logo

అందాల సిరి... ఆహ్లాద ఝరి

వేసవి ముగుస్తున్న తరుణంలో బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా వస్తున్నారు.

Published : 27 May 2024 03:50 IST

హార్సిలీహిల్స్‌కు పెరుగుతున్న తాకిడి
మౌలిక సదుపాయాలు విస్మరించిన సర్కారు

వేసవి ముగుస్తున్న తరుణంలో బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సందర్శకులు అందాల కొండను చూసి ఆనందపరవశులయ్యారు. కొత్త, పాత వ్యూపాయింట్లతో పాటు గాలిబండ ప్రాంతంలో పర్యాటకుల సందడి కన్పించింది. బెంగళూరు నుంచి ద్విచక్ర వాహనాల్లో వచ్చిన యువకుల బృందం కొండను సందర్శించి తిరుగు ప్రయాణమైంది. బస్సులు, మినీ లారీలు, కార్లతో పాటు ద్విచక్ర వాహనాల్లో పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి అధికంగా వచ్చారు. ఇన్నాళ్లూ వేసవి తాపంతో తల్లడిల్లిపోయిన సందర్శకులు కొండపైన ఆహ్లాదకరంగా గడిపారు.  చిన్నారులు ఆట పాటలతో సందడి చేశారు. మానస సరోవరంలో బోటింగ్‌ చేసేందుకు పోటీ పడ్డారు. వాస్తవానికి మొన్నటి వరకు సందర్ళకులు లేక కొండ కళ తప్పింది. అయితే ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలతో వాతావరణ పరిస్థితులు మారి సందర్శకులు హార్సిలీహిల్స్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు నష్టపోయిన పర్యాటక రంగం.. ప్రస్తుతం పుంజుకుంటున్న రద్దీతో కొంతమేరకైనా కోలుకుంటుందన్న ఆశాభావంతో వ్యాపారులున్నారు. 

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: ఆంధ్రా ఊటిగా పేరుగాంచిన హార్సిలీహిల్స్‌లో ఈసారి వేసవి సీజన్లో పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. సముద్రమట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ వేసవి కాలపు ఎండలతో పాటు ఉక్కపోత అధికంగా కన్పించింది. వర్షాలు కురవకపోవడంతో కొండ పరిసర ప్రాంతాల్లో పచ్చదనం కరవైంది. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఎన్నికల నియమావళి కారణంగా వాహనాల తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొండకు వచ్చేందుకు సందర్శకులు వెనుకంజ వేశారు. ఈ ప్రభావం మే నెల రెండోవారం వరకు కొనసాగింది. పర్యాటక, అటవీశాఖలతో పాటు వివిధ రకాల వ్యాపారులు నష్టాల పాలయ్యారు. 

సౌకర్యాలు కనం... భద్రత శూన్యం

పర్యాటకులు పెరుగుతున్నా అయిదేళ్లుగా ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు చాలినన్ని లేకపోగా, గాలిబండపై మందుబాబులు హల్‌చల్‌ సాగుతోంది. మద్యం తాగి అక్కడే సీసాలు పగలగొట్టి వెళ్తుండడంతో గాజుపెంకులు స్వాగతం పలుకుతున్నాయి. ప్రేమికుల జంటలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మద్యం మత్తులో ఏదైనా జరగరాని ఘటనలు చోటుచేసుకుంటే ఎవరిది బాధ్యత అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుశాఖ సీఎం చేతుల మీదుగా ఆర్భాటంగా ప్రారంభించిన పోలీస్‌ అవుట్‌ పోస్టు కాగితాలకే పరిమితమైంది.ఈ నెలలో కురిసిన వానలతో కొండపై పచ్చదనం పెరిగింది. ద్విగుణీకృతమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు వాతావరణం చల్లబడింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ పర్యాటకుల రాకపోకలకు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. అందుకే వేసవి సెలవులు ముగిసిపోతున్నందు వల్ల తమ చిన్నారులతో కలసి కొండపైకి సందర్శకులు వస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరి... కొత్తశోభను సంతరించుకున్న కొండను చూసి వెళ్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత రద్దీ మరింత పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న రెండు నెలలపాటు పర్యాటకుల సందడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా గత వారం రోజులుగా తమ అతిథి గృహాలకు పర్యాటకుల తాకిడి పెరిగిందని హార్సిలీహిల్స్‌ పర్యాటకశాఖ మేనేజరు సాల్విన్‌రెడ్డి తెలిపారు. వేసవిలో వ్యాపారం తగ్గినా... ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడుతోందని తెలిపారు. గత వారం రోజులుగా కొండపై వ్యాపారం ఆశాజనకంగా సాగుతోందని దుకాణ యజమానులు తెలిపారు. ఈ సీజన్లో సందర్శకులు రాకపోవడంతో నష్టపోయిన తాము ఇప్పుడైనా లాభాల్లో వస్తామన్న నమ్మకంతో ఉన్నామని ఓ దుకాణ యజమాని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు