logo

దేవుడా.. సౌకర్యాలేవీ?

చారిత్రక ప్రాభవాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రాల  చెంత సమస్యలు రాజ్యమేలుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలనలోకి విలీనమైన దివ్యాలయాల్లో వసతుల కొరత వెంటాడుతోంది. యాత్రికులను అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి.

Published : 27 May 2024 03:44 IST

 పుణ్య క్షేత్రాల చెంత.. సమస్యల చింత
తితిదే విలీన ఆలయాల్లో వసతుల లేమి?

చారిత్రక ప్రాభవాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రాల  చెంత సమస్యలు రాజ్యమేలుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలనలోకి విలీనమైన దివ్యాలయాల్లో వసతుల కొరత వెంటాడుతోంది. యాత్రికులను అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. చరిత్ర పుటల్లో చెరగని స్థానం పొంది విరాజిల్లుతున్న భవ్య ఆలయాల్లో పర్యాటకులకు కావాల్సిన సదుపాయలు కల్పించడం లేదు. ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల వేళ హడావిడిగా ఏర్పాట్లు చేయడానికి రూ.లక్షలు గుమ్మరిస్తున్నారు. సాధారణ రోజుల్లో భక్తుల ఇబ్బందులను గాలికొదిలేస్తున్నారు. తాగేందుకు గుక్కెడు నీరందక గొంతెండిపోతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రివేళ బస చేయడానికి అనువైన గదుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. దేవుడా సౌకర్యాలేవీ అనే మాట సందర్శకుల నోట వినిపిస్తోంది.

ఒంటిమిట్ట, జమ్మలమడుగు, కడప (మారుతీనగర్‌), రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: ఒంటిమిట్టలో కొలువైన కోదండ రామాలయం విశిష్టమైంది. అత్యంత మహిమాన్వితం. ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత 2015 సెప్టెంబరు 9న తితిదేలోకి విలీనం చేశారు. అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెంది భాసిల్లుతోంది. రాములోరి సన్నిధికి విచ్చేసిన భక్తులు అసౌకర్యాలతో అవస్థలు పడుతున్నారు. నిలువ నీడ లేదు. చెట్ల కింద కూర్చోని సేద తీరాల్సి వస్తోంది. గత నెల 16-26 వరకు శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల వేళ ఆలయ పరిసర ప్రాంతాలు, మాడ వీధుల్లో చలువ పందిళ్లు వేశారు. ఉత్సవాలు ముగింపు తర్వాత తొలగించారు. 

రామా... కష్టాలు కనవేమిరా? 

ప్రతి నెలా రెండు, నాలుగో శనివారం తిరుమల నుంచి శ్రీవారి లడ్డూలు వెయ్యి తెప్పిస్తున్నారు. సందర్శకులు కొనుగోలు చేయడంతో ఉదయం 9-10 గంటల్లోపే ఖాళీ అవుతున్నాయి. కోటా రెండు వేల లడ్డూలకు పెంచాలని సందర్శకులు అడుగుతున్నా ఎలాంటి స్పందన లేదు. యాత్రికులు వేచి ఉన్న భవనంలో కొన్ని రోజులుగా తాగునీటి శుద్ధి కేంద్రం పనిచేయడం లేదు. ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్న దాహం కేకలతో తల్లడిల్లిపోతున్నారు. రూ.కోటి వెచ్చించి పుష్కరిణి నిర్మించారు. స్వామి వారి చక్రస్నానం ఘట్టం కోసం నీటిని నింపుతున్నారు. ఆనక జలాలను తీసేస్తున్నారు. అన్నప్రసాదం కేంద్రంలో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం పెట్టాలని ఉన్నత స్థాయిలో అనుమతిచ్చారు. ఇక్కడ కొన్ని రోజుల్లో మధ్యాహ్నం రెండు గంటలకే తలుపులు మూసేస్తున్నారు. విడిది చేయడానికి రామాలయం పక్కనే ఎలాంటి ప్రత్యేక గదుల్లేవు. కల్యాణ వేదిక ప్రాంగణంలో 19 గదులున్నా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడానికి ఇంకా వెసులుబాటు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. 

లడ్డ్డు ప్రసాదం ఏదీ?

ప్రతి నెలా పౌర్ణమి వేళ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నారు. టికెట్టుకు రూ.వెయ్యి రుసుం చెల్లించిన వారికి ఇక్కడ తిరుమల తరహాలో ఇక్కడ లడ్డూ, వడ ఇవ్వడం లేదు. పులిహోర పొట్లంతో సరిపెట్టెస్తున్నారు. తిరుమల దర్శనం కోసం ఇక్కడ టిక్కెట్ల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అడుగుతున్నా ఉలుకూపలుకు లేదు. నిఘా నేత్రాలు పనిచేయడం లేదు. కునుకు తీస్తున్నా బాగు చేయాలనే మాటను విస్మరించారు. విమాన, తూర్పు గోపురంలో శిల్పాలు కళాహీనంగా దర్శనమిస్తున్నాయి. శిరస్సు, కాళ్లు, చేతులు విరిగిపోయాయి. పూర్వాకృతి తీసుకొస్తామని చెబుతున్నా ఇంతవరకు ఎలాంటి కదలిక లేదు. గో పూజ సేవలను 2021 డిసెంబరులో ప్రారంభించి కొన్నాళ్లకే ఆపేశారు. ఇమాంబేగ్‌ బావి నిండా పూడిక చేరింది.

తిరుమలేశుని తొలి గడపలోనూ అవస్థలే

తిరుమలేశుని తొలి గడపగా ఖ్యాతి పొందిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. మహిళలకు ప్రత్యేకంగా స్నానపు గదులను ఏర్పాటు చేయలేదు. ఆలయానికి సమీపంలో ఇరుకైన రహదారులు ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో, ప్రతి నెలా జరిగే కల్యాణం, ఉత్సవాలు, వివాహాలు జరిగేటప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వాహనాలు నిలుపడానికి అనువైన పార్కింగ్‌ స్థలం లేక వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకైన దారులతో ట్రాఫిక్‌ జఠిలంగా ఉంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఒకటిన్నర దశాబ్దం కిందట తితిదే స్వాధీనం చేసుకున్నా ఇప్పటికీ ఇక్కడ అన్నదానం చేయడం లేదు. భక్తుల సహకారంతో ప్రతిరోజూ 50-100 మంది, శనివారం 250-300 మందికి ఆకలి తీర్చుతున్నారు. మరుగుదొడ్లు కూడా సరిపడా లేవు.

అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకపై నిర్లక్ష్యం

పదకవితా పితామహుడు అన్నమాచార్యుల జన్మస్థలి రాజంపేట మండలం తాళ్లపాకను తితిదే రెండు దశాబ్దాల కిందట దత్తత తీసుకొంది. ఆ తర్వాత కొన్ని మౌలిక వసతులు కల్పించినప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. చెన్నకేశవ ఆలయంలో ఉన్న ధ్యానమందిరం శిథిలావస్థకు చేరింది. కూలేందుకు సిద్ధంగా ఉన్నా మరమ్మతులు చేయడం లేదు. దాతలు ఇచ్చిన ఆర్వో కేంద్రం పరికరాలను అమర్చకుండా పక్కనపడేశారు. గుడిలో కొలువుదీరిన దేవదేవువుడికి హారతి ఇవ్వడానికి అవసరమైన దూపం, కర్పూరం కూడా సరఫరా చేయడం లేదు. ఆలయాల పర్యవేక్షణ చేయడానికి నియమించిన అధికారి కూడా ఇక్కడ ఉండటం లేదు. తిరుమలలో శ్రీవారి ఉచిత దర్శనం కోసం గతంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మూసివేశారు. ఇదివరకు అన్నమయ్య జయంతి, వర్ధంతి వేడుకలు, వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు విక్రయించగా ఇప్పుడు అది నిలిపివేశారు. తాళ్లపాకలో వేద పాఠశాల, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వెళ్లినా ఆచరణకు నోచుకోలేదు. ఇక్కడే ఉన్న చెరువును సుందరీకరణ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా అమలు కాలేదు. అన్నమయ్య సంకీర్తనలు శ్రావ్యంగా వినడానికి మైకులు కూడా లేవు. 


విడిది... ఎంత కష్టం

నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయ దర్శనం కోసం విచ్చేసే భక్తులు విడిది చేయడానికి ఇక్కడ ఎలాంటి గదుల్లేవు. ఆర్వో కేంద్రం సక్రమంగా పనిచేయడం లేదు. ఆలయంలోకి వృద్ధులు, దివ్యాంగులు ప్రవేశించడానికి అనువుగా నడవా (ర్యాంపు) ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. యాత్రికుల ఆకలి తీర్చడానికి అన్న ప్రసాదం భాగ్యం లేదు. వాహనాల పార్కింగ్‌ లేదు. రక్షణ గోడ కూలిపోయింది. 


ప్రారంభానికి నోచుకోని శ్రీవారి ఆలయం

రాజంపేట మండలం బోయనపల్లిలో అన్నమయ్య 108 విగ్రహం ప్రాంగణంలో తితిదే ఆధ్వర్యంలో రూ.82 లక్షలు వెచ్చించి శ్రీవారి ఆలయాన్ని నిర్మించారు. ఇంత వరకు ప్రారంభించలేదు. అదిగో కొబ్బరికాయ కొడతాం.. ఇదిగో పూజలకు అనుమతి ఇస్తామని అధికారుల నోట తరచూ వినిపిస్తోంది. ఇంత వరకు శ్రీనివాసుడి సన్నిధిలో పూజా కైంకర్యాలు జరగలేదు. ఊంజల్‌ సేవల కోసం శాశ్వత భవనం నిర్మించినా వినియోగించడం లేదు. ఉద్యాన వనాల నిర్వహణ అధ్వానంగా ఉంది. సక్రమంగా నీరు పట్టకపోవడంతో హరిత శోభ ప్రకాశించలేదు. ఈ ప్రాంతం కళాహీనంగా కన్పిస్తోంది. మరుగుదొడ్లపై అంతులేని నిర్లక్ష్యం చేస్తున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి అనువైన ఆట వస్తువులను అమర్చలేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని