logo

నారాపుర... పట్టించుకోరా?

జమ్మలమడుగులో నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 2008 అక్టోబరు 23న తితిదేలోకి విలీనం చేశారు.

Published : 27 May 2024 03:47 IST

న్యూస్‌టుడే, జమ్మలమడుగు:  జమ్మలమడుగులో నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 2008 అక్టోబరు 23న తితిదేలోకి విలీనం చేశారు. ఆ తర్వాత సమస్యలు తీరలేదు. ఇక్కడ 36 మంది సిబ్బందికిగాను కేవలం తొమ్మిది మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రసాదం తయారీలో ఒక్కరే ఉన్నారు. మరొకరు కావాలి. అదేవిధంగా కసువు శుభ్రం చేయడానికి మరో ఇద్దరు అవసరం ఉంది. మహిళా ఉద్యోగులు ఉన్నా అతివల కోసం ప్రత్యేకంగా శౌచావాలయం ఏర్పాటు చేయలేదు. తాగునీటి సమస్య నెలకొంది. చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో మందు బాబులకు అడ్డాగా మారింది. కోడి మాంసం వ్యర్థాలు, ఇతర చెత్తను సమీపంలో వేస్తున్నారు.

ఆలయంలో వెనుక వైపున జూదమాడుతున్నారు. గుడి ప్రాంగణం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ప్రైవేటు వాహనదారులు ఆలయ స్థలాన్ని పార్కింగ్‌ కోసం వాడుకుంటున్నారు. రెండేళ్లుగా నైవేద్యం తయారు చేయడానికి ఒక్కరే ఉన్నారు. ఆయన రాకపోతే ఆ రోజున శ్రీనివాసుడికి ప్రసాదం భాగ్యం ఉండదు. సెలవు రోజులు, శనివారం నాడు సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందరికీ సరిపడేలా ప్రసాదాలు అందటం లేదు. ఆలయ ఆవరణలో తితిదే కల్యాణ మండపాన్ని 1988 మార్చి 20న ప్రారంభించారు. అప్పట్లో నామమాత్రం రుసుం వసూలు చేసేవారు. రానురాను నిర్వహణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. వంట గది, వధువు, వరుడికి కేటాయించే గదులు దెబ్బతిని కూలిపోయాయి. దాంతో మూసివేశారు. కల్యాణ మండపాన్ని పునర్నిర్మాణం చేస్తే పేద, మధ్య వర్గాలు శుభ కార్యాలు, పెళ్లిలు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని