logo

పేరుకే తితిదే అనుబంధ ఆలయాలు

జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం శ్రీపట్టాభి రామాలయం, తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కోసూరివారిపల్లె శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయాలను రెండు దశాబ్దాల క్రితమే తితిదే స్వాధీనం చేసుకుని ఈ ఆలయాల ఆలనాపాలన నిర్వహిస్తోంది.

Published : 27 May 2024 03:38 IST

ఏడాదిలో ఒక్కరోజే లడ్డు ప్రసాద వితరణ

వాల్మీకిపురం, గుర్రంకొండ, న్యూస్‌టుడే : జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం శ్రీపట్టాభి రామాలయం, తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కోసూరివారిపల్లె శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయాలను రెండు దశాబ్దాల క్రితమే తితిదే స్వాధీనం చేసుకుని ఈ ఆలయాల ఆలనాపాలన నిర్వహిస్తోంది. ఈ ఆలయాలకు ఉన్న ఎంతో ప్రాచీన చరిత్రను పరిగణలోకి తీసుకున్న తితిదే ఈ మూడు ఆలయాలను స్వాధీనం చేసుకుని నిత్య కైంకర్యాలు నిర్వహిస్తోంది. అయితే తిరుమల, తిరుపతిలోని ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాల్లో సైతం తితిదే స్వామి వారి లడ్డు ప్రసాదాలను భక్తులకు అందుబాటులో పెట్టాల్సి ఉన్నా, ఇందుకు తగిన చర్యలు తితిదే తీసుకోలేదు. జిల్లాలోని ఈ మూడు ఆలయాల్లో కేవలం ఏడాదిలో వచ్చే వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఒక్క రోజు మాత్రమే (కల్యాణోత్సవం రోజు మాత్రమే) స్వామివారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు తితిదే అందుబాటులో తీసుకొస్తుంది.

ఆ ఒక్కరోజు తితిదే ప్రసాదాల స్టాకు ఒక్క రోజులోనే భక్తులు కొనుగోలు చేసేస్తున్నారు. ఏడాదంతా ఈ ఆలయాల్లో లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాల్లో కొన్ని విశేష దినాలతో పాటు, పండగలు వస్తాయి. ఆ సమయంలో ఎక్కువ సంఖ్యలో ఆలయాలకు భక్తులు తరలి వస్తుంటారు. అయితే తితిదే మాత్రం లడ్డూ ప్రసాదాలను అందుబాటులో పెట్టక పోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు తితిదే ఆలయాల్లో తిరుమల లడ్డూను అందుబాటులోకి తెస్తే ఈ మూడు ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలతో పాటు భక్తులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు. స్థానిక ఆలయాల్లో తిరుమల లడ్డును అందుబాటులోకి తెస్తే నిరుపేదలతో పాటు స్థానిక పజలు లడ్డును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇప్పటికైనా స్థానిక ఆలయాల్లో కనీసం విశేష పర్వదినాల్లోనైనా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని తితిదే స్థానిక ఆలయాల నిర్వహణాధికారి కృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లగా విశేష దినాల్లో తిరుమల లడ్డు ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విషయం తితిదే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని