST

నగలు, నగదుతో పరారీ
తాళం వేసిన గృహాలే లక్ష్యం 

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : మదనపల్లె పట్టణంలో ఆదివారం పట్టపగలే రెండు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడి రూ.20 లక్షలు విలువైన బంగారు, డబ్బు ఎత్తుకెళ్లిన సంఘటన సంచలనం సృష్టించింది. నిత్యం జనావాసం ఉండే ప్రాంతంలోనే దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి చోరీకి పాల్పడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నీరుగట్టువారిపల్లెలోని రామిరెడ్డిలేఅవుట్‌కు చెందిన చంద్రశేఖర్‌ చేనేత మగ్గాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఆయన మామ ఇటీవల మృతి చెందడంతో 11 రోజుల కార్యక్రమానికి ఇదే ప్రాంతంలోని రాజానగర్‌కు ఆదివారం కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసుకుని వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చే సరికే ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటం, వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేసి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి ఒకటోపట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ వల్లిబసు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ఇంట్లో 500 గ్రాముల బంగారు నగలు, రూ.1.50లక్షల నగదు, 2 కిలోల వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు తెలిపారు.

నీరుగట్టువారిపల్లెలోని కోళ్లబైలు రోడ్డులో నివాసం ఉంటున్న ఓబుల్‌రెడ్డి పెద్దమండ్యం మండలం వెలిగల్లుకు వెళ్లారు. ఆయన భార్య శాంతమ్మ ఇంటికి తాళం వేసుకుని మదనపల్లె మండలం మామిడిగుంపులపల్లె వద్ద ఉన్న పొలం వద్దకు వెళ్లారు. ఇదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు పగులగొట్టి ఇంట్లోని 50 గ్రాముల బంగారు, రూ.10వేల నగదు ఎత్తుకెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చిన శాంతమ్మ తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి స్థానికుల సాయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు చోరీలు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యలో జరగడంతో రెండు చోరీలు ఒకే ముఠా చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఓ యువకుడు ఇంట్లో నుంచి వెళ్లడం చూశామని ఇంటి చుట్టుపక్కల వారు పోలీసులకు తెలిపారు. రెండు ఇళ్లలో క్లూస్‌టీం బృందం వేలిముద్రలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. నిత్యం జనసంచారం ఉండే ప్రాంతం, రెండు చోరీలు మిద్దెపైన ఉండే ఇళ్లలోనే జరగడంతో ఎవరో రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఒకటోపట్టణ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని